అదర్‌ సైడ్‌.. నేను సైతం...

15 Mar, 2022 00:45 IST|Sakshi
బాధితులకు అండగా... యామీ గౌతమ్‌

బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు... యామీ గౌతమ్‌. ‘ఇప్పుడు నా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’ అనే మాట సెలబ్రిటీల నోటి నుంచి వింటుంటాం. యామీ మాత్రం తన కెరీర్‌తో పాటు సామాజిక విషయాలపై దృష్టి కేటాయించాలనుకుంటుంది. అందుకు ఉదాహరణ... మజిలీస్, పరి అనే స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆమె పనిచేయాలని నిర్ణయించుకోవడం. అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఇవి.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజిలీస్‌ విషయానికి వస్తే, 1991లో ఫ్లావియ ఈ సంస్థను ప్రారంభించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ‘మజిలీస్‌’లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువమంది లాయర్లే.

దిల్లీ కమిషన్‌  ఫర్‌ వుమెన్‌ కార్యాలయంలో యామీ గౌతమ్‌

అత్యాచార బాధితులకు అండగా నిలవడమే కాదు, స్త్రీ సాధికారత, హక్కులు, చట్ట, న్యాయ సంబంధిత విషయాల గురించి అవగాహన కలిగించడంతోబాటు ఫెలోషిప్‌ ప్రోగ్రామ్స్‌ చేపడుతుంది మజిలీస్‌. అయితే చాలాసార్లు ఈ సంస్థకు నిధుల కొరత అవరోధంగా ఉంటోంది..

యామీలాంటి పేరున్న నటులు చేయూత ఇస్తే ఆ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది.
‘అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది.

మనం ఏమీ చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది యామీ. బాలీవుడ్‌లో పది సంవత్సరాల అనుభవాన్ని గడించిన యామీ గౌతమ్‌ తొలి రోజులు నల్లేరు మీద నడకేమీ కాదు. రక రకాల సమస్యలు ఎదుర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే తన మీద తనకు అపనమ్మకం.

‘మన మీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను’ అంటున్న యామీ తొలిరోజుల్లో స్క్రిప్ట్‌ వినేటప్పుడు...

‘ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?’ అనే వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం ‘ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అనే కోణంలో ఆలోచిస్తుంది. ‘లాస్ట్‌’ సినిమాలో క్రైమ్‌ రిపోర్టర్, ‘దాస్వీ’లో ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలు పోషించడం ఆమె ఆలోచన« దోరణిలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. తాజా చిత్రం ‘ఏ థర్స్‌ డే’కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నైనా జైస్వాల్‌ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించింది యామీ గౌతమ్‌. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు, మన కర్తవ్యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది.

మరిన్ని వార్తలు