ఆత్మరక్షణ: ప్రతిరోజూ పోరాటమే! 

1 Sep, 2020 09:32 IST|Sakshi

యానీయా భరద్వాజ్‌ బాలీవుడ్‌ నటి, మోడల్, వెబ్‌స్టార్‌. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సీరిస్‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పట్టణ, గ్రామీణ భారతీయ బాలికలు నన్చాకు(జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్‌ వెపన్‌), కత్తి విద్యలను తప్పనిసరి నేర్చుకోవాలని ఇటీవల ట్విటర్‌ వేదికగా కోరింది.  యానీయా లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ హిమాచల్‌ ప్రదేశ్‌లో నన్చాకు, కత్తి పోరాటాలలో కఠిణ శిక్షణ తీసుకుంటోంది.

‘భారతీయ అమ్మాయిలు తమ మనుగడకు ప్రతిరోజూ పోరాటం చేయాల్సిందే. అందుకు ఆత్మస్థైర్యం, ఆత్మరక్షణకు పోరాట పఠిమను పెంచే విద్యలలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అవసరం’ అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చింది యానీయా – ‘అమ్మాయి అనగానే అందం, సున్నితత్వం అనే అంశాలకు మాత్రమే మనదగ్గర ప్రాధాన్యమిస్తారు. చిన్ననాటి నుంచీ అలాగే పెంచుతారు. అందుకే, చాలామంది అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పాళ్లు తక్కువ. ప్రపంచ సినిమా, అంతర్జాతీయ వినోద ప్రాజెక్టులలో ఔత్సాహిక నటిగా ఎదగడానికి ముందు నేను ధైర్యంగా ఉండటం అవసరమని భావించాను. అప్పుడే నన్చాక్స్, కత్తులు నన్ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నేను వాటితో కనెక్ట్‌ అయ్యానని బలంగా నమ్ముతున్నాను. నన్చాకు ను ఉపయోగిస్తూ హృతిక్‌  రోషన్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించాను. అప్పుడే దాని ప్రాముఖ్యం తెలిసింది. అందుకే నన్చాకులో శిక్షణ పొందాను. నన్చాక్‌తో నైపుణ్యం శరీరం ఫిట్‌గా ఉండటానికీ తోడ్పడుతుంది. ఇప్పుడు కత్తితో ప్రాక్టీస్‌ చేయడాన్ని బాగా ఇష్టపడుతున్నాను. 

రక్షణ విద్యలు అవసరం
పట్టణ, గ్రామీణ భారతదేశంలోని భారతీయ బాలికలు అందరూ నన్చాకు, కత్తి నైపుణ్యాలను తప్పక నేర్చుకోవాలి. తమను తాము రక్షించుకోవడానికి ఈ విద్యలు చాలా అవసరం. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొందరు గ్రామస్తులు నా సాధనకు అరుదైన చారిత్రాత్మక కళాఖండ ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చారు. ఆ సమయంలో ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. ఈ నైపుణ్యాలతో ఒక నటిగా నన్ను నేను నిలబెట్టుకోగలను అనే నమ్మకం మరింతగా బలపడింది. ఇటీవల రిలీజైన అంతర్జాతీయ వెబ్‌ సీరీస్‌లలో ‘కర్స్‌డ్‌’ , ’ది విట్చర్‌’ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ సీరీస్‌లలో నటీమణులు కత్తి, ఆయుధాలను వాడి తమ ప్రతిభను చాటుకున్నారు. కత్తి పోరాట సామర్ధ్యాలతో రాణించే మొదటి భారతీయ నటి నేను కావాలని శ్రమిస్తున్నాను.

మొదట నేను చేయబోయే సినిమా కోసమే ఈ విద్య నామమాత్రంగా నేర్చుకోవాలనుకున్నాను. కానీ, ఈ విద్య నాలో తెలియని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. అందుకే కఠిన శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించింది యానియా. అంతేకాదు కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యానీయా హిమాచల్‌ప్రదేశ్‌లో తన ఫోటోగ్రఫీ అభిరుచికి పదును పెట్టింది. వెలుతురు–చీకటి, నలుపు–తెలపులలో తీసిన ఫొటోలు యానీయా దృష్టి ప్రత్యేకతను చాటుతున్నాయి. సినిమా తారలు అంటే అందానికే కాదు ఆత్మవిశ్వాసానికీ ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ రంగంలో రాణించడానికి నటనలోనే కాదు పోరాట నైపుణ్యాల కృషికీ శ్రమిస్తున్నారు. అమ్మాయిలలో స్ఫూర్తిని నింపుతున్నారు.

మరిన్ని వార్తలు