World Zoonoses Day: కని‘పెట్‌’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!

5 Jul, 2022 13:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జూలై 6న ప్రపంచ జునోసిస్‌ డే

ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకూ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ‘ప్రపంచ జునోసిస్‌ డే’ను నిర్వహిస్తుంటారు.  

పొంచి ఉన్న వ్యాధులు 
మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువుల నుంచి, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి.

ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్‌ డిసీజెస్‌ అంటారు. ముఖ్యంగా వీధి కుక్కుల నుంచి ర్యాబిస్‌ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్‌. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు.

మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్‌ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

ర్యాబిస్‌ నివారణ చర్యలు
►ర్యాబిస్‌ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌ చేయాలి.
►అలాగే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజెక్షన్లు చేయాలి. 
►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్‌ చేసినట్లు సర్టిఫికెట్‌ తీసుకోవాలి.  
►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. 
►ర్యాబిస్‌ వ్యాధి సోకిన కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి.

అప్రమత్తత అవసరం  
జూనోసిస్‌ వ్యాధులు ప్రమాదకరమైనవి. మన పరిసరాల్లో ఉండే జంతువుల నుంచే వస్తాయి. జంతువులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం వల్ల, కుక్కలు నేరుగా మనుషులను కరవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ర్యాబిస్‌ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి.

మా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ జూనోసిస్‌ వ్యాదుల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పెంపుడు జంతువుల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పశువైద్య కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సిన్‌లు వేస్తున్నాము. 
– డాక్టర్‌ సనపల లవకుమార్, మల్టీ స్పెషలిస్ట్, పశువైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం
-ఇచ్ఛాపురం రూరల్‌, శ్రీకాకుళం

చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్‌ కిల్లర్స్‌ వాడాలి?

మరిన్ని వార్తలు