అరగ్లాసు ప్రైజ్‌ మనీ

5 Oct, 2020 07:58 IST|Sakshi

ఒక కుండలో నీళ్లు ఉన్నాయి.  ఇద్దరు ఎండనపడి వచ్చారు. ఒక స్త్రీ.. ఒక పురుషుడు.  నడిచొచ్చింది సమాన దూరం.  మోసుకొచ్చింది సమాన భారం. పురుషుడికి గ్లాసు నిండా నీళ్లిచ్చి..  స్త్రీకి అరగ్లాసు ఇస్తే ఏమిటర్థం?! ఆమెది నడక కాదనా?  ఆమెది బరువు కాదనా?  ఆమెసలు మనిషే కాదనా? ఎండ ఈక్వల్‌ అయినప్పుడు.. కుండా ఈక్వల్‌ అవాలి కదా!

ఇప్పుడు కొంచెం నయం. ఉండండి, 83 శాతం అంటే కొంచెం కాకపోవచ్చు. చాలా నయం. ఎనభై మూడు శాతం క్రీడాంశాలలో స్త్రీ, పురుషులన్న వ్యత్యాసం చూపకుండా ‘ఈక్వల్‌ పేమెంట్‌’ ఇస్తున్నారు! బి.బి.సి. రిపోర్ట్‌ ఇది. బి.బి.సి. మీడియాలో కూడా ఆమధ్య ఒకరిద్దరు పైస్థాయి మహిళా ఉద్యోగులు జాబ్‌ని వాళ్ల ముఖాన కొట్టేసి బయటికి వచ్చేశారు. జార్జికి వంద పౌండ్లు ఇస్తూ, అదే పనికి ఒలీవియాకు 60 పౌండ్లు ఇస్తుంటే ఎవరైనా అదే పని చేస్తారు. ఇదిగో, ఇలా అడిగేవాళ్ల వల్లనే ఎప్పటికైనా మహిళలకు సమాన  ప్రతిఫలం వస్తుంది. ఫురుషులతో సమానంగా. 

మన దేశంలో ఇలా అడిగినవాళ్లు.. స్పోర్ట్‌లో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. తక్కినవాళ్లూ ‘పేమెంట్‌లో ఏంటీ పక్షపాతం!’ అని అంటూనే ఉన్నా.. ప్రధానంగా సానియా మీర్జా, దీపికా పల్లికల్, అతిది చౌహన్, అపర్ణా పపొట్, మిథాలీరాజ్‌ ఎప్పటికప్పుడు ఈ ఎక్కువతక్కువల్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఐపీఎల్‌నే తీస్కోండి. పురుషులు ఆడేదీ అదే ఆట, స్త్రీలు ఆడేదీ అదే ఆట. వచ్చే క్యాష్‌ మాత్రం స్త్రీలకు తక్కువ. టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్క్వాష్‌.. ఏదైనా వీళ్లకు వచ్చేది వాళ్లకు ఇచ్చే దాంట్లో నాలుగింట ఒక వంతు తక్కువే! ‘‘మీకు న్యాయంగా అనిపిస్తోందా.. తక్కువ చేసి ఇవ్వడానికి’’ అని ఉమెన్‌ ప్లేయర్స్‌ అడిగితే.. ‘‘స్పాన్సరర్స్‌ రాకుంటే మేమైనా ఏం చేస్తాం. పురుషులు ఆడితే చూసినంతగా, స్త్రీలు ఆడితే చూడరు. ఉమెన్‌ ఈవెంట్‌లకు ఖర్చు తప్ప, లాభం ఎక్కడిది!’’ అని సమాధానం. నిజమే కదా పాపం అనిపించే అబద్ధం ఇది. డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు ఇవ్వడానికే మనసు రాదు. 
∙∙ 
మార్చిలో ఒక సర్వే రిపోర్ట్‌ వచ్చింది. అదీ బి.బి.సి. వాళ్లదే. పురుషులతో సమానంగా మహిళలకూ పారితోషికం, ఇతరత్రా బెనిఫిట్స్‌ ఇవ్వాలని ఎక్కువమంది ఇండియన్‌ క్రీడాభిమానులు అంటున్నారట. అంటే వాళ్లు స్పోర్ట్స్‌ని చూస్తున్నారు కానీ, స్పోర్ట్స్‌ ఉమన్‌ అని స్పోర్ట్‌మన్‌ అనీ చూడ్డం లేదు. పైగా పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సర్వేలో నాలుగింట మూడొంతుల మంది.. ఆటల్ని ఇష్టపడేవాళ్లే. సినిమాలు, పొలిటికల్‌ న్యూస్‌ లేకున్నా బతికేస్తాం కానీ, కళ్లముందు ఏదో ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌ లేకుంటే ఆ పూటకు బతికినట్లే ఉండదని కూడా చెప్పారట. వాళ్లకు కోహ్లీ అని, మిథాలీ అని కాదు. క్రికెట్‌ కావాలి. సెరెనా అనీ, జకోవిచ్‌ అని కాదు. టెన్నిస్‌ కావాలి. ‘కోహ్లీనే కావాలి’ అని వాళ్లు అడిగినా మిథాలీకి రెమ్యునరేషన్‌ తగ్గించడం కరెక్టు కాదు.

