నీలోని నువ్వు చెప్పేది విను...చాలు

27 Feb, 2023 01:43 IST|Sakshi

ధర్మం చెప్పడానికి లోకంలో ఉన్న ఐదు ప్రమాణాలలో ఒకటి అంతరాత్మ ప్రబోధం. అది మనిషికి ఎప్పుడూ లోపల ఉండే ధర్మాన్ని చెబుతుంటుంది. చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు... లోపలినుంచి ఒక సణుగుడు వినిపిస్తుంటుంది. ‘‘ఎందుకు చేస్తున్నావు... నలుగురి లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు. తప్పుచేసి మచ్చ తెచ్చుకోకు, నామాట విను... దానికి దూరంగా ఉండు..’’అని లోపలి నుంచి ఘోషిస్తుంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా ఒక్క అంతరాత్మ మాత్రమే ఒక ప్రశ్నతో మిమ్మల్ని నిలదీస్తుంటుంది.

‘ఇది చేయవచ్చా ?.. అని! అలా నిలదీస్తున్నందుకు దాని గొంతు పిసికేయకూడదు. అదేం చెబుతుందో ఓపికగా విని ఆలోచించినవారిని ‘‘శ్రద్ధ కలిగిన వారు’’ అంటారు. అలా ఎందుకడుగుతుంది అంటే... అప్పటికే ఆయన.. శారీరక, మానసిక సుఖాలకోసం దిగజారిపోయాడు. అయినా అది మాత్రం హెచ్చరిస్తూనే ఉంటుంది. దాని మాట విన్నవాడు మహాత్ముడవుతాడు.

శరీరంలో శక్తి, ఇంద్రియాలకు పటుత్వం, మనసులో విజృంభణ ఉందని సుఖాన్ని పొందడం మంచిది కాదు. ఎవరూ కూడా మొదటినుంచే నూరు శాతం నిలకడగా ఉండలేరు. అది అంత తేలికేం కాదు కూడా. కానీ లోపలిమనిషి చెబుతున్నవాటిని శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే.. క్రమేణా ఆచరణలో కూడా అలవాటవుతుంది. అదే ధర్మంగా నడుచుకోవడం అంటే. 

మహాత్మాగాంధీ మొదటిసారి లండన్‌ బయల్దేరుతున్నప్పుడు... మద్యం, మాంసం, మగువలకు వశపడే అవకాశాలు అక్కడ ఎక్కువని వినడం వల్ల తల్లి అనుమతి నిరాకరించింది. వారి కుటుంబ శ్రేయోభిలాషి అయిన ఒక స్వామీజీ జోక్యం చేసుకొని ..‘‘ఏ కారణం చేత కూడా ఈ మూడింటికీ వశపడను’’ అని తల్లికి ప్రమాణం చేయించి పంపారు. తల్లి భయాలే నిజమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఒక స్త్రీతో ఆయనకు హద్దులు దాటిన సంబంధం ఏర్పడుతున్న క్షణాల్లో ఉన్నట్టుండి అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది. ఆయన వెంటనే వెళ్ళిపోయి.. తరువాత ఆ స్త్రీకి నిజాయితీగా ఒక ఉత్తరం రాస్తూ... తనకు పెళ్ళయిందనీ, ఒక కుమారుడు కూడా ఉన్నాడనీ, ముందుగా ఈ విషయాలు చెప్పకపోవడం తప్పేనని, తనను క్షమించాలని కోరాడు. అదీ అంతరాత్మ ప్రబోధం అంటే. అదీ లోపలున్న మనిషి మాటను నువ్వు వినడం అంటే.. ఇటువంటిదే మరో సంఘటన జరిగినా.. మనసు మాట విని దానికి దూరంగా జరిగాడు... వీటిని నెమరేసుకుంటూ ఆయన ఇలా రాసుకున్నారు...

‘‘భక్తి అనేది మనిషిలో ఉన్న విశృంఖలత్వాన్ని తుడిచేస్తుంటుంది. ఇంటిని ఏ కారణం తో శుభ్రపరుచు కుంటుంటామో... మనసును కూడా భగవద్భక్తి అనే చీపురుపట్టి లోపలి మాలిన్యాలను శుభ్రపరుచుకుంటుండాలి. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు అంతరాత్మ మాట విని ధర్మమార్గంలోనే నడుస్తుంటుంది. సుఖాలకోసం పక్క చూపులు చూడదు.’’

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు