రూ. 300 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్‌.. స్పెషల్ ఏంటి?

30 May, 2021 14:04 IST|Sakshi

ఊపిరి సినిమా చూశారా! అందులో హీరో కార్తీ టాయిలెట్‌ క్లీనింగ్‌ బ్రష్‌తో ఓ చిత్రమైన పెయింటింగ్‌ వేస్తాడు. దానిని రూ. 2 లక్షలు పెట్టి కొనటమే కాకుండా.. లేని ఓ అర్థాన్ని వివరిస్తూ హాస్యం పండిస్తాడు ప్రకాశ్‌రాజ్‌. అలా వచ్చిన డబ్బుతో కార్తీ తన చెల్లి పెళ్లి చేస్తే.. నిజ జీవితంలో బ్రిటన్‌కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. అయితే, ఇతను కార్తీలా కాదు.. ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్‌ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? ఇలా వాళ్ల అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్‌ వేసి వాటిని తనకు పంపాలని కోరాడు. 

ఆ తర్వాత దుబాయ్‌లోని అట్లాంటిస్‌ హోటల్‌లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని వెచ్చించి ఆ పెయింటింగ్‌ వేశాడు. దీనికోసం 1,065 పెయింట్‌ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్‌ను  ఉపయోగించాడు. 70 విభాగాలుగా చిత్రించి తర్వాత ఒక్కటిగా కలిపి పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద కాన్వాస్‌ పెయింటింగ్‌గా తయారు చేశాడు. ఇది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు కూడా సంపాదించుకుంది. పైగా ఇందులో ‘జర్నీ ఆఫ్‌ హ్యుమానిటీ’ అనే అర్థం దాగి ఉంది. దుబాయ్‌లోని ‘ది పామ్‌’ హోటల్‌లో నిర్వహించిన వేలంలో దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘ఆండ్రీ అబ్దున్‌’ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఆ డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

చదవండి: రూ.2,000 నోటుపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు