తెలివుండాలి...తెలిసుండాలి

3 Mar, 2021 08:50 IST|Sakshi

జెన్‌పథం

అది అర్ధరాత్రి వేళ. అడవిలో ఒకతను నడుచుకుంటూ పోతున్నాడు. ఇంతలో అనుకోని రీతిలో ఇద్దరొచ్చి  అతనిని కింద పడేసి గొడవకు దిగారు. అతనేమీ భయపడక వారితో గొడవపడ్డాడు. చివరికి ఆ ఇద్దరూ కలిసి అతని చేతి సంచీని లాక్కున్నారు. అందులో ఎంత డబ్బున్నదీ చూశాడు ఒకడు. చాలా కొద్దిమొత్తమే ఉంది. ‘‘ఓరీ వెధవా, నీ దగ్గర ఇంతేనా ఉంది....వీటికోసమే మాతో తలపడ్డావు... ఒకవేళ నీ దగ్గర వంద రూపాయలు గానీ ఉండి వుంటే మమ్మల్నిద్దరినీ చంపడానికి కూడా వెనుకాడి ఉండవు కదా’’అన్నారా దోపిడీ దొంగలు. అప్పటివరకూ నేల మీదే పడున్న అతను నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. తన శరీరానికి అంటుకున్న మట్టినంతా దులుపుకుంటూ చెప్పాడు...

‘‘నేనేమీ ముప్పయి రూపాయల కోసం మీతో తలపవడలేదు అన్నాడు.‘‘అయితే మరెందుకు?’’ అని అడిగారు దోపిడీ దొంగలు. ‘‘అంతకుముందే నా నడుముకి చుట్టుకున్న గుడ్డలో చాలా డబ్బుంది. వాటిని కాపాడుకోవడానికే మీతో గొడవపడ్డాను’’ అన్నాడు. ఈ మాట తర్వాత అక్కడ ఏం జరిగిందో విడిగా చెప్పక్కర్లేదుగా. ఎంత చదువుకుంటేనేం, ఆపద సంభవించేటప్పుడు తెలివిని ఉపయోగించకుంటే వారు ఒట్టి మూఢులేగా. మార్గమధ్యంలో ఎదురుపడే దోపిడీదొంగలతో మౌనంగా ఉండటమే తగిన ఉపదేశం.  అంతకన్నా ఇంకేం చెప్పాలి. దాని మహత్తు తెలుసుకునుంటే అతను మూర్ఖుడిగా ఉండడు. అబద్ధం చెప్పడం వేరు. నిజాన్ని దాచడం వేరు. నిజం మాట్లాడాలనుకున్నవాడు తెలివైనవాడే. నిజాన్ని ఎప్పుడు ఏ సమయంలో మాట్లాడాలి అన్నదీ తెలుసుకునుండాలి. ఈనాటి ప్రపంచంలో మేధావుల కన్నా తెలివైనవారే కావాలి.
  – యామిజాల జగదీశ్‌ 

మరిన్ని వార్తలు