యోగా సాధనతో సుఖ ప్రసవం

21 Jun, 2021 10:06 IST|Sakshi

ప్రెగ్నెన్సీ యోగాతో గర్భిణులకు ఎంతో మేలు 

ఇటు ఆరోగ్య పరిరక్షణ.. అలాగే నార్మల్‌ డెలివరీ 

డాక్టర్ల సలహాతో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి 

ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు అనిత అత్యాల 

సాక్షి, హైదరాబాద్‌: యోగా అంటే మంచి ఆరోగ్యం కోసం, శరీర సౌష్టవం కాపాడుకునేందుకు చేస్తారనే చాలామందికి తెలుసు. అలాగే యోగా వత్తిడిని తగ్గిస్తుందనీ అంటారు. కరోనా నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రెగ్నెన్సీ యోగాతో గర్భిణులకు చాలా మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉండటంతో పాటు సిజేరియన్‌ బాధ లేకుండా సహజమైన సుఖ ప్రసవం జరిగే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు అనిత అత్యాల. ఆరోగ్యవంతమైన బిడ్డ జననానికి ఈ ప్రత్యేక ప్రెగ్నెన్సీ యోగా దోహదపడుతుందని అంటున్నారు. అయితే డాక్టర్ల సలహాతో నిపుణుల వద్దే యోగా సాధన చేయాలని సూచిస్తున్న అనిత అత్యాలతో.. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..  

ఆరోగ్యానికి అనుగుణంగా ఆసనాలు 
గర్భిణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన (మోడిఫై చేసిన) ఆసనాలు, ప్రాణయామాన్నే ప్రెగ్నెన్సీ యోగా అని చెప్పవచ్చు. వీరికి చాప (మ్యాట్‌)తో పాటు కుర్చీ, బోలస్టర్‌ సహాయంతో వారి ఆరోగ్యానికి అనుగుణంగా ప్రత్యేక తరగతులు ఉంటాయి. 

అపోహతో అనర్థం 
గర్భం దాల్చిన తర్వాత ఏ పనీ చేయకూడదు.. విశ్రాంతిగా ఉండాలి అనే ఒక విధమైన అపోహతో సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల సహజ ప్రసవాలు చాలా తగ్గిపోయాయి. కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇందుకు కారణం శరీరాన్ని కొన్ని భంగిమలలో మాత్రమే ఉంచటం ద్వారా కండరాల పటుత్వం పెరగకపోవటం, బిడ్డ ఎదుగుదలకు అనువుగా మార్పులు చెందకపోవడం. దీంతో అనేక సమస్యలు ఏర్పడి ప్రసవ సమయంలో ఆపరేషన్‌ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల గర్భిణులు ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, యోగా సాధన చేసినట్లయితే సిజేరియన్‌ బాధలేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి. బిడ్డ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 

హార్మోన్లను సమతుల్య పరుస్తుంది  
గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోనల్‌ మార్పులు కూడా సంభవిస్తుంటాయి. వాటి మధ్య అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో యోగాసనాలు గర్భిణీకి చాలా ఉపయోగపడతాయి. అలాగే తలతిప్పడం, మలబద్దకం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మహిళలు తరచుగా ఆందోళన ఒత్తిడి, కోపం, మూడ్‌ స్వింగ్‌కు గురవుతుంటారు. అనులోమ, విలోమ, భ్రమరి, ప్రాణాయామాలు ఒత్తిడి ఆందోళనలను తగ్గించేందుకు సహాయపడతాయి. దీని ద్వారా శిశువుకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. గర్భం దాల్చిన తర్వాత యోగా సాధన చేయడం వల్ల గర్భిణులకు మంచి ఉపశమనం లభిస్తుందని మిచిగన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 

ముందస్తు ప్రసవం తప్పించుకోవచ్చు 
గర్భిణులు ఆరోగ్యంగా ఉండటానికి సురక్షితమైన, సున్నితమైన మార్గంగా యోగా నిర్ధారించబడింది. 2012 లోనే జర్నల్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ అండ్‌ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రెనటల్‌ యోగా (స్ట్రెచింగ్, శ్వాస సంబంధిత)ను సాధన చేయడం ద్వారా శిశువు బరువు మెరుగవుతుందని, ముందస్తు ప్రసవ ప్రమాదం తగ్గుతుందని తేలింది. ఇక ఈ సమయంలో వెన్నునొప్పి, వికారం, నిద్రలేమి, తలనొప్పి, మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ప్రెనటల్‌ యోగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రెనటల్‌ యోగా ఆసనాలను అభ్యసిస్తున్నప్పుడు తల్లి శరీర కండరాలు, రక్తప్రసరణ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. యోగా సాధనతో తల్లితో పాటు శిశువుకు సులువుగా ఆక్సిజన్‌ అందుతుంది. గర్భిణీ స్త్రీ శరీర కండరాలు, లిగ్మెంట్స్‌ సాగదీయడానికి ఈ యోగా సహాయపడుతుంది.  

గర్భిణులకు మేలు చేసే ముఖ్యాసనాలు 
1. వీరభద్రాసన 
2.  బద్ధ కోణాసన 
3.  తాడాసన 
4.  కటి చక్రాసన 
5.  ఊర్ధ్వ వజ్రాసన 
6.  మార్జారి ఆసన 
7.  త్రికోణాసన 
8.  పశ్చిమోత్తాసన  

మరిన్ని వార్తలు