Breastfeeding Benefits: బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఇంకా..

2 Aug, 2022 11:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆగస్టు 1–7 ప్రపంచ తల్లి పాల వారోత్సవం

World Breastfeeding Week 2022:  శిశువు భూమ్మీదకు వచ్చి ‘కేర్‌’మనగానే తల్లి స్థనం పాలతో ఉప్పొంగుతుంది. పాలా అవి? శిశువు పాలిటి అమృతం. పుట్టిన బిడ్డ నోటికి స్థన్యమందించడం పాలిచ్చే ప్రతి జీవరాశిలో అత్యంత సహజం. కాని మనిషికి తెలివి జాస్తి. కొందరు తల్లులు కొన్ని కారణాల రీత్యా పిల్లలకు తల్లిపాలను నిరాకరిస్తారు.

‘తల్లి పాలు ఇవ్వండి’ అని వారోత్సవాలు జరపడమే ఒక రకంగా ప్రకృతి విరుద్ధం. బిడ్డకు తల్లి పాలివ్వడమే కదా  ప్రకృతి సహజం. తల్లి పాలకు దూరమైన బిడ్డ అమృతానికి దూరమైనట్టు కాదా? ఇంతకాలం తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం అనుకుంటూ వచ్చాం.

కాని తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎంత ప్రయోజనమో తల్లికీ అంతే ప్రయోజనం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘తల్లి తన బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవానంతర కుంగుబాటుకు దూరమయ్యి ఆనందం, సంతృప్తి పొందుతుంది.

ఆరోగ్య లాభాలు!
ఆమెకు భవిష్యత్తులో టైప్‌ 2 డయాబెటిస్, రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్, కార్డియోవాస్క్యులర్‌ డిసీజ్, రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అన్నింటి కంటే మించి బ్రెస్ట్‌ కాన్సర్‌ ప్రమాదం కూడా తప్పుతుంది.

ప్రపంచంలో తల్లిపాలు ఇవ్వాలనే చైతన్యం వల్ల తల్లిపాలు ఇచ్చే తల్లుల సంఖ్య పెరగడంతోపాటు బ్రెస్ట్‌ కాన్సర్‌ బారిన పడే స్త్రీల సంఖ్య ఏటా 20 వేల చొప్పున తగ్గుతోంది’ అంటారు ఆగ్రాకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ నిహారికా మల్హోత్రా.

ముగ్గురికి ఇద్దరు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి తల్లిపాలు అందడం లేదు. ‘తల్లిపాలలో యాంటీబాడీస్‌ ఉంటాయి. పసిపిల్లలకు వచ్చే వ్యాధులను నివారించే శక్తి తల్లిపాలకు ఉంది. బిడ్డ పుట్టాక మొదటి గంటలోనే మొదలెట్టి కనీసం 6 నెలల పాటు తల్లి పాలు ఇవ్వడం మేలని డబ్యు.ఎచ్‌.ఓ అధ్యయనం తెలుపుతోంది’ అంటారు నిహారిక మల్హోత్రా.

పిల్లలకు కూడా!
తల్లిపాలు తాగిన పిల్లల కంటే పోతపాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం, అధిక బరువు కనిపిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం మిగిలిన పిల్లల్లో కనిపించడం లేదని నిర్థారణ అయింది. అంతే కాదు తల్లిపాలు తాగిన పిల్లల్లో మాటలు తొందరగా రావడం, భాషను గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటం కూడా గుర్తించారు.

తల్లికి సహాయంగా... బిడ్డకు పాలు ఇవ్వడం బిడ్డను అనుక్షణం గమనించుకోవడం ఇవి తల్లికి చాలా ముఖ్యం అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఇంటి వాతావరణం ఉండాలి. అందుకే పెద్దలు కాన్పుకు పుట్టింటికి పంపేవారు. పుట్టింట్లో తల్లిదండ్రులు తల్లిని చూసుకునేవారు. కాని రెండో కాన్పుకు వచ్చేసరికి ఈ మర్యాదను తప్పిస్తారు. తప్పించవచ్చు... అంతే విశ్రాంతి... చూసుకునే మనుషులు ఉంటే.

ఆహారం విషయంలో..
కాన్పు తర్వాత బిడ్డను చూసుకునే తల్లికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వీటి మధ్య వంట– వార్పు ఇతర సంతానం బాగోగులు చూసుకోవడం కూడా భారంగా మారతాయి. భర్త, తల్లిదండ్రులు, అత్తామామలు ఈ విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు... పాలిచ్చే తల్లి ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఏవి తింటే ఎక్కువ శక్తి వచ్చి పాలు బాగా పడతాయో తల్లి ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకొని ఆ ఆహారం ఇవ్వాలి.

లేకపోవడం తప్పు కాదు... కొందరు తల్లులు ఉద్యోగాలకు వెంటనే వెళ్లాల్సి రావడం వల్ల తల్లి పాలు ఇవ్వడం వీలవదని అంటారు. కొందరికి థైరాయిడ్‌ వంటి సమస్యల వల్ల తక్కువ పాలు పడవచ్చు. కొందరు తల్లుల్లో ఏ సమస్యలూ లేకపోయినప్పటికీ తగినన్ని పాలు ఉండవు. ఈ సందర్భాలను కూడా కుటుంబం అర్థం చేసుకోవాలి తప్ప ఒత్తిడి పెట్టడం సరి కాదు.

కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోందంటే తల్లిపాలు ఏ మాత్రం కల్తీ కాలేవు. కాని కలుషితమైన నీటిలో కలిపే పౌడర్, పోతపాల వల్ల జరుగుతున్న పసికందుల మరణాలను తల్లిపాలు ఇవ్వడం ద్వారా 13 శాతం నివారించవచ్చు అని. పోతపాలు తప్పనిసరి అయితే రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు పెట్టుకోవాలి. కాని తల్లిపాలు పొందడం పిల్లల ప్రాథమిక హక్కు. ఎందుకంటే ‘బ్రెస్ట్‌ మిల్క్‌ ఈజ్‌ బెస్ట్‌ మిల్క్‌’ అనేదే అందరు నిపుణుల నినాదం.  
చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా?   

మరిన్ని వార్తలు