World No Tobacco Day: పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి..

31 May, 2021 08:55 IST|Sakshi

పొగాకు ఏ రూపంలో వాడినా అది పూర్తిగా ప్రమాదకరం. అది అనేక నోటి సమస్యలకు, నోటి దుర్వాసనకు, చిగుర్ల వ్యాధులకు కారణం. అంతేకాదు ప్రాణాంతకమైన ఎన్నెన్నో క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణవ్యవస్థలో వచ్చే ఎన్నో రకాల క్యాన్సర్లతో పాటు, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు ముఖ్యంగా పొగాకు వినియోగమే ప్రధాన కారణం. సాధారణంగా పొగాకును రెండు రకాలుగా వాడుతుంటారు. 

1. పొగను వెలువరించేలా వాడటం: సిగరెట్లు, బీడీలు, పైప్‌లు, చుట్ట (సిగార్‌). 
2. పొగ రాకుండా వాడటం : ఇందులో పొగాకును... గుట్కా, ఖైనీ, తంబాకు, జర్దా వంటి రూపాల్లో నములుతుంటారు. ఇవన్నీ నోటి ద్వారా తీసుకునే పొగాకు ఉత్పాదనలు కాగా... ఇక ముక్కు ద్వారా ముక్కుపొడి (స్నఫ్‌)ని కొందరు వాడుతుంటారు. 

అది కేవలం అపోహ మాత్రమే... 
కొందరిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... సిగరెట్, బీడీ, చుట్ట, హుక్కా... ఇలా పొగాకును కాల్చడం ద్వారా పొగవచ్చేలా వినియోగించడం కంటే... పొగ ఏమాత్రం వెలువడకుండా పొగాకును కింది పెదవి కింద పెట్టుకొని పీలుస్తూ ఉండటం, తాంబూలంలో కొద్దిగా జర్దా రూపంలో వేసి తినడం పెద్దగా ప్రమాదం కాదనే అపోహలో ఉంటారు. కానీ నిజానికి పొగవచ్చేలా పొగతాగడం కంటే... పొగ వెలువడని విధంగా పొగాకు వాడకం వల్ల కలిగే క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఇలా పొగాకు నమలడం వల్ల దాదాపుగా 30 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. 

లక్షణాలు గమనించండి... డాక్టర్‌ను సంప్రదించండి :

  • నోట్లో చాలాకాలం వరకు తగ్గని పుండ్లు (అల్సర్స్‌)
  • నోటిలో ఎక్కడైనా కండ పెరగడం
  • తెల్లని మచ్చ కనిపించడం
  • నమలడంలో ఇబ్బంది
  • నోటి/నాలుక/దవడ కదలికలు మందగించడం
  • చాలాకాలం పాటు గొంతు బొంగురు గా ఉండటం
  • గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం... ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ఎన్నో వ్యాధులను ముందుగానే నివారించడం సాధ్యమవుతుంది. అందునా ఏ రకమైన క్యాన్సర్‌ అయినా ముందుగానే గుర్తిస్తే చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పొగాకు వాడేవారిలో పైన పేర్కొన్న లక్షణం ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఇక క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులను దరిచేరనివ్వకుండా చేసుకోడానికి తక్షణం పొగాకు అలవాటును మానేయాలి.

అది పొగతాగడమైనా లేదా పొగాకు నమలడమైనా.... అలవాటేదైనా సరే అంతే ప్రమాదకరమని గుర్తించాలి. ఈ ఏడాది థీమ్‌ ‘‘క్విట్‌ టొబాకో టు బి విన్నర్‌’’ను అనుసరించి పొగాకు వినియోగాన్ని వదిలేసి విజేతగా నిలవాలి. అలాగే ఈసారి నినాదమైన ‘కమిట్‌ టు క్విట్‌...’ స్ఫూర్తితో వెంటనే పొగాకును విసర్జించి, మళ్లీ ఎప్పుడూ తాకనంటూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. 

పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి... 

  • పళ్ల అసహ్యకరమైన రీతిలో పచ్చగా మారతాయి. పళ్ల మీద మరకలు, మచ్చలు ఏర్పడతాయి ∙నోటి నుంచి దుర్వాసన వస్తుంది  
  • నోటికి రుచులు, ముక్కుకు వాసన లు తెలియవు ∙నోటిలో ఊరే లాలాజలం తగ్గుతుంది. దాంతో పళ్లు దెబ్బతింటాయి. చిగుర్ల సమస్యలూ వస్తాయి
  • పిప్పిపళ్లు, చిగుర్ల సమస్యలు వస్తాయి. పంటి మీది ఎనామిల్‌ దెబ్బతింటుంది. చిగుర్ల లైన్‌ కిందికి వెళ్తుంది ∙వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వాటంతట అవే తగ్గిపోయే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా అపాయకరంగా మారవచ్చు
  • పొగాకు నమలడం వల్ల నోట్లోకి వెలువడే హానికరమైన విషద్రవాల ప్రభావం వల్ల చిగుర్లపైన, పెదవులపైన, గొంతులోన దుష్ప్రభావాలు చూపుతుంది. నోటిలోపలి మృదుకణజాలంపై పుండ్లు పడే (ల్యూకోప్లేకియా  అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తులకు గాలిని అందించే మార్గంలోనూ, ఆహారనాళం క్యాన్సర్లు రావచ్చు. 

కీలక అవయవాలకూ హానికరమే 

  • పొగాకు వల్ల గుండెకు నేరుగా హాని జరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి
  • ఊపిరితిత్తులు దెబ్బతింటాయి
  • కణంలోని జన్యు పదార్థాలు / డీఎన్‌ఏకు హాని జరుగుతుంది. 

చదవండి: Coronavirus: తగ్గిపోయాక పాలివ్వచ్చా?

మరిన్ని వార్తలు