Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో..

8 Mar, 2023 12:49 IST|Sakshi
లలిత మనీషా

రాజ్‌భవన్‌లో.. సోమవారం, మార్చి 6న హైదరాబాద్‌ గవర్నర్‌ తమిళిసై కొంతమంది మహిళలకు సత్కారం చేశారు. అదే సందర్భంగా ఏర్పాటైన గాత్ర కచ్చేరిలో అందరి దృష్టి లలిత మనీషా మీద పడింది. అందుకు కారణం ఆమె డోలు వాద్యం పై విన్యాసం చేస్తూ ఉండటమే.

తెలుగునాట నాదస్వరం వాయించే స్త్రీలు కొద్దిమందైనా ఉన్నారు. కాని డోలు వాయించే వారు అతి తక్కువ. రెండు రాష్ట్రాలకు కలిసి డోలు విద్వాంసురాలిగా ఇటీవల గుర్తింపు పొందుతున్నది 24 ఏళ్ల లలిత మనీషా.

తెనాలి అమ్మాయి
లలిత మనీషాది తెనాలి. వీరి తల్లి మస్తాన్‌బీ, తండ్రి షేక్‌ వెంకటేశ్వర సాహెబ్‌ నాదస్వర విద్వాంసులు. ఇద్దరూ వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మస్తాన్‌ బీ వంశంలో 300 వందల ఏళ్లుగా నాదస్వరం కొనసాగుతూ ఉంది. అయితే డోలు వాయించిన మహిళలు లేరు. మస్తాన్‌ బీకి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి నాగ భ్రమరాంబ గాత్ర విద్వాంసురాలిగా శిక్షణ తీసుకుంది.

ఇప్పుడు చదువు నిమిత్తం అమెరికా వెళ్లింది. చిన్నమ్మాయి లలిత మనీషా డోలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపింది. ‘నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు వరుసకు వదిన అయ్యే ఒకామె డోలు నేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు రాలేదు. నేను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. నాకు వచ్చేసింది. డోలు వాయిద్యానికి తాళంతో పాటు శక్తి కూడా కావాలి. నాలో అవి రెండూ గమనించి మా అమ్మా నాన్నలు ప్రోత్సహించారు’ అంటుంది మనీషా.

కుంభకోణం వెళ్లి
డోలు వాయిద్యాన్ని సాధన చేయాలంటే ఇక్కడ అనుకూలంగా లేదని తొమ్మిదో తరగతి డిస్కంటిన్యూ చేసి కుంభకోణంలో డోలు విద్వాంసుడు టి.ఆర్‌.సుబ్రహ్మణ్యం దగ్గర సంవత్సరం పాటు శిష్యరికం చేసింది లలిత మనీషా. గురువు ఇంట్లోనే ఉంటూ డోలు నేర్చుకుని వచ్చింది. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్‌ కోర్సు, డిప్లమా కూడా పూర్తి చేసింది.

డిగ్రీ ఉండాలి కనుక బీసీఏ చేసి డోలు వాయిద్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకుంది. ఆ కోర్సు అన్నామలై యూనివర్సిటీ కింద చిదంబరంలో ఉంది. ‘అక్కడ మా బేచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటే నేనొక్కదాన్నే అమ్మాయిని. అందుకని నన్ను అందరూ బాగా చూసుకునేవారు.

మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా డోలు వాద్యం మగవారిదే అని భావించడం వల్ల ఇప్పటి వరకూ ఒక్క ఆడపిల్ల కూడా ఆ కోర్సు చేయలేదు. దాంతో మొత్తం దేశంలోనే డోలు వాయిద్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన ఏకైక అమ్మాయిగా నేను నిలిచాను’ అంటుంది మనీషా. నిజంగా ఇది తెలుగువారి గర్వకారణమే.

మంగళవాయిద్యం
డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. దక్షిణ భారతంలో శుభకార్యక్రమాలకు సన్నాయి మేళం తప్పనిసరి. అయితే కర్నాటక సంగీతంలో కూడా సన్నాయి, డోలు ప్రాశస్త్యం మెండుగా ఉంది. డోలు సహ వాయిద్యంగా ఉంటోంది. ‘గాత్ర కచ్చేరిలో గాని వయొలిన్, ఫ్లూట్‌ కచ్చేరిలో గాని మృదంగాన్ని సహ వాయిద్యంగా తీసుకుంటారు. డోలును కూడా తీసుకునేవారు ఉంటారు.

కర్నాటక సంగీతంలో డోలు వాయిద్యకారిణిగా నేను గుర్తింపు పొందాలనుకుంటున్నాను. డోలు వాయించడానికి 108 రకాల తాళాలు ఉన్నాయి. ఉద్దండులు లోతుకు వెళితే ఇంకా వినూత్న తాళాలు వేస్తారు. నేను ఇప్పటి వరకూ 35 రకాల తాళాలు డోలు మీద వేయగలను. మా అమ్మా నాన్నలతో కలిసి అనేక కచ్చేరీలు చేస్తున్నాను.

శ్రీశైలం, భద్రాచలం, హరిద్వార్, పూరీ, ద్వారకా, కాశీ పుణ్యక్షేత్రాలలో కచ్చేరీలు ఇచ్చాను. అలాగే తమిళులు డోలు, సన్నాయి కచ్చేరీలను ఇష్టపడతారు. వారి ఆహ్వానం మేరకు మదురై, తంజావూరు... ఇలా అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఇంకా నేను చాలా సాధించాల్సి ఉంది’ అంది మనీషా.
– ఇన్‌పుట్స్‌: బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి 

మరిన్ని వార్తలు