యోగా చేస్తున్నారా? అయితే ఇలా మాత్రం అస్సలు వద్దు

7 May, 2021 09:18 IST|Sakshi

జీవన గమనాన్ని మార్చే దివ్య ఔషధం యోగా

ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాల్ని వేయాలంటున్న నిపుణులు

ఎలా పడితే అలా యోగాసనాలు చేయోద్దని సలహా

మానవ జీవన గమనాన్ని మార్చే దివ్య ఔషధం యోగా.. దీన్ని సరైన నియమ నిబంధనలతో ఆచరిస్తేనే శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉండగలం. మనలో చాలామంది యోగాసనాలను ఎలా పడితే అలా వేస్తుంటారు. ఇలా చేయడం వలన సత్ఫలితాలు రాకపోగా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఆసనాలు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చు. యోగా చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పరిశీలిద్దాం..

తినగానే చేయొద్దు..
యోగాసనాలు వేసే ముందు ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఈ విషయంలో చాలామందిలో సరైన అవగాహన లేకపోవడం వలన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. నిపుణుల సలహా ప్రకారం ఏదైనా తిన్న రెండు గంటలలోపు యోగా చేయడం మంచిది కాదు. అలాగే ఆహరం అంటే సుష్టుగా భోంచేయడం కాదు. మరోమాట, అసలు తినవద్దు అన్నారని ఉపవాసం చేసి యోగా చేయడం కూడా మంచిది కాదు. ఆసనాలు వేసే ముందు ఖాళీ కడుపు ఉండకుండా తక్కువ పరిమాణంలో తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. కడుపు నిండా ఆహరం తీసుకుని యోగాసనాలు వేయడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అలాగే తాగే నీటి విషయంలోను అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసనాలు వేసే గంట ముందు చిన్న గ్లాసు నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. యోగా చేస్తున్న సమయంలో బాగా దాహం వేస్తే మధ్యలో గుక్కెడు నీరు తీసుకోవచ్చు. 

అలా ఆరంభించాలి..
యోగాసనాలను నేరుగా మొదలుపెట్టకూడదు. మొదట ప్రాణాయామం, శ్వాస క్రియలు ఆచరించిన తర్వాతే ఆసనాలు వేయడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వలన అలుపు లేకుండా ఆసనాలను ఎక్కువ సమయం వేయవచ్చు. దీంతో ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు వస్తాయి. ప్రాణాయామంలో భాగంగా శ్వాసపై ధ్యాస పెట్టడం వలన మానసికంగా ఉత్తేజం పొందవచ్చు. పై నియమాలు పాటిస్తూ క్రమపద్ధతిలో యోగా ఆచరిస్తే..  శారీరకంగా , మానసికంగా  ధృడంగా మారవచ్చు.

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి పెరుగుతాయి.ఆత్మవిశ్వాసం, స్వీయక్రమశిక్షణ వంటి సులక్షణాలు అలవడతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు,టైప్‌ 2 మధుమేహం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. శ్వాసకోశ, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. కీళ్ళ నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్, మెడ , వెన్నునొప్పుల వంటి సమస్యల నుంచి విముక్తి. ఎముకలు ధృడంగా మారతాయి. సైనస్, అలర్జీ వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి.  యోగాసనాలు శరీరంలోని హర్మోన్లను నియంత్రించడంలో ఎంతగానో సహయ పడతాయి. నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు మాయమవుతాయి.

 గ్యాడ్జెట్స్‌ పక్కన పెట్టండి..
యోగా చేసే సమయంలో సెల్‌ఫోన్, ఐపాడ్, టీవి వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. వీటి వలన ఏకాగ్రత దెబ్బతిని ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోగా దీని ప్రభావం మీ దినచర్యలోని ఇతర పనులపై పడే ప్రమాదం ఉంది.

ప్రశాంతతే కీలకం..
యోగాను ఎక్కడపడితే అక్కడ చేయకూడదు. దీనికంటూ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిశ్శబ్ధమైన ప్రదేశంలో ఎటువంటి ఆదరాబాదరా లేకుండా ప్రశాంతమైన మనస్సుతో యోగాభ్యాసం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.యోగా ముగిసిన అనంతరం శవాసనం వేయడం మరవకూడదు. 

అనారోగ్యంగా ఉన్నప్పుడు దూరం..
దగ్గు, జ్వరం, నీరసం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు యోగాసనాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో యోగాసనాలు వేయడం వలన మొదటికే మోసం రావచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు