ఉద్యోగానికి డబ్బులు ఎదురివ్వాలా?!

1 Jul, 2021 02:13 IST|Sakshi

‘‘మేడమ్, మా కంపెనీ లో మీకు జాబ్‌ కన్ఫర్మ్‌ కావాలంటే మా నిబంధనలన్నీ పాటించాలి. మీకు కొన్ని పేపర్స్‌ పంపిస్తాం. వాటి మీద మీరు సంతకాలు చేయాలి. అలాగే, మీ జాబ్‌ కన్ఫర్మ్‌ అనడానికి మీరు మా కంపెనీ అకౌంట్‌లో పదివేల రూపాయలు డిపాజిట్‌ చేయాలి. మీ వర్క్‌ పట్ల మా కంపెనీ పూర్తి సంతృప్తికరంగా ఉంటే మీకు పదిహేను రోజుల్లో మీరు చేసిన డిపాజిట్‌ నుంచి 50 శాతం తిరిగి మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాం’’ అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఆలోచనల్లో పడిపోయింది కల్పన.

కల్పనకు పెళ్లయ్యి మూడేళ్లు. భర్త వంశీతోపాటు తనూ జాబ్‌ చేస్తోంది. కరోనా వల్ల ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఇంతలో... ‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. ఇంటి వద్ద ఉంటూనే నెలకు రూ.50,000 వరకు సంపాదించవచ్చు’ అని వచ్చిన ఆన్‌లైన్‌ లింక్‌ కల్పనను ఆకట్టుకుంది. ఇది తనకు వచ్చిన పనే. ఇంటినుంచే చేయవచ్చు. డబ్బు బాగానే వస్తుంది. కానీ, తన వర్క్‌ వాళ్లకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తూనే.. లింక్‌ ఓపెన్‌ చేసి, తన వివరాలన్నీ ఇచ్చింది. మరుసటిరోజే కంపెనీ నుంచి ఫోన్‌..!

నమ్మకంగా రిటర్న్‌
ఇంకేమీ ఆలోచించకుండా పదివేలు వారు చెప్పిన అకౌంట్‌కు ఆన్‌లైన్‌లో పే చేసి, జాబ్‌లో చేరిపోయింది. సదరు కంపెనీవారు చెప్పినట్టుగా లాప్‌టాప్‌ ఏర్పాటు చేసుకుంది. కంపెనీ లింక్‌ నుంచే ఫైల్స్‌ వస్తున్నాయి. రోజూ రెండు ఫైళ్లు. వాటిని రీ కన్‌స్ట్రక్ట్‌ చేసి ఇవ్వాలి. పెద్ద పనేమీ కాదు. రోజుకు మూణ్ణాలుగు గంటలు కేటాయిస్తే చాలు.
పదిహేను రోజులైంది. కల్పన అకౌంట్‌కు వర్క్‌ చేస్తున్న కంపెనీ నుంచి రూ.5000 రిటర్న్‌ రావడంతో ‘కంపెనీ నమ్మకమైంది, అనవసరంగా నేనే డౌట్‌ పడ్డాను’ అనుకుంది కల్పన. మరింత జాగ్రత్తగా కంపెనీ చెప్పిన మేరకు పనులు చేస్తూ ఉంది.

తప్పులకు చెల్లించిన మూల్యం
ఇంకో పది రోజుల్లో నెల జీతం వస్తుందనగా కంపెనీ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మేడమ్, మీరు కంపెనీకి రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది’ ఫోన్‌ సారాంశం వినగానే డీలా పడిపోయింది కల్పన. తను చేసిన టైపింగ్‌లో వచ్చిన మిస్టేక్స్‌కి చెల్లించే మూల్యం అది. మిస్టేక్స్‌ జరిగితే రీ పే చేయాలని ముందే మాట్లాడుకున్నారు. అలా అని తను సంతకం కూడా చేసింది. ఎంత జాగ్రత్తగా చేసినా అలా ఎలా జరిగిందో అర్ధం కాలేదు. కల్పన పంపిన ఫైల్స్‌లో మార్క్‌ చేసి, కంపెనీ నిర్వాహకులు తిరిగి పంపిన ఫైల్స్‌లో మిస్టేక్స్‌ నిజమే. ముందే చేసుకున్న ఒప్పందం. లేదంటే లాయర్‌ నోటీసులు తప్పవు’ అని హెచ్చరికలు వస్తున్నాయి.

