పీరియడ్స్‌ ముందే ఆగిపోతే..!

18 Oct, 2020 10:49 IST|Sakshi

నగర జీవనశైలిలో పలు మార్పులు

ఆకస్మికంగా నిలిచిపోతున్న పీరియడ్స్‌ 

మహిళల్లో మెనోపాజ్‌ సమస్యలు 

 మానసికంగా, శారీరకంగా కుంగుబాటు 

 జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

 నేడు వరల్డ్‌ మెనోపాజ్‌ డే 

మారుతున్న జీవన శైలితో నగర మహిళలు విభిన్న రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే క్రమంలో చిన్న వయసులోనే మెనోపాజ్‌ బారిన పడేలా చేస్తోంది. కరోనా, లాక్‌డౌన్‌ వంటి అనూహ్య పరిస్థితులు మహిళల్ని ముఖ్యంగా ఉద్యోగినులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. అలాగే ప్రీ మెచ్యూర్‌ మెనోపాజ్‌ అవకాశాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మెనోపాజ్‌పై తగినంత అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నేడు వరల్డ్‌ మెనోపాజ్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
                                    
సాక్షి, సిటీబ్యూరో : పన్నెండు నెలల పాటు పూర్తిగా పీరియడ్స్‌ రాకుండా ఉండడాన్నే మెనోపాజ్‌ అంటారు. మన దేశంలో 46 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఈ దశ ఉంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే పీరియడ్స్‌ రావడం ఆగిపోతే అది ప్రీ మెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటారు. ఇది సహజంగా ఉండొచ్చు లేదంటే సర్జరీ ద్వారా అంటే యుట్రస్, ఓవరీస్‌ తీసేసినవారిలో ఈ సమస్య తలెత్తవచ్చు. 

ఎందుకిలా..?

  • ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటే వరుసగా నాలుగు నెలల పాటు పీరియడ్స్‌ రాకుండా ఉండటం. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌లు అంటే థైరాయిడ్, జన్యుపరమైనవి, క్రోమోజోమ్‌లలో అపసవ్యత ఉన్నా ప్రీ మెచ్యూర్‌ మెనోపాజ్‌ వస్తుంది. 
  • 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవారికి పీరియడ్స్‌ ఆగిపోతే వారికి వైద్యుల కౌన్సెలింగ్‌ అవసరం ఉంటుంది. కుటుంబ మద్ధతు అవసరం. మెనోపాజ్‌ లక్షణాలు.. ఒంట్లో నుంచి వేడి సెగలు రావడం, గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్‌కెళ్లడం, మూత్రనాళం ఇన్‌ఫెక‌్షన్, ఎముకలు పట్టేయడం లేదా బలహీనం కావడం అవుతుంటాయి. 
  • మానసిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, లైంగిక సమస్యలు, ఆత్మన్యూనతా భావం వంటివి తలెత్తుంటాయి. 

సమస్యలు రాకుండా ఉండాలంటే..  

  • జీవనశైలి మార్చుకోవాలి. రోజూ గంటసేపు తప్పనిసరి వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పొగతాగడం అలవాటు ఉన్నవారు దీన్ని మానేయాలి. 
  •  క్యాల్షియం, విటమిన్‌- డి సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. ఆహారం ద్వారా తీసుకున్నా మేలు కలుగుతుంది. సరైన ఎండ కూడా మేనుకి తగిలేలా చూసుకోవాలి.
  •  వదులు దుస్తులు వేసుకోవాలి. చల్లటి వాతావరణంలో ఉండటం, మసాలా వంటకాలు తగ్గించాలి. 
  •  మెనోపాజ్‌ వయసులో ఎముకల పటుత్వం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వీరికి ఎముక భాగంలో, తుంటి భాగంలో ప్రాక్చరర్స్‌ ఎక్కువ అవుతుంటాయి. రిస్క్‌ తగ్గించుకోవాలంటే హార్మోన్‌ థెరపీ అవసరమవుతుంది.

మెనోపాజ్‌లో హ్యాపీగా..

  •  డిప్రెషన్‌ వంటి ఛాయలు ఈ దశలో సాధారణంగా ఎదుర్కోవాల్సిఉంటుంది.  అందుకని కుటుంబంతో ఆనందంగా గడపాలి. స్నేహితులతో ఉల్లాసపు క్షణాలను వెతుక్కోవాలి. నచ్చిన హాబీని కొనసాగించాలి. ఒంటరిగా ఉండకుండా ఎవరికి వాళ్లు తీరకలేని వ్యాపకాన్ని ఎంచుకోవాలి. 
  •  తోటపని చేయడం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడం వంటివీ చేయొచ్చు. మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీదా దృష్టి పెట్టాలి. మెనోపాజ్‌ దశలో ఉన్నవాళ్లు ప్రతి  ఏడాది వైద్యుల సలహా తీసుకుంటే రాబోయే సమస్యలను ముందే నివారించవచ్చు.  -డాక్టర్‌ శిరీష, గైనకాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్, ముషీరాబాద్‌

మరిన్ని వార్తలు