గెలిచేందుకు పెట్టే ఎఫర్ట్‌.. ఆ కష్టం.. వాటికి మనీని తగ్గించి ఇవ్వడం క్రీడాకారిణుల ప్రతిభను, తపనను, శ్రమను తక్కువగా చూడటమే. ఈ అసమానత్వాన్ని ప్రశ్నించకుండా రిటైర్‌ అయిపోతే, తమకు తాము అన్యాయం చేసుకోవడం మాత్రమే కాదు, కొత్తగా వచ్చేవాళ్లకూ అన్యాయం చేసినట్లే. అందుకే క్రీడాకారిణులు గళం విప్పుతున్నారు. తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రీడా క్లబ్బులు, ఆసోసియేషన్‌లు, ఫెడరేషన్‌లు, కౌన్సిళ్లు, లీగ్‌లు, బోర్డులు, కమిటీలు.. ‘ఈక్వల్‌ పే’ అమలు చెయ్యడానికి అతి కష్టం మీదనైనా ఒళ్లొంచుతున్నాయి.

నాలుగేళ్లు నిరసన
భారతదేశపు అత్యుత్తమస్థాయి స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌.. ప్రైజ్‌ మనీలోని అసమానతలకు నిరసనగా 2012 నుంచి 2015 వరకు వరుసగా నాలుగేళ్లు ‘నేషనల్‌ స్క్వాష్‌ చాంపియన్‌ షిప్‌’ను బాయ్‌కాట్‌ చేశారు. ‘స్పోర్ట్స్‌మ్యాన్‌ స్పిరిట్‌ లేదు. డబ్బే ముఖ్యమా!’ అని ఆమెపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన నిర్ణయం మీద తను ఉన్నారు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రైజ్‌ మనీ సమానంగా ఉండేంత వరకు నేషనల్స్‌ ఆడేది లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమె ర్యాంకింగ్‌ పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండేది!  

నేటికీ తక్కువే
మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు.. దేశానికి ఎంత గర్వకారణం! అయినా వివక్ష ఉంటోంది. స్త్రీ పురుష సమానత్వం, సాధికారత అని ఎంత మాట్లాడుకున్నా మనమింకా పురుష ప్రపంచంలోనే జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. మన క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ, క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్‌ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా తక్కువగానే ఉంటోంది.   
– సానియా మీర్జా, టెన్నిస్‌ స్టార్‌ (నిరుడు ‘ఫిక్కీ’ చర్చా వేదికపై)

ఆటతో సాధించొచ్చు
ఈక్వల్‌ పే ఉండాలి. ఈక్వల్‌ ప్రైజ్‌ మనీ ఉండాలి. ఆట తీరుతో కూడా వీటిని సాధించవచ్చు. గుడ్‌ బ్రాండ్‌ క్రికెట్‌ ఆడితే మంచి మార్కెటింగ్‌ జరుగుతుంది. మ్యాచిల వల్ల ఆదాయం వస్తుంది. పురుషుల ఆటల్లో వచ్చే లాభాల్లోంచి మాకేం పంచి పెట్టనక్కర్లేదు. మా విజయాల్లోని షేర్‌ను తీసుకోడానికే మేము ఇష్టపడతాం. మొత్తానికైతే పారితోషికాల విషయంలో మునుపటి కన్నా కొంత బెటర్‌ అయ్యాం.
– మిథాలీ రాజ్, స్టార్‌ క్రికెటర్‌ (ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో)

నమ్మకంగా చెప్పలేం
ఆర్థికంగా కొంచెం మెరుగయినట్లే ఉంది. అయితే ఈక్వల్‌ ప్లేకి ఈక్వల్‌ పే ఉందా అని నమ్మకంగా చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. పురుషులకు సమానంగా స్త్రీలకు ప్రైజ్‌ మనీ ఇవ్వాలి. 
– అపర్ణా పొపట్, బాడ్మింటన్‌ (గత ఏడాది ఎకనమిక్‌ టైమ్స్‌ ‘పనాచ్‌’ రౌండ్‌ టేబుల్‌ చర్చలో)

పోలికే లేదు
ప్రైజ్‌ మనీలోనే కాదు, అన్నిట్లోనూ మహిళా జట్లు, మహిళా క్రీడాకారులకు వివక్ష ఎదురౌతోంది. పురుషుల ఫుట్‌బాల్‌తో మహిళల ఫుట్‌బాల్‌ను పోల్చనే లేము. వాళ్ల లీగ్‌తో మా లీగ్‌ను పోల్చలేం. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ని (సక్సెస్‌ అయ్యేందుకు ఉండే అవకాశం) కూడా కంపేర్‌ చెయ్యలేం. ప్రతి దాంట్లోనూ ఇంతని చెప్పలేనంత అసమానత్వం ఉంది. 
– అదితి చౌహాన్, ఫుట్‌బాల్‌ గోల్‌ కీపర్‌ 

మరిన్ని వార్తలు