World Oral Health Day: అంత యాక్షన్‌ వద్దు.. పులి కూడా బ్రష్‌ చేస్తుంది!

20 Mar, 2022 11:08 IST|Sakshi

‘పులి బ్రష్‌ చేస్తుందా?’.. ఎవరైనా ముఖం శుభ్రం చేసుకోకుండా ఏదైనా తింటూ ఉండటాన్ని ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం అది. అయితే పులి కూడా కొన్ని చెట్ల మొదళ్లు, ప్రత్యేక మొక్కలకు తన దంతాలను రుద్ది శుభ్రం చేసుకుంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సృష్టిలో అన్ని రకాల జీవులూ వాటి పరిధిలో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. కానీ తెలివి తేటలు ఉన్న మనిషి మాత్రం దంతాలను, నోటి శుభ్రతనూ నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ నెల 20న ‘నోటి ఆరోగ్య దినోత్సవం’. ఈ  సందర్భంగా నోటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.


చదవండి: World Sparrow Day: ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..?  

కర్నూలు(హాస్పిటల్‌): నోట్లో ఉత్పత్తి అయ్యే బాక్టీరియా నుంచి దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. పక్క వారు మాట్లాడేటప్పుడు వారి నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇతరుల సంగతి పక్కన పెడితే పలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. పళ్లు, చిగుళ్లు నొప్పి, గొంతు నొప్పి, నాలుక మీద పాచి పేరుకుపోవడం, నోరు పొంగడం(వేడి చేయడం) తదితర సమస్యలతో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఈ సమస్య అధికంగా మాట్లాడే వారిలో, నీటిని తక్కువగా తాగే వారిలోనూ, సరైన ఆహార నియమాలు పాటించని, జీర్ణాశయ సమస్యలున్న వారిలోనూ మరింత అధికంగా ఉంటుంది.  కర్నూలు, దేవనకొండ, పత్తికొండ, ఆదోని, ఆస్పరి, నందికొట్కూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రజల పళ్లపై పచ్చని రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు పళ్లను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల పంటి చుట్టూ గార ఏర్పడి, చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి రక్తం కారుతూ, నొప్పి, దుర్వాసన వస్తూ ఉంటుంది.

నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి 
నోటిని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. పిప్పి పళ్లు ఉంటే తీసివేయకుండా డెంటల్‌ ఫిల్లింగ్‌ లేదా రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలి. చిగుళ్లుకు మర్దన చేసుకోవాలి. సరైన ఆహార నియమాలు పాటించాలి. ఆల్కాహాలు, పాన్, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆరు నెలలకోసారి దంత వైద్యున్ని సంప్రదించాలి.
– డాక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌రెడ్డి, దంత వైద్యనిపుణులు, కర్నూలు  

మరిన్ని వార్తలు