14 ఏళ్లకే అద్భుతం అనిపించిన ట్విన్‌ బ్రదర్స్‌.. ఇంతకీ ఏం చేశారంటే..?

21 Jan, 2022 13:41 IST|Sakshi
∙యువరాజ్‌ భరద్వాజ్‌  

ఎందుకు? ఏమిటి? ఎలా....అనే ఆసక్తి వీరిని రకరకాల శాస్త్ర,సాంకేతిక పుస్తకాలు చదివేలా చేసింది. కొత్తగా ఆలోచించేలా చేసింది. కొత్త మార్గంలో వెళ్లేలా చేసింది. చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకునేలా చేసింది... 

పద్నాలుగేళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటారు? సినిమాలంటే బోలెడు ఇష్టపడతారు. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. వీరతాళ్లు మెడలో వేసుకొని వీడియో గేమ్స్‌ ఆడతారు. అయితే దిల్లీకి చెందిన ట్విన్‌ బ్రదర్స్‌ యశ్‌రాజ్‌ భరద్వాజ్, యువరాజ్‌ భరద్వాజ్‌ మాత్రం ఈ వయసులోనే తమ వయసుకు మించిన పనులు చేశారు. అద్భుతం అనిపించుకున్నారు. కాస్త వెనక్కి వెళితే..

అందరు పిల్లలలాగే ఈ కవల సోదరులకు క్రికెట్‌ అంటే చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆట మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లు. ‘ఇలా అయితే చదువు పూర్తిగా దెబ్బతింటుంది. మీరు కొంతకాలం క్రికెట్‌ను దూరం పెడితే మంచిది’ అని బుజ్జగింపు ధోరణిలో చెప్పాడు తండ్రి. ఇక అంతే...అప్పటి నుంచి క్రికెట్‌ జోలికి వెళ్లలేదు. చదువే వారి ప్రపంచం అయింది.
చదవండి: టీచరమ్మ స్కూలు సేద్యం

నేషనల్‌ జాగ్రఫిక్‌–డిస్కవరీ చానల్స్‌ చూడడం ద్వారా ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే జిజ్ఞాస పెరిగింది. తమ పుస్తకాలే కాకుండా పై తరగతి పుస్తకాలు చదివేవారు. సందేహాలు వస్తే సీనియర్లను అడిగేవారు. సైన్స్‌ ఫిక్షన్‌తో పాటు రిసెర్చ్‌ పేపర్స్, విజ్ఞానదాయకమైన బ్లాగ్స్‌ విరివిగా చదివేవారు. ప్రాజెక్ట్‌ మెనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, ట్రాన్స్‌ఫర్‌మెషన్‌ కన్సల్టింగ్, స్ట్రాటజిక్‌ స్టడీస్, ఫ్రాడ్‌ ఎనాలసిస్, డాటా ఎనాలటిక్స్‌...ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. రకరకాల జర్నల్స్‌ చదివి వాటి గురించి చర్చించుకునేవారు. రిసెర్చ్‌ ఐడియాలను రాసుకునేవారు. ఈ క్రమంలోనే సొంతంగా రిసెర్చ్‌ పేపర్స్‌ రాయడం నేర్చుకున్నారు. ఫరీదాబాద్‌(హరియాణా)లోని ‘మానవ్‌ రచన ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలో’ ఇంజనీరింగ్‌ పూర్తికాకముందే బ్రెయిన్‌–కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్, ఎయిర్‌ ప్యూరిఫైయర్, ఆల్‌–ఇన్‌–వన్‌ మెడికల్‌ అసిస్టెన్స్‌...ఇలా ఎనిమిది అంశాలలో పేటెంట్‌ పొందారు.

‘క్రికెట్‌ మానేసినప్పుడు మొదట్లో చాలా బాధ అనిపించింది. అయితే కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడంలో క్రికెట్‌లో కంటే ఎక్కువ సంతోషం దొరికింది’ అంటాడు యువరాజ్‌. రకరకాల  బహుమతులు, గ్రాంట్స్, ఫెలోషిప్స్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ‘పెటోనిక్‌ ఇన్ఫోటెక్‌’ అనే కన్సల్టెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇది టెక్నాలజీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్‌...మొదలైన రంగాలలో కన్సల్టింగ్‌ సర్వీస్‌ను అందిస్తుంది. పేరు పొందిన కంపెనీలు కూడా వీరి క్లయింట్స్‌ జాబితాలో ఉన్నాయి.

కోవిడ్‌ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఇలాంటి క్లిష్ల సమయంలోనూ ‘పెటోనిక్‌ ఇన్ఫోటెక్‌’ దెబ్బతినలేదు. ‘ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్‌ మా ముందు ఎన్నో సవాళ్లను పెట్టింది. ఎన్నో ద్వారాలు తెరవడానికి కారణం అయింది. మునపటి కంటే ఎక్కువ శక్తితో పనిచేశాం. ప్రతి చాలెంజ్‌ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగలిగాము’ అంటాడు యశ్‌రాజ్‌ భరద్వాజ్‌.‘హుందాతనం నిండిన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాం. చదువే మన ఆస్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు నాన్న’ అంటాడు యువరాజ్‌ భరద్వాజ్‌. ఈ ఇద్దరిని ఒకేసారి చూస్తే ‘ఎవరు యశ్‌రాజ్‌?’ ‘ఎవరు యువరాజ్‌?’ అని వెంటనే పోల్చుకోవడం కష్టం కావచ్చుగానీ ‘ఎవరికి వారు సాటి’ అని మెచ్చుకోవడంలో ఎలాంటి అయోమయానికి తావు లేదు.        

మరిన్ని వార్తలు