‘బజార్‌’  ను చూపినవాడు..

23 Mar, 2021 23:27 IST|Sakshi

హైదరాబాద్‌ నేపథ్యంలో గల్ఫ్‌కు ఆడపిల్లలను అమ్మే కథాంశంతో అద్భుతమైన కళాఖండం ‘బజార్‌’ తీసిన దర్శకుడు సాగర్‌ సర్హదీ సోమవారం (మార్చి 22)న కన్నుమూశారు. గొప్ప కథకునిగా, స్క్రీన్‌ప్లే రచయితగా సాగర్‌ సర్హదీని బాలీవుడ్‌ గౌరవిస్తుంది. ఆయన స్వయంగా సాహితీకారుడు. ఉర్దూ కథలు అనేకం రాసి యాడ్‌ ఫీల్డ్‌లో పని చేసి సినిమాలకు వచ్చాడాయన. మరణించేనాటికి వయసు 87 సంవత్సరాలు. ‘సర్హదీ’ అంటే సరిహద్దువాడు అని అర్థం. సాగర్‌ సర్హదీ అసలు పేరు గంగాసాగర్‌ తల్వార్‌. కాని ఆయన సరిహద్దుకు ఆవలివైపు ‘బఫా’ అనే గ్రామంలో జన్మించాడు. కాని దేశ విభజన తర్వాత కుటుంబంతో ఢిల్లీ చేరుకుని కాందిశీకులుగా బతకాల్సి వచ్చింది. ఆ సమయం లోనే ఆయన తన పేరును ‘సాగర్‌ సర్హదీ’ గా మార్చుకున్నాడు. సొంత ప్రాంతాన్ని కోల్పోయానన్న ఆవేదన, వెలితి ఆయనను సాహిత్యం వైపు మళ్లించింది. ఢిల్లీ తర్వాత ముంబై చేరుకుని నాటకాలు రాయడం మొదలెట్టాడు.

ఆ సమయంలోనే దర్శకుడు యశ్‌ చోప్రా దృష్టి ఆయన పై పడింది. యశ్‌ చోప్రా దాదాపు తన సినిమాలకు ఆయన చేత పని చేయించుకున్నాడు. ‘కభీ కభీ’, ‘నూరి’, ‘చాందినీ’, ‘సిల్‌సిలా’ ఈ సినిమాలకు స్క్రీన్‌ప్లే, కథ, డైలాగ్‌ విభాగాలలో సాగర్‌ సర్హదీ పని చేశాడు. ఆ తర్వాత తనే సొంతగా దర్శకునిగా మారి ‘బజార్‌’ సినిమా తీశాడు. ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. నసీరుద్దీన్‌ షా, స్మితాపాటిల్‌ నటించిన ఈ సినిమాలో ‘కరోగే యాద్‌తో హర్‌బాత్‌ యాద్‌ ఆతీహై’ పాట నేటికీ హిట్‌గా నిలిచింది.సాగర్‌ సర్హదీ ప్రగతిశీల సాహితీ ఉద్యమంలో పని చేశాడు. ముంబైలోని ఆయన నివాసంలో అతి పెద్ద లైబ్రరీ ఉంది. మరణించే వరకూ కూడా తన సొంత ప్రాంతాన్ని తిరిగి చూడలేకపోయిన బాధను అనుభవించాడాయన. మరో సినిమా దర్శకుడు రమేశ్‌ తల్వార్‌ ఈయన మేనల్లుడు. సాగర్‌ సర్హదీకి జావేద్‌ అఖ్తర్‌ వంటి సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు