World Humanitarian Day: మానవత్వం కావాలి

19 Aug, 2021 00:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు ప్రపంచ మానవత్వ దినోత్సవం

‘మనుషులు అడ్డం పడి ఉంటే ఆమె బతికేదేమో’ అని పోలీసు అధికారులు అన్నారు. విజయవాడలో రమ్యపై కత్తిపోట్లు పడుతున్నప్పుడు మానవత్వం నిజంగా తెల్లముఖం వేసింది. ‘మనకెందులే’ అనేది నేటి మానవత్వమా? ‘ఎన్నని పట్టించుకుంటాం’ అనేది మానవత్వమా? ‘మనం బాగుంటే చాలు’ అనేది మానవత్వమా? ‘పొరుగువాడికి సాయపడవోయ్‌’ అన్నారు పెద్దలు. స్పందనాగుణం ఉన్న మనిషినే మానవుడంటారు. మనిషి స్థాయిలో ఉండిపోదామా... మానవులవుదామా... మనిషి బండబారితే ఆ సంఘం రాతిమయం అవదా?

ఇది అందరికీ తెలిసిన పాత కథే.
ఒక యోగ్యుడు నదిలో స్నానం చేస్తున్నాడు. ఉధృతి ఎక్కువగా ఉంది. నదిలో ఒక తేలు కొట్టుకొని వస్తూ ఉంది. యోగ్యుడు ఆ తేలును చూశాడు. దానిని అలాగే వదిలేస్తే అది చచ్చిపోతుంది. వొడ్డున పడేయాలని దోసిట్లోకి తీసుకున్నాడు. తేలు కుట్టింది. వదిలేశాడు. నీళ్లల్లో పడింది. మళ్లీ దోసిట్లోకి తీసుకున్నాడు. మళ్లీ కుట్టింది. నొప్పికి పడేశాడు. మళ్లీ తీసుకున్నాడు. మళ్లీ కుట్టింది. ఒడ్డున ఉన్న స్నేహితుడు ‘ఎందుకయ్యా... అది కుడుతూ ఉన్నా కాపాడాలని పాకులాడుతున్నావ్‌’ అంటాడు. దానికా యోగ్యుని జవాబు ‘అది తేలు. కుట్టడం దాని ధర్మం. నేను మనిషిని. కాపాడటం నా ధర్మం’ ఈ కథను నేటి మనిషికి మళ్లీ గుర్తు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఒకరికొకరు చెప్పుకోవాల్సి వస్తోంది. స్పందనా గుణం పాదుకొనాల్సింది ఇంట్లోనే కదా. ఆపై బడిలో అదొక మహోన్నత విలువగా నూరిపోయాలి.

బాధలో ఉన్న పౌరుణ్ణి చూసి రాజ్యమే వదిలేశాడు బుద్ధుడు మనిషి గురించి ఆలోచన చేయాలని. బాధలో ఉన్న తోటి మనిషి కోసం వీరుడయ్యాడు స్పార్టకస్‌. బాధలో ఉన్న మనిషి కోసం జీవితాన్నే అర్పించింది మదర్‌ థెరిసా. కష్టం పంచుకోకపోతే మనిషి ఏం పంచుకుంటాడు. స్పందించకపోతే మనిషి మనిషిగా ఎలా ఉంటాడు.

పురాణాల్లోనూ చరిత్రలోనూ మానవ స్పందన ‘సాయం’గానో లేదంటే ‘దానం’గానో ప్రస్తావనకు వచ్చింది. కర్ణుడు దగ్గరకు వచ్చినవాళ్లు ఒట్టి చేతులతో పోరు. కష్టంలో ఉన్న రాముడికి సాయం చేయబట్టే కదా వానర సేన ప్రతినిధి ఆంజనేయుడు నేడు పూజలందుకుంటున్నాడు. మనిషి కూడా దేవుణ్ణి కొలిచేది ఆపదలో ఉంటే ఆదుకొంటాడు. ఆపద్బాంధవుడే దేవుడు.

ఆ పని వద్దా?
కాని మనిషి తాను అందుకోలేని విలువను మనుగడలో ఉంచడానికి ఇష్టపడదు. నలుగురికి సాయం చేయాలనుకోవడం, నలుగురి కోసం పని చేయాలనుకోవడం, నలుగురి కోసం సొంత సొమ్మును ధారాదత్తం చేయాలనుకోవడం ‘బతకడం చేత కాని పని’గా, ‘అనుసరించడానికి వీల్లేని జీవితం’ గా ప్రచారం చేశాడు. ఉన్నతమైన సంఘసేవ అనే మాటను తిట్టు కింద మార్చాలనే వరకూ వెళ్లాడు. కాని సాటి మనిషికి సేవ, సాయం చేసే పనికి ఎన్నడూ మురికి అంటదు. ఆ పని గొప్పది. అందుకే అది మురికిని దాటి ఎప్పటికప్పుడు గొప్ప మనుషుల ద్వారా వెలుగుతూనే ఉంటుంది.

