వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డే: బంగారంలాంటి బ్లడ్‌ డోనర్‌

14 Jun, 2022 00:44 IST|Sakshi

సందర్భం: జూన్‌ 14, వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డే

అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్‌...

‘ప్రౌడ్‌ టు బీ బ్లడ్‌ డోనర్‌’ ‘మీ రక్తంతో పాటు ఒకరికి జీవితాన్ని కూడా ఇస్తున్నారు’ ‘రక్తదాతలు జీవితరక్షకులు’... మొదలైన నినాదాలు గట్టిగా వినిపించని కాలం అది. 24 సంవత్సరాల వయసులో తొలిసారిగా రక్తదానం చేసింది బెంగళూరుకు చెందిన ఆశా సూర్యనారాయణ్‌.
ఒకరోజు దినపత్రిక చదువుతున్నప్పుడు రక్తదానానికి సంబంధించి సిటీ హాస్పిటల్‌ వారి ప్రకటన కనిపించింది. తనది వారు అడిగిన బ్లడ్‌గ్రూపే. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేసింది.

నిజానికి తనకు అప్పుడు రక్తదానం ఎలా చేయాలి, దాని విలువ ఏమిటి... మొదలైన విషయాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆమె వయసు 55 సంవత్సరాలు. ఆరోజు ప్రారంభమైన రక్తదానం ఇప్పటికీ ఆగలేదు. ఒకసారి బెంగళూరులో క్యాన్సర్‌ పేషెంట్‌కు రక్తదానం చేసింది. మరుసటి రోజు ఆ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు...
ఆశను చూసి ఒక వృద్ధురాలు వేగంగా నడిచివచ్చింది. దగ్గరికి రాగానే తన కాళ్ల మీద పడింది. ‘అయ్యో! మీరు పెద్దవాళ్లు’ అంటూ ఆమెను లేపింది ఆశ.

‘మీరు ఎవరో తెలుసుకోవచ్చా?’ అని అడిగేలోపే...
‘మీరు రక్తదానం చేసి నా బిడ్డను బతికించారు’ అంటూ కట్టలకొద్ది డబ్బును ఇవ్వబోయింది. ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించిన ఆశ ‘ఒక్క రూపాయి కూడా అవసరం లేదు తల్లీ. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి బ్లడ్‌ డొనేట్‌ చేస్తాను’ అని ఆ వృద్ధురాలికి ధైర్యం చెప్పింది.
నిజానికి ఈ సంఘటన రక్తదానం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది. నిబద్ధతను మరింతగా పెంచింది.

‘నేను చేయడమే కాదు చేయించాలి కూడా’ అనుకొని రక్తదానం గురించి మహిళలతో మాట్లాడినప్పుడు వారు విముఖంగా ఉన్నారు. ‘రక్తదానం వల్ల మహిళలు బలహీనమవుతారు’... మొదలైన అపోహలే దీనికి కారణం. అందుకే అలాంటి అపోహలను తొలిగించే ప్రచారాన్ని చేపట్టింది. ఇది మంచి ఫలితం ఇచ్చింది. చాలామంది మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రక్తదానం చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు భయపడుతుంటారు. ఆశ కుటుంబలో కూడా మొదట్లో అలాంటి భయాలు ఉన్నా, తరువాత మాత్రం ఆమెకు పూర్తిగా అండగా నిలిచారు.

కోవిడ్‌ కోరలు చాచిన భయానక కాలంలో బ్లడ్‌ డొనేషన్స్‌ భారీగా తగ్గిపోయాయి. రెగ్యులర్‌గా రక్తదానం చేసేవాళ్లు కూడా ‘రిస్కు ఎందుకు’ అంటూ ఇళ్లు కదలడం లేదు. ఆ సమయంలో తాను చొరవ తీసుకుంది. ‘రక్తదానం చేయడానికి అభ్యంతరం లేదు. కానీ బ్లడ్‌బ్యాంకుకు మాత్రం వచ్చేది లేదు’ అన్నారు చాలామంది. అలాంటి వారికి ధైర్యం చెప్పి బ్లడ్‌బ్యాంకులకు తీసుకెళ్లేది ఆశ.
ఆశను అభిమానంగా ‘గోల్డెన్‌ బ్లడ్‌ డోనర్‌’ అని పిలుచుకుంటారు అభిమానులు.

రక్తదానంతో మొదలైన ఆమె సమాజసేవ అక్కడితో ఆగిపోలేదు. మరెన్నో మంచిపనులకు అది బలమైన పునాదిగా మారింది. కోవిడ్‌ సమయంలో దిక్కుమొక్కులేని వారికి అన్నదానం, అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం, వాక్సినేషన్‌ డ్రైవ్‌..ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని మాత్రమే.

మరిన్ని వార్తలు