కల్పనకు భయం వేసి ఆ నంబర్‌ను బ్లాక్‌ చేసింది. కాసేపటికి ఇంటర్నేషనల్‌ కాల్‌. ఆ ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న కల్పనకు ‘అగ్రిమెంట్‌ ప్రకారం నడుచుకోనందుకు మీ మీద కేసు ఫైల్‌ అయ్యింది. లాయర్‌ నుంచి నోటీస్‌ ఇష్యూ అయ్యింది’అని. కల్పనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. కోర్టులు, లాయర్లు, కేసులు.. అంటూ నిలువెల్లా భయం ఆవరించింది. ‘ఆ కంపెనీ వారితో నే రాజీ కుదుర్చుతా.. లేదంటే అనవసర సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఎంత త్వరగా పరిష్కరించుకుంటే మీకే అంత లాభం’ అనడంతో కల్పన బెంబేలెత్తిపోయింది. ఒక్కరోజు టైమ్‌ ఇస్తే డబ్బు చెల్లిస్తానని మాట ఇచ్చి, భర్తకు తెలియకుండా బంగారం తాకట్టు పెట్టి, ఆ డబ్బులను సదురు అకౌంట్‌కు సెండ్‌ చేసింది.

వాట్సప్‌లోనే బెదిరింపు అంతా!
సైబర్‌ నేరగాళ్లు తక్కువ మొత్తం నుంచే ఎక్కువ మంది దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇలా ఎత్తుగడ వేస్తున్నారు. ఉద్యోగం కోసం అంటూ ఇచ్చే లింక్స్‌లో వివరాలన్నీ తీసుకొని, మరో కొత్త నేరానికి పాల్పడే అవకాశాలూ ఉంటాయి. ఫ్రాడ్‌ చేసేవారు దాదాపుగా వాట్సప్‌ ఫోన్లు చేస్తారు. అంతర్జాతీయ ఫోన్‌ నెంబర్లు వాడుతుంటారు. వర్క్‌లో ఎర్రర్స్, మిస్టేక్స్‌ వారే సృష్టిస్తారు. ఏ తరహా ఆన్‌లైన్‌ ఉద్యోగాల్లో చేరాలనుకున్నా పేరున్న కంపెనీ, అది రిజిస్టర్‌ అయిన సంవత్సరం.. వంటి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిది.
– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

క్రెడిబులిటీ ముఖ్యం
మా దగ్గర ఇలాంటి కేసులు ఫైల్‌ కాలేదు. కానీ, ఏ మార్గాల్లో డబ్బులు రాబట్టాలనే విషయమ్మీదే సైబర్‌ నేరగాళ్ల ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం. ఇంటి వద్ద ఉండి ఆన్‌లైన్‌ వర్క్‌ చేసినా సదరు కంపెనీకి పని చేసినట్టు ఆధారాలు ఉండాలి. ఆ కంపెనీ గురించి తెలిసినవారి ద్వారా పూర్తి వివరాలు సేకరించుకోవాలి. జాబ్‌ కాంట్రాక్ట్‌ ఫైల్‌ తీసుకోవాలి. అలా ఇవ్వలేదంటే అది ఫేక్‌. కేసు ఫైల్‌ చేశామనో, ఫలానా చోట నుంచి ఫోన్‌ చేస్తున్నామనో బెదిరింపుల ద్వారా డబ్బులు లాగడం, ఇతర వేధింపులకు గురిచేస్తున్నారనిఅనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్‌ చేయాలి.
– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌

మరిన్ని వార్తలు