రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా?

19 Mar, 2021 00:23 IST|Sakshi

నిద్రలో కంటున్న చిరునవ్వుల కల ఆఖరి నిముషంలో చెదిరిపోయినట్లే, వాస్తవం లో నెరవేర్చుకోవాలన్న కల చివరి ఒక్క పాయింట్‌తోనో, ఒక్క మార్కుతోనో ఛిద్రమైపోతుంది. పోయింది పాయింటే తప్ప, తగ్గింది మార్కే తప్ప జీవితం కాదు. అంత ఆలోచించే శక్తి లేకపోయింది రితికా ఫొగట్‌కు! ఈ లోకాన్నే విడిచిపోయింది.

ఎంత వయసని! పదిహేడేళ్ల అమ్మాయి రితిక. రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారిణి. ఆటలో ఫైనల్స్‌ వరకు వచ్చింది. ఒక్క పాయిట్‌తో ‘గెలుపు’ను మిస్‌ అయింది. ఎంత వ్యథ చెందిందో. గెలవలేకపోవడాన్ని తట్టుకోలేకపోయింది. ప్రాణాలు తీసుకుంది. నిజంగా తనే ప్రాణాలు తీసుకుందా? గెలిచి తీరాలన్న పంతం ఒత్తిడిగా మారి ప్రాణం తీసిందా? ఓడి, ఇంటికి వచ్చాకనైనా ఆమె లోలోపలి ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? బాధను పంచుకోలేకపోయారా? ఏమైనా.. ఇది విషాదం. చుట్టూ ఇంతమంది ఉండి ఒక్కరైనా రితిక మూడ్స్‌ని పసిగట్టి, ఆమెను కాపాడలేకపోవడం! ఆమె పెద్దమ్మ కూతుళ్లు గీతా ఫొగట్, బబితా ఫొగట్‌ ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు.

వాళ్లూ రెజ్లర్లే! వాళ్లూ కెరీర్‌ ఆరంభంలో ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నవాళ్లే. తన ఆవేదనను ఒక్కమాటగానైనా అక్కలలో ఒక్కరికైనా చెప్పలేకపోయిందా రితిక!! ఎవరికి ముఖం చాటేయడానికి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది! రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మార్చి 14న జరిగిన రెజ్లింగ్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌లో విజయం రితక చేజారింది. మార్చి 17న ఆమె తన జీవితాన్ని చేజార్చుకుంది. భరత్‌పూర్‌ నుంచి తిరిగొచ్చాక జైపూర్‌ దగ్గరి స్వగ్రామంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె చనిపోయిన తేదీపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోవడానికి కారణం మాత్రం ఏకాభిప్రాయానికి యోగ్యమైదే. ఓటమి నుంచి తిరిగొచ్చాక ఆమెనెవరూ అంటిపెట్టుకుని లేరు! ఒక మాటైతే అని ఉంటారు.. ‘నెక్స్‌ట్‌ టైమ్‌ బెటర్‌ లక్‌’ అని.

‘టేక్‌ ఇట్‌ ఈజీ రితికా’ అని కూడా అని ఉండొచ్చు. కానీ ఆమె గుండె లోతుల్లో ఏం ఉందో ఎవరు ఊహించగలరు? ఊహించాలి. ఆటలో ఓడిన వారిని, మాట పడొచ్చిన వారిని ఒంటరిగా వదలకూడదు. నీడలా వెన్నంటి ఉండాలి. సున్నితమైన మనసు గలవారినే కాదు.. గట్టిగా ఉండేవాళ్లను కూడా దగ్గరగా గమనిస్తుండాలి. ఓటమి ఎంత గట్టివాళ్లనైనా క్రుంగదీస్తుంది. వారిలో కుంగుబాటు కనిపిస్తే నిఘా ఉంచాలి. చెట్టుకు కంచెలా వారి ప్రాణానికి ‘గమనింపు’ను కావలిగా పెట్టాలి. ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌ చోటీ బెహన్‌ రితికా’ అని వేల పోస్ట్‌లు వస్తున్నాయి. రితిక ఆ ఆరుగురు ‘పొఘట్‌ సిస్టర్స్‌’కి మాత్రమే చెల్లి కాదు అన్నట్లుగా నెట్‌ నిండా కన్నీటి ట్వీట్‌లు కురుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు