World Sparrow Day: ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..?

20 Mar, 2022 09:48 IST|Sakshi

నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

సీతంపేట (విశాఖ ఉత్తర): ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లో చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచ కిచలు నేడు కరువయ్యాయి. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి.

చదవండి: అద్భుతాలు సృష్టించి.. వాటికే బలై.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా?

పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంట్లో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి.

పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహా్మ్రస్తాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‌తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కలి్పస్తున్నారు, ఏ ఏడాది ‘ఐ లవ్‌ స్పారో’ థీమ్‌తో వరల్డ్‌ స్పారో డే నిర్వహిస్తున్నారు. వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు ,కళాశాలల్లో  అవేర్‌నెస్‌ క్యాంపైన్స్, , వ్యాసరచన, సమావేశలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

23 ఏళ్లుగా కృషి చేస్తున్నాం 
పట్టణీకరణ, కాలుష్యం, రేడియేషన్‌ కారణంగా సున్నితమైన పిచ్చుక సంతంతి నానాటికీ తగ్గిపోతోంది. పిచ్చుకలు మానవాళికి ఎంతో ప్రయోజకరమైనవి. పిచ్చుకల పరిరక్షణకు 2000 సంవత్సరంలో గ్రీన్‌ క్లైమేట్‌  సంస్థను స్థాపించి 23 ఏళ్లుగా వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాం. సభలు, సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పిచ్చుకల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణకు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని వివరిస్తున్నాం. ఈ విధంగా  గ్రీన్‌ క్లైమేట్‌  టీం వేలాది మంది విద్యార్థులకు , యువతకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు అవగాహన కల్పిస్తోంది.

పాఠశాలలు, కళాశాలకు వెళ్లి పిచ్చుకల పరిరక్షణకు ఏం చెయ్యాలో అవగాహన కల్పించి విద్యార్థులను  భాగస్వామ్యం చేశాం. పిచ్చుకలు కనిపించే ప్రాంతాలకు వెళ్లి వాటిని కాపాడటానికి గూళ్లు, ఆహారం, నీరు ఏర్పాటు చెయ్యమని చైతన్య పరిచాం. 2002లో చెక్కతో తయారు చేసిన పిచ్చుకల గూళ్లు నగర  ప్రజలకు పరిచయం చేసి విరివిగా ఏర్పాటు చెయ్యాలని ప్రచారం చేశాం. అలాగే 2005లో మట్టితో చేసిన గూళ్లు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చి ఇంటి పరిసరాలలో ఉంచాలని అవగాహన కల్పించాం. టీమ్‌ సభ్యుల సుదీర్ఘ కృషితో విశాఖనగరంలో ప్రస్తుతం  280 ప్రాంతాలలో పిచ్చుకలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు తమ ఇళ్ల బాల్కనీలు, మెట్ల కింద మట్టితో చేసిన గూళ్లు, ఆహారం, నీళ్లు ఏర్పాటు చెయ్యాలి.
–జేవీ రత్నం, వ్యవస్థాపకుడు, గ్రీన్‌ క్లైమేట్‌ సంస్థ 

పిచ్చుకల అవసరం ఎంతో ఉంది 
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): పిచ్చుకలను పరరిక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని గ్రీన్‌ క్లైమేట్‌  సంస్థ వ్యవస్థాపకుడు జేవీ  రత్నం,  పేర్కొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని శనివారం చినవాల్తేరులో గల –జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్‌ క్లైమేట్‌  టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, ఈ ఏడాది పిచ్చుకల దినోత్సవం ఇతివృత్తం ‘నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను’ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో దినోత్సవాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జీ.కృష్ణవేణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారు పిచ్చుకలను పరిరక్షిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.

పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి 
పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చుకల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. వాటికి నివాసయోగ్యంగా ప్రజలు సౌకర్యాలు కల్పించాలి. డోడో పక్షి అంతరిస్తే జరిగిన నష్టం మనం తెలుసుకున్నాం. అందుకే మన ఇంటి చుట్టు ఉన్న పిచ్చుకలను కాపాడుకోవాలి. పిచ్చుకలవల్ల మన ఇంటికి, వ్యవసాయానికి మేలుజరుగుతుంది. 
–ఈయూబీ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు,  పర్యావరణ విభాగం

ఆహారం..నీరు అందించాలి 
పిచ్చుకలు అంతరించిపోతే పంటలకు హానికలుగుతుందని గ్రహించాలి. మనకు, పంటలకు హానికలిగించే క్రిమి కీటకాలను నివారించే సున్నితమైన పక్షి. మనం పిచ్చుక జాతిని పరిరక్షించుకోవాలి, పిచ్చుకల ఆవశ్యకతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వాటి మనుగడకు అవసరమైన గూళ్లు, ఆహారం, నీరు ఇంటి పరిసరాలలో అందుబాటులో ఉంచాలి. ఇతర జీవుల వల్ల వాటి సంతతికి నష్టం కలగకుండా చూడాలి. 
– హేమలత, జువాలజీ లెక్చరర్‌

సంతతి తగ్గుముఖం 
పిచ్చుకల సంఖ్య ఘనణీయంగా తగ్గిపోయింది. పిచ్చుకల సంతతి పెరిగేలా చేపట్టాల్సిన చర్యలపై భావితరాలకు అవగాహన కలి్పంచాలి. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల ఆవశ్యకతపై అవగాహన కలి్పంచి వాటి పరిరక్షణలో భాగస్వామ్యం చెయ్యాలి. పిచ్చుకల రక్షణ బాధ్యత పూర్తిగా మనదే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.  
– సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత కులపతి, కృష్ణా యూనివర్సిటీ   

మరిన్ని వార్తలు