ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!

30 Oct, 2021 10:13 IST|Sakshi

ఆరోగ్యంగా, చురుగ్గా... యవ్వనంగా కనిపించాలంటే బరువు సమానంగా ఉండాలి. అధిక బరువు వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం అవసరం. బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్‌ అంటారు. వీటిలో సైక్లింగ్, జాగింగ్‌  సులువైనవి. ఇప్పుడు జాగింగ్‌ గురించి చెప్పుకుందాం. 

ప్రతి రోజూ ఉదయం జాగింగ్‌ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో చూద్దాం... 
జాగింగ్‌ చేయడానికి జిమ్‌లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్‌ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా మెరుగుపడుతాయి.

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్‌ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. శారీరకంగా ఫిట్‌గా, క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్‌గా కనబడేందుకు దోహదం చేసే వాటిలో జాగింగ్‌ మెరుగైనది.  ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

బ్లడ్‌గ్లూకోజ్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.  జాగింగ్‌ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్‌ అనే హార్మోన్స్‌ విడుదల అవుతాయి. ఈ గ్రూప్‌ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్‌ గుడ్‌  హార్మోన్స్‌ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ముఖం తేటగా కనిపిస్తుంది.  

ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
►జాగింగ్‌ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్‌ మారి చూడటానికి అందంగా మారుతారు.
►బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్‌ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. 
►ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్‌ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
►శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్‌ మంచి మార్గం.
►జాగింగ్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్‌ తో పోరాడే శక్తి అధికంగా ఉండి  శారీరక శక్తిని పెంచుతుంది.


►తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి.
►కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్‌ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. పాజిటివ్‌ శక్తి వస్తుంది.
►చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు. అయితే కేవలం జాగింగ్‌ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలూ శరీరానికి సమకూరతాయి. 

చదవండి: ఈ విటమిన్‌ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..

మరిన్ని వార్తలు