ధైర్యము నీవే కదా

28 Dec, 2020 00:50 IST|Sakshi
మహిళాశక్తి : ప్రతీకాత్మక చిత్రం

భయంలో పిల్లాడు ‘అమ్మా’ అని వెళ్లి అమ్మ పొట్టలో తల దూరుస్తాడు. తండ్రిపులికి సిఫారసు కోసం ‘అక్కా’ అని వెళ్లి అక్కను ఆశ్రయిస్తాడు తమ్ముడు. అధైర్యంలో, అగమ్యంలో.. ఆలోచన కోసం భార్య వైపు చూస్తాడు భర్త. ‘జాబ్‌ వచ్చాక ఇస్తాలే’ అని గర్ల్‌ఫ్రెండ్‌ని చేబదులు అడుగుతాడు నిరుద్యోగి. కష్టాల్లో యావత్‌ మానవాళి ప్రత్యక్ష దైవం స్త్రీ. ‘ఆ చేత్తోనే మాకూ ఇంత అభయం ప్రసాదించమని’ ఇప్పుడీ కరోనా సంక్షోభంగా పెద్ద పెద్ద కంపెనీలు మహిళల్ని రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌’ ఇస్తున్నాయి. ఆకాశంలో సగంగా ఉన్న మహిళ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్‌లలోనూ సగంగా ఉండబోతోంది.

ఎత్తులో సన్నటి తాడుపై పడిపోకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నిరంతరం నడుస్తూ ఉండటమే స్త్రీకి ఇల్లూ ఆఫీస్‌. ఇంటిని చూసుకునేవారు ఎవరైనా ఉంటే, ఇంటిని తను కూడా చూసుకోవాలన్న  తపన భర్తకూ ఉంటే ఆమె మరింత మెరుగ్గా తన ఉద్యోగ బాధ్యతల్ని నెరవేర్చగలదు. ఈ విషయం లాక్‌డౌన్‌ కాలంలో రుజువైంది కూడా. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో మహిళలు అత్యుత్తమమైన ఫలితాలను తమ కంపెనీలకు సాధించి పెట్టాయి. వారి పని తీరు మెరుగైంది. వేగవంతం అయింది. ఎక్కువ పని కూడా జరిగింది.

పురుషులు మాత్రం ఆఫీస్‌లో ఎంత పని చేశారో ఇంట్లోనూ అంతే పని, లేదంటే అంతకు తక్కువ పని చేసినట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది కూడా. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుత కరోనా సంక్షోభ కాలాన్ని నెగ్గుకు రావడానికి, మునుపటి లాభాల్లోకి త్వరితంగా వెళ్లిపోడానికి మహిళల్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అదీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోకి! దీనివల్ల మహిళల శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు డిమాండ్‌ పెరిగింది. మగవాళ్లు ఆఫీస్‌లో వర్క్‌ చేస్తుంటే.. వాళ్ల కన్నా మిన్నగా, మెరుగ్గా మహిళలు ఇంటి నుంచి చేస్తున్నారు.
∙∙
ఒక రంగం అని కాదు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, మెటల్‌ అండ్‌ మైనింగ్‌ మహిళా శక్తిని ఆలంబనగా చేసుకుంటున్నాయి! యాక్సిస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంత, ఆర్పీజీ గ్రూప్, దాల్మియా సిమెంట్, టాటా కెమికల్స్‌ వంటి సంస్థలు మహిళల్ని చేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనడంతో మహిళలూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

యాక్సిస్‌ బ్యాంకు వచ్చే ఏడాది తమ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, చార్టర్డ్‌ అకౌంటెన్సీ విభాగాలకు దేశంలోని రెండు వేల క్యాంపస్‌ల నుంచి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించింది. అందులో 40 శాతం వరకు మహిళా అభ్యర్థులకే కేటాయించింది! ఇక ఇన్ఫోసిన్‌ కంపెనీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ‘అప్పుడే కాలేజీ నుంచి బయటపడిన’ (ఫ్రెష్‌ బ్యాచ్‌) పట్టభద్రులకు 17 వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకుంది. అందులో సగం పూర్తిగా యువతులకే. దాల్మియా సిమెంట్స్‌ కూడా ప్రత్యేకంగా మహిళల కోసమే నియామకాల్ని చేపట్టనుంది. అందుకోసం మహిళా కళాశాలల్లో, మహిళా విశ్వ విద్యాలయాలలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టాటా స్టీల్స్‌లో కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో నలభై శాతం వరకు మహిళలే ఉండబోతున్నారు.

పనివేళల్ని సులభతరం చేస్తే మహిళల పని సామర్థ్యం పెరిగి మంచి ఫలితాలు వస్తాయని ఈ కంపెనీల అనుభవంలోకి వచ్చింది కనుకనే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రముఖ ‘జాబ్స్‌ ఫర్‌ హయర్‌’ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నేహా బగారియా చెబుతున్నారు. ‘‘అంతేకాదు.. స్త్రీ, పురుషుల నియామకాలలో ప్రస్తుతం ఉన్న అంతరం తగ్గి, జెండర్‌ డైవర్సిటీ వృద్ధి చెందుతుంది’’ అని కూడా ఆమె అంటున్నారు.

నేహా బగారియా, ‘జాబ్స్‌ ఫర్‌ హయర్‌’ సంస్థ సీఈవో.

మరిన్ని వార్తలు