AGWA: నీ జీవితానికి నువ్వే కథానాయిక

7 Jul, 2022 00:54 IST|Sakshi

జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మరోసారి పొరపాట్లు చేయకుండా సమస్యల సుడిగుండాల్ని అధిగమిస్తుంటారు చాలామంది. శుభాపాండియన్‌ కూడా సమస్యల నుంచి బయట పడేందుకు చాలానే కష్టపడింది. తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను మరికొందరి జీవితాలకు అన్వయించి వారి జీవితాలను సుఖమయం చేస్తోంది. తనతోపాటు వేలమంది మహిళలను చేర్చుకుని ఎంతో మందికి చేయూతనిస్తోంది.

మధురైలో పుట్టిపెరిగిన శుభా పాండియన్‌ పెళ్లయ్యాక చెన్నై వచ్చింది. బీకామ్‌ చదివిన శుభా చెన్నై నగరంలో ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది. ఇంగ్లిష్‌ రాదు. ఎటువంటి ఉద్యోగానుభవం లేదు. కానీ ఎలాగైనా ఎదగాలన్న తపన ఉంది. చెన్నై వచ్చిన ఏడాదిలోపే భర్త మరణం శుభాను రోడ్డున పడేసింది. పసిగుడ్డును పోషించుకునే భారం తనమీదే పడడంతో కష్టం మీద చిన్న ఉద్యోగం వెతుక్కుంది. ఒంటరి తల్లిగా అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటోన్న శుభాకు తోటి మహిళా ఉద్యోగులు అండగా నిలబడి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో కార్పొరేట్‌ సెక్టార్‌లో తనకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకుని ఉద్యోగిగా నిలదొక్కుకుంది.

ఆగ్వా...
అనేక సమస్యలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న శుభకు తోటి మహిళలు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రేరణ  ఇచ్చింది. ఈ ప్రేరణతోనే తనలాగా ఒంటరిగా బాధపడుతోన్న ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చేందుకు కొంతమంది మహిళల సాయంతో 2008లో ‘ఆగ్వా’ పేరిట నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. సాయంకోసం ఎదురు చూస్తున్న వారికి సాయమందిస్తూ, వారిని మానసికంగా దృఢపరిచి, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఇప్పించి నిస్సహాయ మహిళలకు అండగా నిలబడింది.

గృహహింసా బాధితులను ఆదుకోవడం, ‘క్యాంపస్‌ టు కార్పొరేట్‌’ పేరిట ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించేందుకు మెళకువలు నేర్పించడం, అల్పాదాయ మహిళలను ఒకచోటకు చేర్చి వారితో చిన్నచిన్న వ్యాపారాలు చేయించడం, కుట్టుమిషన్లు, వెట్‌గ్రైండర్స్‌ ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడడం, కంప్యూటర్‌ స్కిల్స్‌ నేర్పించడం, టైలరింగ్, పేపర్‌ బ్యాగ్‌ల తయారీ వంటి వాటిద్వారా ఆగ్వా ప్రారంభించిన ఐదేళ్లల్లో్లనే ఎనిమిదివేలకుపైగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చేయూతనిచ్చింది. కేవలం పన్నెండు మందితో ప్రారంభమైన ఆగ్వా క్రమంగా పెరుగుతూ నేడు తొమ్మిదివేల మందికి పైగా మహిళలతో పెద్దనెట్‌వర్క్‌గా విస్తరించింది.  

మహిళాసాధికారత.. గిఫ్టింగ్‌ స్మైల్స్‌
ఆగ్వా నెట్‌వర్క్‌ 2016 నుంచి ఇప్పటిదాకా కష్టాలలో ఉన్న మహిళలకు మానసిక బలాన్నిచ్చి వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు 31 కాన్ఫరెన్స్‌లు, 270 ఉచిత వెబినార్‌లు నిర్వహించి ఇరవై ఏడు వేలమంది మహిళలకు పరోక్షంగా దారి చూపింది. ఇవేగాక ఫుడ్‌ బ్యాంక్‌లకు ఆహారం అందించడం, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల ఆటవస్తువులు, పుస్తకాలు, స్వీట్లు, కలర్‌ బాక్స్‌లు, షూస్, విరాళాలు సేకరించి చెన్నై వ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలకు అందించింది. ప్రారంభంలో మహిళాభ్యున్నతికోసం ఏర్పాటైన ఈ నెట్‌వర్క్‌ నేడు దేశవ్యాప్తంగా ఉన్న వందలమంది వలంటీర్‌లు, సామాజిక వేత్తలతో కలసి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 
కెరీర్‌లో ఎదుగుతూనే...

శుభా తన కెరీర్‌లో ఎదుగుతూనే ఆగ్వాను సమర్థంగా నడిపించడం విశేషం. బహుళ జాతి కంపెనీలైన.. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్‌ఎస్, డియా సెల్యూలార్‌ వంటి పెద్ద కంపెనీలలో ఉన్నతస్థాయి పదవుల్లో పనిచేసింది. ఈ అనుభవంతో మరింత మందిని కార్పొరేట్‌ కెరీర్‌లో ఎదిగేందుకు ప్రొఫెషనల్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించి, ఎంతో మందిని కార్పొరేట్‌ వృత్తినిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో మహిళలేగాక,  దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఉండడం విశేషం.
 
 ఏదైనా సాధించగలవు
ఈ ప్రకృతిలో నీటికి చాలా శక్తి ఉంది. మహిళ కూడా నీరులాంటిది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుని తన శక్తిని పుంజుకుంటుంది. అందుకే స్పానిష్‌ పదం ఆగ్వా అనే పేరును నా నెట్‌వర్క్‌కి పెట్టాను. మా నెట్‌ వర్క్‌లో 25 నుంచి 73 ఏళ్ల వయసు మహిళలంతా కలిసి పనిచేస్తున్నాం. వివిధ వృత్తి వ్యాపారాల్లో రాణిస్తోన్న వీరంతా నెట్‌వర్క్‌లో పనిచేస్తూ ఎంతో మందికి సాయం అదిస్తున్నారు. ఆగ్వా ఉమెన్‌ ఫౌండేషన్, అగ్వా ఉమెన్‌ లీడర్‌ షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా మా నెట్‌వర్క్‌ను విస్తరించాం. మనకుంది ఒకటే జీవితం. దానిని పూర్తిగా జీవించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది అనవసరం. నీ కథను నువ్వే రాసుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ జీవితానికి నువ్వే హీరోయి¯Œ  వని ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడే ఏదైనా సాధించగలవు.

– శుభా పాండియన్‌

మరిన్ని వార్తలు