World Arthritis Day 2022: థైరాయిడ్‌ ఉన్న వారికి, అబార్షన్స్‌ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త

12 Oct, 2022 14:10 IST|Sakshi

కీళ్లలో కిరికిరి

35 ఏళ్లకే కీళ్ల నొప్పులు

మోకాళ్లలో త్వరగా అరిగిపోతున్న కార్టిలేజ్‌

జీవనశైలి మార్పులతో అధికమవుతున్న సమస్య

నేడు అంతర్జాతీయ ఆర్థరైటిస్‌ దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్‌ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్‌ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. అక్టోబరు 12న అంతర్జాతీయ ఆర్థరైటిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రత్యేక కథనం.- కర్నూలు(హాస్పిటల్‌)

జిల్లాలో ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్లకే కనిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలో 12 నుంచి 15 శాతం మంది వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు.

గత పదేళ్లలో వైద్యుల వద్దకు రోజుకు సగటున 600 మంది రోగులు వస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే భవిష్యత్‌లో నడవలేని, కదల్లేని పరిస్థితులు రావచ్చు. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయస్సు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్‌ వస్తుంది.

ఆర్థరైటిస్‌ అంటే..
ఆర్థరైటిస్‌ అంటే ఎముకలు, కీళ్లు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. సాధారణంగా కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లల్లో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటస్‌గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ నొప్పి, బిగుతుదనం ఉంటుంది.

ఆర్థరైటిస్‌లో రకాలు...
ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, యాంకి యోజింగ్‌ స్పాండైటిస్, గౌట్, జువైనల్‌ ఇడియోపథిక్‌ ఆర్థరైటిస్‌ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్‌), లూపస్, సోరియాటిక్, ఆర్థరైటిస్‌ వంటివి ఎక్కువగా మనం చూస్తుంటాము.

లక్షణాలు
ఆర్థరైటిస్‌ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా తొలిదశలో ఆకలి తగ్డడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది.

ఇతర అవయవాలు అంటే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవ డం, నోటిపూత, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, పక్షవాతం, కంటిచూపు తగ్గుట, కళ్లు పొడిబారడం, కండరాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి.

జీవనశైలిలో మార్పులే కారణం
►ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే.
►వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్‌ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్‌ రావడాన్ని గమనించవచ్చు. ►వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్తి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు.
►సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్‌ వస్తుంది.

తీవ్రత తగ్గించేందుకు సూచనలు
►దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు.
►ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ►ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం.
►పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
►సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా కీళ్లు మరింత దెబ్బతినకుండా ఉండేలా వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది.

మందులు ఇచ్చేటప్పుడు వైద్యులు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా చూస్తారు. ఆ మేరకు మందుల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. నొప్పి నివారణకు పెయిన్‌ కిల్లర్లు తాత్కాలికంగా ఉపయోగిస్తారు. కానీ వ్యాధి నియంత్రణ ముఖ్యం. అందుకోసం డిసీజ్మాడిఫైయింగ్‌ యాంటి రుమాటిక్‌ డ్రగ్స్‌ (డీఎంఏఆర్‌డీ), బయోలాజికల్‌ ఇంజెక్షన్‌ వంటి కొత్త మందు తీసుకోవాలి. మంచి చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య అదుపులో ఉంటుంది. –డాక్టర్‌ సి.మంజునాథ్, ఆర్థోపెడిక్‌ సర్జన్, కర్నూలు

వీరిలో ఎక్కువ!
►థైరాయిడ్‌ ఉన్న వారికి, అబార్షన్స్‌ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16- 45 ఏళ్ల మహిళలకు రావచ్చు.
►కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు, కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.
►ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థటైటిస్‌ సోకిందో తెలుసుకోవాలి.
►వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.

చదవండి: Beard Shaving: రోజూ షేవింగ్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే!
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో..

మరిన్ని వార్తలు