మారాల్సిన యువతరం
‘బాగా చదువుకో. పెళ్లి చేసుకో. డబ్బు సంపాదించి సుఖపడు’ ఇదే ఇవాళ ఎక్కువగా యువతరానికి తల్లిదండ్రులు, సమాజం బోధిస్తున్నది. అట్టి వానికే విలువ. కాని రోడ్డున పడి తిరుగుతున్న పిచ్చివాళ్లను చేర దీయడమో, దీనులకు వైద్య సాయం అందేలా చూడటమో, నిరుపేదలకు వారికి అందాల్సిన పథకాలు అందేలా చూడటమో, బాధితులకు వారి హక్కులు దక్కేలా చేయడమో, విష వలయాలలో చిక్కుకున్న స్త్రీల కోసం పని చేయడమో... ఇవన్నీ ఇంకెవరో చేయాలి... మన పిల్లలు మాత్రం కాదు అనే వైఖరి ఇప్పటి సమాజానిది.

బాగా చదువుకుని, స్థిరపడటం ఎవరూ వద్దనరు. కాని స్థిరపడ్డాక ఒక మానవ కర్తవ్యం ఉంటుంది. దానిని పాటించాలని ఎందుకు చెప్పరు? ఇవాళ లక్ష రూపాయలకు మించి జీతం తెచ్చుకుంటున్న ఉద్యోగులు ఎందరో ఉంటారు. వారిలో ఎందరు ఒక పేద విద్యార్థి చదువుకు సాయం చేస్తున్నారు? ఒక పేద రోగికి సాయం చేస్తున్నారు? గమనించుకోవాలి. ధార్మిక సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు మానవ సాయం చేయడానికి రావడం లేదు. కాని ధర్మం కూడా మానవసేవే మాధవ సేవ అని కదా చెప్పింది.

మనకెందుకు అందామా?
రోడ్డు మీద యాక్సిడెంట్‌ అవుతుంది. మనకెందుకు... అని వెళ్లిపోవాలి. ఎవరో ఎవరినో పొడుస్తుంటారు. మనకెందుకు అని చోద్యం చూడాలి. పక్కింట్లో ఒక భర్త భార్యను దారుణంగా కొడుతుంటాడు. మనం మన డోర్‌ మూసుకోవాలి. ఎదురింట్లో చిన్న వయసు ఉన్న పనమ్మాయిని హింసిస్తుంటారు. మనం గట్టిగా కళ్లు మూసుకోవాలి. ఇదా మనం నేర్చుకోవాల్సింది. పిల్లలకు నేర్పాల్సింది. పూర్వం సత్రాలు కట్టిన మహానుభావులు, స్కూళ్లు కట్టిన దాతలు, ఆస్పత్రులకు ఆస్తులు ఇచ్చిన సహృదయలు... వీరందరి వల్ల కదా సమాజాలు ముందుకు పోయింది. సాయం, స్పందన ఉంటేనే సమాజం. లేకుంటే రాళ్ల కుప్ప.

రోడ్డు దాటించడం కూడా...
సినిమాల్లో హీరో అంధుల్ని రోడ్డు దాటించడమే పెద్ద గొప్పగా, వీధి బాలలకు ఐస్‌ కొనివ్వడమే మానవత్వంగా చూపించే స్థాయికి మానవత్వం పడిపోయింది. యుద్ధస్థలాలకు, భూకంపం ఏర్పడిన చోటుకు, వరదల సమయంలో, కరువు కాటకాలకు పరిగెత్తుకుపోవడం కదా అసలైన గొప్ప. ఆ సమయంలో స్పందించినవాడే అసలైన మనిషి. కాని అలాగని అలాంటి వారు లేరని కాదు. కరోనా కాలంలో బాధితులకు వందల, వేల మంది సాయం అందించడానికి ముందుకు వచ్చారు. వలస జీవులు రోడ్డున నడుస్తుంటే వారి కోసం ఆహార పొట్లాలు, నీళ్లు అందుకుని పరిగెత్తిన వారు ఉన్నారు. కొన్ని ప్రమాదాల్లో అద్భుతంగా స్పందించిన మనుషులు ఎందరో.

కాని ఈ శాతం సరిపోదు. ప్రపంచ దేశాల ప్రజలంతా కలిసి ఒక్క మానవజాతి కాగలగాలి. సరిహద్దులకు, జాతులకు, దేశాలకు సంబంధం లేకుండా ఒకరి కష్టానికి ఒకరు బదులు పలకడమే లక్ష్యంగా ఎదగగలగాలి. ఇవాళ అఫ్ఘానిస్తాన్‌ మాకెవరూ లేరు అని రోదించే స్థితిలో ఈ ప్రపంచం ఉందంటే మానవత్వ సూచిలో అందరూ ఏ స్థానంలో ఉన్నట్టు..?

సాయం అందుతుంది... సాయానికి సాటి మనిషి ఉన్నాడు అన్న భరోసా కన్నా గొప్పది లేదు. సాయం చేయాలనే తలంపు నాకు ఉంది... చేస్తాను అనుకోవడానికి మించిన ఆత్మ సంస్కారమూ మరొకటి లేదు. ఆ సంస్కారం కోసం నిబద్ధులు కావడమే నేటి ‘ప్రపంచ మానవత్వ దినోత్సవం’ సందర్భంగా అందరూ చేయవలసిన పని.

మరిన్ని వార్తలు