మంచి మాట: మాటల పాఠాలు

14 Nov, 2022 00:56 IST|Sakshi

ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. 

మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్‌). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్‌ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే.

లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు  ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు.

ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం.

– రోచిష్మాన్‌ 

మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని  అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు.

మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం.

మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు.
మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. 

మరిన్ని వార్తలు