World Day Against Child Labour 2022: పని నేర్పించడం వేరు.. పని చేయించడం వేరు

12 Jun, 2022 00:24 IST|Sakshi

నేడు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం

తల్లిదండ్రులు యజమానులు కాదు. పిల్లలు కార్మికులు కాదు. ‘అది ఎత్తు’ ‘ఇది సర్దు’ ‘నీళ్లు తీసుకురా’ ‘ఇల్లు చిమ్ము’ ‘స్కూటర్‌ తుడువు’ పిల్లలకు పని నేర్పాల్సిందే. కాని వారు మన కడుపున పుట్టినందున మనం చెప్పే పనులన్నీ చేస్తే బాలకార్మికులే అవుతారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద చేసే అజమాయిషీ అన్యాయంగా ఉంటుంది. వారిది ఆడే పాడే చదువుకునే వయసు. ఇంట్లో అయినా బయట అయినా కూలి బతుకు కాదు. ‘అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గ్రహించాల్సింది ఇదే.

ఒక సందర్భం: తొమ్మిదో క్లాసు చదువుతున్న వర్థన్‌ టీవీ చూస్తున్నాడు. అమ్మ బజారుకు వెళ్లి నూనె పేకట్‌ తెమ్మంది. ఆ షాప్‌ ఇంటికి కొంచెం దూరం. అమ్మ వెళ్లొచ్చు. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నాన్న కూడా వెళ్లొచ్చు. వర్థన్‌ చాలాసార్లు వెళ్లి తెస్తాడు. కాని ఆ టైమ్‌లో వాడికి వెళ్లడం ఇష్టం లేదు. అమ్మ పదేపదే చెప్తోంది. వాడు కదలట్లేదు. లాగి ఒక్కటిచ్చింది. ఎదుగుతున్న పిల్లాడు. చాలా హర్ట్‌ అయ్యాడు. ఇంట్లో నుంచి గంట మాయం అయిపోయాడు. ఆ అమ్మా నాన్నలు పడ్డ కంగారు అంతా ఇంతా కాదు. పని చేసి తీరాల్సిందే అనేది వాడికి రూలు కాదు. వాడు ఆ నియమానికి బద్ధుడు కాదు. వాడు చిన్నపిల్లాడు కనుక పెద్దలు భయపడి చచ్చినట్టు చేయాల్సిందే అనే భావనా సరిౖయెనది కాదు.

మరో సందర్భం: పదో క్లాసు చదువుతున్న మాలిక రెండు రోజులకు ఒకసారి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు వెళ్లి రెండు బిందెలు నీళ్లు తేవాలి. వాళ్లు ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటారు. వాడుకునే నీళ్లు ట్యాంకు నుంచి వస్తాయి. తాగే నీళ్లే కింద పట్టుకుని తెచ్చుకోవాలి. పనిమనిషి తేదు. తల్లి రెండేళ్ల క్రితం వరకూ తెచ్చేది. ఇప్పుడు పూర్తి బాధ్యత మాలికకు అప్పజెప్పింది. తండ్రి, అన్నయ్యకు ఈ బాధ్యత లేదు. నీళ్ల బరువు మాలిక నెత్తి మీదే. మాలికకు ఒక్కోసారి చేయబుద్ధి కాదు. ఆ రోజు ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతుంది.

మూడో సందర్భం: ప్రతి ఇంటి హాలులో సోఫా ఉంటుంది. సోఫాలో తల్లి, తండ్రి కూచుని ఉంటారు. కాని వారికి దూరంగా ఉన్న ఫోన్‌ పిల్లలు తెచ్చివ్వాలి. ఫ్రిజ్‌లో నుంచి నీళ్లు పిల్లలు తెచ్చివ్వాలి. ఎవరో డోర్‌ కొడతారు. మరో రూమ్‌లో చదువుకుంటున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలు తలుపు తెరవాలి. చెత్తవాడు బయట రిక్షా ఆపుతాడు. పిల్లలు వెళ్లి పోసి రావాలి. అమేజాన్‌ పార్శిల్‌ వస్తుంది. పిల్లలే అందుకోవాలి. స్విగ్గి ఆర్డర్‌ పెట్టాలి. పిల్లలకే ఆ పని చెప్పాలి. ఇవన్నీ పిల్లలు చేయదగ్గ అతి తేలికైన పనులే. కాని పిల్లల స్థానంలో నౌకర్‌ని ఊహించుకుంటే ఇన్ని పనులు చెప్పగలమో లేదో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి.

పదిహేను పదహారేళ్లు వచ్చే వరకూ పిల్లలకు పని ప్రత్యేకంగా ఇష్టం ఉండదు. వారు సంతోషంగా ఉండటానికి చూస్తారు. ఆడుకోవాలనుకుంటారు. చదువుకుంటారు. టీవీలు, వీడియోలు చూస్తారు. సైకిల్‌ తొక్కుతారు. ఊరికూరికే నవ్వుకుంటూ ఉంటారు. వారికి పని నేర్పించడం పెద్దల బాధ్యత. ఇంటి పనుల్లో కూడా పిల్లలకు భాగం ఉంటుంది. బాత్‌రూమ్‌లో వస్తువులు నీట్‌గా పెట్టడం, స్నానం చేశాక వారి బట్టలు తీసుకెళ్లి వాష్‌ ఏరియాలో పడేయడం, చెప్పుల స్టాండ్‌లో చెప్పులు నీట్‌గా సర్దుకోవడం, నిద్ర లేచాక దుప్పట్లు మడత వేయడం, అవసరం అయితే టీ పెట్టడం నేర్చుకోవడం... ఇవి కూడా పనులే. ఈ మాత్రం పనులు వారు తెలుసుకుని ఉండాలి. అంతమాత్రం చేత వారికి పనులు రావాల్సిందే అని పంతం పెట్టి ఇల్లు చిమ్మించడం, బట్టలు ఉతికించడం, అంట్లు తోమించడం, నీళ్లు మోయించడం, దూరాలకు పంపి పదే పదే వస్తువులను తెప్పించడం... వారిని బాల కార్మికుల కింద మార్చడమే అవుతుంది.

పిల్లలు కొంత ఎదిగిన వెంటనే ఇక పనులు వారి నెత్తిన వేసే ధోరణి తల్లిదండ్రుల్లో ఉంటుంది. అది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే అనుమతించదగింది. వారు ఏ మాత్రం ఇంటి నౌకర్లు కారు. ఇంటి సభ్యులు. మరో విషయం. కొందరికి చదువు బాగా వంటబట్టినట్టు కొందరు పిల్లలకు పనులు బాగా వంటబడతాయి. కొందరు పిల్లలకు ఎంతమాత్రం పనులు రావు. దానికి ఏం చేయలేము. ఉదాహరణకు కొందరు పిల్లలు టక్కున వస్తువు పట్టుకురాలేరు. ‘షెల్ఫ్‌లో జండూబామ్‌ ఉంటుంది తీసుకురా’ అని తల్లి ఆర్డర్‌ వేస్తే కొందరు పిల్లలకు భూతద్దం ఇచ్చినా ఆ జండూబామ్‌ కనపడదు.

వారికి కనపడదు అని తల్లికి కూడా తెలుసు. ‘కనపడిందా.. కనపడిందా’ అని తల్లి అరుస్తూ ఉంటుంది. పిల్లాడికి అది చాలా యాంగ్జయిటీని ఇస్తుంది. తల్లో, తండ్రో ‘నా బిపి టాబ్లెట్‌ స్ట్రిప్‌ తీసుకురా’ అనంటే అది టక్కున వెతికి తెచ్చే వరకు, అలా వెతకడం రాకపోతే ఆ పిల్లాడి నెత్తి మీద పిడుగు పడుతుందంటే అది వింతగా ఉండొచ్చు. కాని అది నిజం.
కొందరు పిల్లల దుర్బలంగా ఉంటారు. కొన్ని పనులు చేయలేరు. కొందరు పిల్లలు బద్దకంగా ఉంటారు. వేగంగా కదల్లేరు. కొందరు పిల్లలు అసలు పని అంటేనే లోలోపల కుమిలిపోతారు. వారిని చాలా మెల్లగా అవసరం మేరకు దారిలో పెట్టుకోవాలి తప్ప కొరడా పట్టుకుని అదిలించే పద్ధతిలో కాదు.

బయట షాపుల్లో వీధుల్లో కనిపించే బాల కార్మికులను చూసి జాలి పడటం కాదు. మన ఇళ్లల్లో మన పిల్లలు ‘కార్మికులు’గా ఎన్ని పని గంటలు ఇంటి పని చేస్తున్నారు, ఆ శ్రమ వల్ల వారి మానసిక, భౌతిక స్థితిలో ఏం తేడా కనిపిస్తోంది అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలి.

పిల్లలు పుట్టడమే సున్నితంగా పుడతారు. వారితో సున్నితంగా వ్యవహరించాల్సింది పెద్దలే.
 

మరిన్ని వార్తలు