డ్రైఫ్రూట్స్‌ తిని, నాలుగడుగులు నడిచి హెల్దీగా ఉన్నామనుకుంటే సరిపోదు!

7 Apr, 2022 10:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మన భూమి -మన ఆరోగ్యం

World Health Day 2022: భూమి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం భూమికి ఆరోగ్యకరమైన పనులు చేస్తే అది స్వస్థతతో ఉంటుంది. ఇరువురూ పరస్పరం సహకరించుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలని 2022 సంవత్సరానికిగాను ‘వరల్డ్‌ హెల్త్‌ డే’ తన థీమ్‌ను ‘మన భూమి మన ఆరోగ్యం’గా  ఎంచుకుంది.

సకల జీవరాశికి భూమి నివాస స్థలం అయితే కుటుంబానికి ఇల్లు నివాస స్థలం. ఏ కుటుంబానికి ఆ కుటుంబం తన ఇంటిని, కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచుకుంటే
భూమి ఆరోగ్యంగా ఉన్నట్టే.

లాక్‌డౌన్‌ ఒక రకంగా ఒక మెలకువ కలిగించింది. కుటుంబాలను ఆరోగ్యం గురించి గట్టిగా ఆలోచించేలా చేసింది. మహమ్మారులు వ్యాపించినప్పుడే కాదు... గట్టి ప్రతికూలతలు వచ్చినా ఎలా ఒకరికొకరు మద్దతుగా నిలవాలో చెప్పింది. మరొక మేలు అది ఏం చేసిందంటే లాక్‌డౌన్‌ కాలంలో పరిశుభ్రమైన ఆకాశాన్ని చూపించింది. వాహనాల రొద లేని పరిసరాలు ఇచ్చి దూరాన ఒక పక్షి కూసినా వినిపించేలా చేసింది.

ఫ్యాక్టరీలు మూత పడి వ్యర్థాలు విడుదల కాకపోవడం వల్ల యమున వంటి కాలుష్య కాసార నది కూడా తేటబడింది. చెలమలు, కుంటలు, చెరువులు శుభ్రమయ్యాయి. ప్లాస్టిక్‌ వేస్ట్‌ దాదాపుగా లేదు. వాహన వ్యర్థాలు లేవు. అంటే మనిషి తన చర్యలను నిరోధించుకుంటే భూమికి ఎంత మేలో లాక్‌డౌన్‌ చెప్పింది. భూమి ఊపిరి పీల్చుకున్న సందర్భం అది.

అంటే భూమికి చెడు చేయకూడదు. భూమికి చెడు జరిగితే ఆ చెడు మన ఇంటి దాకా వస్తుంది. కుటుంబంలోని వ్యక్తులను తాకుతుంది. భూమికి చెడు జరిగితే మనకెలా చెడు జరుగుతుంది?

నేలను కలుషితం చేయకూడదు. దారుణమైన రసాయనాలతో పంటలు పండించకూడదు. కాలక్రమేణ ఆహార ఉత్పత్తికి దెబ్బ పడుతుంది. పంటలో కోత వస్తుంది. లేదా కలుషిత ఆహారం పండుతుంది. అది పిప్పి ఆహారంగా మారి మాల్‌ న్యూట్రిషన్‌కు దారి తీస్తుంది. పిల్లలు, పెద్దలు ఈసురో అని అనకతప్పదు. కనుక నేల కలుషితం కాకుండా చైతన్యాన్ని ఇంటి నుంచే కలిగి ఉండాలి.

సమాజానికి అందివ్వాలి. భూమికి చేటు చేయడం అంటే పరిసరాలను చెత్తతో నింపడమే. ఇలా వ్యర్థాలతో భూమిని నింపడం వల్ల కుటుంబానికి ఎదురవుతున్న అతి పెద్ద ప్రమాదం మలేరియా. భూమిని మనిషి దోమల అభివృద్ధి కేంద్రంగా మురికిగా మారుస్తుంది. ఈ మురికి నీటిలోనూ తినే ఆహారంలోనూ చేరితే డయారియా వస్తుంది. ఇవాళ ప్రపంచాన్ని అంటే కుటుంబాలను బాధిస్తున్న మరో అతి పెద్ద సమస్య డయేరియా. కనుక ఇంటిలోని చెత్తను నేలకు చెడు చేయని విధంగా అనారోగ్యాలకు సాయం చేయని విధంగా పారేయాలి.

మన రోజువారి రాకపోకలే గాలి కాలుష్యానికి అత్యంత ప్రధాన కారణం అని తేలింది. కారు, స్కూటరు ఇంటి సౌకర్యం కోసం వాడితే అవి వ్యర్థాలు వెదజల్లి తిరిగి మన ఇంటి సభ్యులకే అనారోగ్యాలు తెస్తాయి. ఆస్తమా, అలెర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు, కంటి సమస్యలు ఇవి వాయు కాలుష్యం వల్లే.

దీని నుంచి ఇంటిని కాపాడి తద్వారా భూమిని కాపాడాలంటే ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు వాడాలి. సైకిల్, నడక, కార్‌ పూలింగ్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌... ఇలాంటి వాటితో గాలి కాలుష్యం తగ్గించాలి. ఇంట్లో మొక్కలు నాటాలి. చెట్లు వేయాలి. వీధిలో కొన్ని చెట్లనైనా పెంచే బాధ్యత తీసుకోవాలి. ఆ పచ్చదనం భూమినే కాదు ఇంటినీ కాపాడుతుంది.

నీటిని కాపాడాలి. నీటిని వృధా చేయకుండా కాపాడాలి. నీటి కేంద్రాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. సముద్రాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తే ఆ నీరు అనారోగ్యాన్ని ఇస్తుంది. కలుషిత నీటి వల్లే ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అడవిని పెంచితే వాన... వాన కురిస్తే అడవి... ఈ రెండూ ఎంత సమస్థాయిలో ఉంటే అంత భూమికి తద్వారా కుటుంబానికి మంచిది.

వ్యక్తిగతంగానే కాదు ప్రభుత్వాలను చైతన్యపరచడం ద్వారా కూడా జలచక్రాన్ని కాపాడుకోవాలి. గ్లాసు నీళ్లు ముంచుకుని సగం తాగి సగం పారేసే పిల్లలను బాల్యం నుంచి హెచ్చరించకపోతే వారు పెద్దయ్యే వేళకు ఆరోగ్యకరమైన నీటిని తాగలేని పరిస్థితిలో నీళ్లు అడుగంటుతాయి.

భూమిని కండిషన్‌లో పెట్టకపోతే కుండపోతలు వరదల్ని, వ్యాధుల్ని తెస్తాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగి వడదెబ్బ సంగతి సరే, అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతాయి. ఘోరమైన చలిగాలులు చరుకుదనాన్ని హరిస్తాయి. భూమికి ఏది జరిగినా కుటుంబం నివసించేది ఆ భూమిపైని ఇంటిలోనే కనుక ఇంటిని బాధించక తప్పదు.

కనుక మనం డ్రైఫ్రూట్స్‌ తిని, విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుని, నాలుగడుగులు నడిచి హెల్దీగా ఉన్నాం అని అనుకోకూడదు. భూమి ఎంత హెల్దీగా ఉంది చెక్‌ చేయాలి. అలెర్ట్‌ చేయాలి. మనతోపాటు భూమి, భూమితో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్తు అని హెచ్చరిస్తూ ఉంది ఈ సంవత్సరపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

చదవండి: అమ్మ స్వీపర్‌.. కొడుకు ఎంఎల్‌ఏ..

మరిన్ని వార్తలు