ఆగు! జవాబు చెప్పి ముందుకు కదులు!!!

27 Mar, 2023 06:00 IST|Sakshi

ఏదయినా ఒక ముఖ్యమైన పని చేద్దామనుకున్నప్పుడు మనలోంచి అనేక భావాలు ఒక్కసారి బయటికి వస్తాయి. ఎలా అంటే...మండుతున్న కట్టెను నేలకేసి కొడితే చెలరేగే నిప్పురవ్వల్లాగా అవి లేస్తాయి. అప్పుడు మనలో ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ మీలో ఉన్న మిమ్మల్ని ఐదు ప్రశ్నలతో  నిలదీస్తుందనీ, వాటిలో ఏది మీరు ఎంచుకుంటారో దాన్ని బట్టి మీ స్వభావాన్ని సమాజం అంచనా కడుతుంది. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం కూడా తన స్వీయరచన ‘ఇండామిటబుల్‌ స్పిరిట్‌’లో ఇదే చెప్పారు.

మీరేదయినా పని సంకల్పించుకుని దాని అమలుపై మీమాంసలో ఉన్నప్పుడు మొదట మీలోని పిరికితనం ఒక ప్రశ్న వేస్తుంది..ఇది నీకు ప్రమాదకరం కాదు కదా! అని... అంటే ‘నాకు ఏ ఇబ్బందీ లేదు, నా క్షేమానికి భంగపాటు కలగదు’ అని జవాబు ఇచ్చుకుని ముందుకు సాగారనుకోండి. ఎప్పుడూ తన క్షేమం గురించే చూసుకొనేవాడు...ఇతరుల క్షేమం గురించి పట్టించుకోడని సమాజం అర్థం చేసుకుంటుంది.

మీలో ఉన్న దురాశ మిమ్మల్ని ఆపి ‘ఈ పని చేస్తే మనకేమిటి లాభం? మనకేమయినా మిగులుతుందా?’ అంటుంది. ‘నాకు బాగా కలిసొస్తుంది. బాగా వెనకేసుకోవచ్చు కూడా’ అని జవాబిచ్చారనుకోండి. ఇంత ఆశబోతు, ప్రతిదానికీ నాకేమిటని చూసుకునేవాడివల్ల నలుగురికీ ఉపయోగం లేకపోయినా వీడితో జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది సమాజం.
వెంటనే గర్వం మీ దారికి అడ్డు తగిలి ‘క్షేమం, లాభంసంగతి దేముడెరుగు. కనీసం నీకు పేరయినా వస్తుందా.. నిన్ను గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారా?’ అని అడుగుతుంది. ఎంతసేపూ పేరుకోసం ఆరాటపడతాడు తప్ప మిగిలినవి పట్టించుకోడు... అని సమాజం అనుకుని మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

దాటుకుని పోబోతున్న మీకు మీ ఆకాంక్ష అడ్డుతగులుతుంది. ‘‘అవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. కనీసం సుఖపడతావా.. నీ శరీరానికికానీ, మనసుకు కానీ సుఖం లభిస్తుందా?’ అంటుంది. ‘తనవరకు సుఖంగా ఉంటేచాలనుకుంటాడు.. మిగతావారు ఎటుబోయినా నాకేమిటి అనుకుంటాడు.’ అనుకుని ఇరుగూ పొరుగూ కూడా ఎవరూ దగ్గరకు రానీయరు.

చివరగా తనవంతుకోసం వేచి చూస్తూ ఉన్న అంతరాత్మ అప్పుడు కాస్తగట్టిగానే అడుగుతుంది ‘‘నీవు చేస్తున్న పని సరైనదేనా,  ధర్మమేనా..ఆలోచించు’’ అంటుంది. ‘ఎందుకు ఆ పని చేస్తావు, తప్పుకదా, నీకు నాలుగు డబ్బులు మిగలొచ్చు, నీకు సుఖమివ్వవచ్చు, పేరు కూడా రావచ్చేమో.. కానీ దానివల్ల ఎంతమందికి నష్టం, ఎందరికి కడుపుకోత..? ఆలోచించు, తొందరపడకు’ అని పదేపదే హెచ్చరిస్తుంది.

నీవు జీవితంలో ఎవ్వరికీ జవాబుదారీ కాకపోవచ్చు. కానీ నీ అంతరాత్మను దాటుకుని, దాని మాటలు ఖాతరు చేయకుండా పోయిననాడు... అపరాధభావంతో నలుగురిలో ఉన్నా ఒంటరివైపోతావు...అది ఎప్పుడూ శాపమే. అంతరాత్మ ప్రబోధం విని నడుచుకున్న నాడు, నీవు ముందుంటావు, సమాజం నీ వెనుక నడుస్తుంటుంది, నిన్ను అనుసరిస్తూ, నీకు బాసటగా కూడా.

మరిన్ని వార్తలు