Pubarun Basu: నాలుగేళ్ల వయసులో మొదలెట్టాడు.. అద్భుతం ఆవిష్కృతం! అంతర్జాతీయ స్థాయిలో!

19 Aug, 2022 12:40 IST|Sakshi
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పబురన్‌ బసు(PC: Pubarun Basu)

World Photography Day 2022: ఇల్లు అలకగానే పండగ కాదు. సెల్‌ఫోన్‌తో అల్క(తేలిక)గా క్లిక్‌ అనిపించగానే ఫొటో కాదు. కాస్త కళా పోసన ఉండాలా. అది ఉంటే... పబురన్‌ బసు మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు...

పబురన్‌ బసు తండ్రి కెమెరాను చేతుల్లోకి తీసుకునే నాటికి తన వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే. తండ్రి ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ కావడం వలన ఉత్తర కోల్‌కతాలోని ఆ ఇంట్లో ఎటు చూసినా రకరకాల ఫొటోగ్రాఫిక్‌ ఎక్విప్‌మెంట్‌లు కనిపించేవి. తనకు తోచినట్లు గా వాటితో ఏవో ప్రయోగాలు చేస్తుండేవాడు బసు.

కోవిడ్‌ కల్లోలంతో అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ తీరిక సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు బసు. ఫొటోగ్రఫీపై పూర్తిగా దృష్టి పెట్టాడు. మ్యూజియం ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్, న్యూయార్క్‌ ఆన్‌లైన్‌ ఫొటోగ్రఫీ కోర్స్‌ పూర్తిచేశాడు. ఫొటోగ్రఫీ లోతుపాతులు తెలుసుకోవడానికి ఇది తనకు ఎంతగానో ఉపయోగపడింది. ఫొటోగ్రఫీకి సంబంధించిన మ్యాగజైన్‌లు, పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు.


PC: Pubarun Basu

‘ఇలా నేను తీయగలనా?’
సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్‌ల గురించి ఎప్పుడూ వింటుండేవాడు బసు. బహుమతి గెలుచుకున్న ఫొటోలను చూస్తూ అబ్బురపడేవాడు.
‘ఇలా నేను తీయగలనా?’ అనుకునేవాడు. పోటీలో తొలిసారి పాల్గొన్నప్పుడు ఎలాంటి అవార్డ్‌లు రాలేదుగానీ, తన ఫొటో గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసాపూర్వకమైన వాక్యాలు రాశారు ఎడిటర్‌. ఇది తనకు ఎంతో కిక్‌ ఇచ్చింది. తనపై తనకు నమ్మకాన్ని పెంచింది.

అద్భుతం ఆవిష్కృతం!
కొన్నిసార్లు సందర్భాలు అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తాయి. అలాంటి సువర్ణ అవకాశం ఒకరోజు తనకు వచ్చింది. అవి లాక్‌డౌన్‌ రోజులు. కిటికీ నుంచి వస్తున్న సూర్యకిరణాల నీడ కర్టెన్‌పై పడుతోంది. తనకు వెంటనే ఒక ఐడియా తోచింది.

‘అమ్మా! తెర వెనుక వెళ్లి చేతులు ఆనించు’ అన్నాడు తల్లితో.
ఆమె అలాగే చేసింది. నిజంగా ఒక అద్భుతం ఆవిష్కారం అయింది. ఆ ఫొటోకు ‘నో ఎస్కేప్‌ ఫ్రమ్‌ రియాలిటీ’ అని పేరు పెట్టి ‘సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్‌–2021’కి పంపాడు. ఆ ఫొటో తనని ‘యూత్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ గెలుచుకునేలా చేసింది.

‘ఇది నిజమేనా?’ అని తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కేలేదు! అంతర్జాతీయ అవార్డ్‌ దక్కించుకున్నంత మాత్రాన ‘ఇక నాకు ఎదురులేదు’ అనుకోవడం లేదు బసు.

అలా అనుకోకూడదు!
‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు. నేర్చుకుంటూనే ఉన్నాను అని మాత్రమే అనాలి’ అంటూ తండ్రి చెప్పిన మాట తనకు బాగా గుర్తుండిపోయింది. బీబిసి, నేషనల్‌ జాగ్రఫీ... మొదలైన ఫొటోగ్రఫీ పోటీల్లో కూడా బహుమతులు గెలుచుకున్నాడు బసు.


PC: Pubarun Basu

‘సెల్‌కెమెరా కావచ్చు, మామూలు కెమెరా కావచ్చు అవి ఫొటోగ్రాఫర్‌ క్రియేటివిటీకి పరిమితులు విధించలేవు. ఖరీదైన కెమెరాలతో మాత్రమే ఆహా అనిపించే ఫొటోలు వస్తాయనడంలో నిజం లేదు. తమ దగ్గర ఉన్న సాదాసీదా  కెమెరాలతోనే అద్భుతమైన ఫొటోలు తీస్తున్న స్ట్రీట్‌ ఫొటోగ్రాఫర్లే దీనికి ఉదాహరణ’ అంటున్న బసు తన కెమెరా ద్వారా సమాజానికి సంబంధించి ఎన్నో కథలు చెప్పాలనుకుంటున్నాడు. ఫిల్మ్‌మేకింగ్‌లోకి వెళ్లాలనేది అతడి భవిష్యత్‌ కల.

చదవండి: Divine Space: శ్వాసపై ధ్యాస
Cyber Crime Prevention Tips: టెక్ట్స్‌ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్‌ స్కామ్‌.. చా(చీ)టింగ్‌!

మరిన్ని వార్తలు