మీ బద్ధకం అమ్మకు భారమే

15 Dec, 2023 01:28 IST|Sakshi

చలికాలం

చలికాలం ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుణ్ణు. బెడ్‌ దగ్గరకు పొగలు గక్కే టీ వస్తే ఎంత బాగుణ్ణు. టిఫిన్లూ, సూప్‌లు, సాయంత్రం ఉడకబెట్టిన పల్లీలు... ఎంత బాగుణ్ణు. అన్నట్టు రగ్గులు, బొంతలు భలే శుభ్రంగా, పొడిగా ఉండాలండోయ్‌. చలికాలం ఎవరికీ పని చేయబుద్ధేయని కాలం. కాని అమ్మకు తప్పుతుందా? అమ్మ వెచ్చని రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ ‘టీ తెండి’ అని అరిస్తే ఒకరోజైనా ఇస్తారా ఎవరైనా? చలికాలంలో ఇంటి సభ్యులు ఏం చేయాలి?

స్కూల్‌ టైమ్‌ మారదు. ఉదయం 8 లోపు బస్సొచ్చి ఆగుతుంది. పిల్లలకు బాక్స్‌ కట్టివ్వడమూ తప్పదు. ఏడున్నరకంతా కట్టాల్సిందే. టిఫిన్‌ తినిపించాల్సిందే. ఎంత చలి ఉన్నా, ఎంత మంచు కమ్ముకున్నా, ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత ముసుగుతన్ని నిద్రపోవాలని ఉన్నా అమ్మకు తప్పుతుందా? అమ్మ లేవకుండా ఉంటుందా? వంట గదిలో వెళ్లకుండా ఉంటుందా? నాన్న అరగంట లేటుగా లేవొచ్చు. వాకింగ్‌ ఎగ్గొట్టి అమ్మ ఇచ్చిన టీని చప్పరిస్తూ పేపర్‌ను చదువుతూ ఉండొచ్చు. కాని అమ్మ మాత్రం అదే వంట చేయాల్సిందే. రోజువారీ అంట్లు, బట్టల ఉతుకుడు చూడాల్సిందే. ఆమెకు ఇంట్లో నుంచి ఎలాంటి సాయం అందుతున్నదో ఆలోచించామా ఎప్పుడైనా?

బద్ధ్దకమైన కాలం ఇది
చలికాలం బద్ధకం కాలం. తలుపులు కిటికీలు మూసుకుని అరచేతులు రుద్దుకుంటూ కూచోమని చెప్పే కాలం. బబ్బుంటే బాగుండు అనిపించే కాలం. అమ్మకు ‘ఈ పూట ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు’ అనిపించినా అలా చేసేవారు ఎవరు? ‘రోజూ వండుతున్నావ్‌ కదా ఇవాళ బజారు నుంచి వేడి ఇడ్లీ తెస్తానులే’ అని బండి తాళం అందుకునే నాన్నలు ఎందరు? పాలల్లో కొన్ని చాకోస్‌ వేసివ్వు చాలు అనే పిల్లలు, బ్రెడ్‌ ఆమ్లేట్‌ చేసుకుని తింటాలే అనే భర్తలు ఉన్న ఇల్లు ఇల్లాలి శ్రమను గుర్తించే ఇల్లు.

‘కాసేపు పడుకోలే’ అని లేచి పేపర్లు లోపల పడేసి, పాలు ఫ్రిజ్‌లో పెట్టి, ఒక ప్యాకెట్‌ గిన్నెలో వేడి చేసి, కాఫీ కలిపి భార్యను లేపితే ఎంత బాగుంటుంది. మగవాళ్లు బట్టలు ఎలాగూ ఉతకరు. ‘చెమ్మగా ఉన్నాయి’ అని విసుక్కునే బదులు కనీసం ఎండ తగిలే తీగ దాకానో, డాబా మీదనో తీసుకెళ్లి ఆరేసే సాయం చేయరు.

ఇలాంటి సమయంలో ‘బట్టలు ఆరేయడం’ అనే చిన్న పని కూడా చాలా పెద్ద సాయం కిందకు వస్తుంది.ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్‌స్టంట్‌ టిఫిన్లు ఎన్నో మార్కెట్‌లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి అమ్మకు ఏ విధంగా ఉపశమనం ఇవ్వొచ్చో తప్పక ఆలోచించాలి.

ఇంట్లో పెద్దవారు ఉంటే?
అమ్మమ్మో, నానమ్మో ఇంట్లో ఉంటే వారి గురించి ఇల్లంతా మరింత శ్రద్ధ పెట్టాలి. మంచి షాల్, రగ్గు వారికి ఏర్పాటు చేయాలి. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు ఇవ్వాలి. స్లిప్పర్లలోనే తిరగమని చెప్పాలి. చలికి ఆకలి ఎక్కువ. పెద్దవారు పసిపిల్లల్లా మారి నోటికి హితంగా వేడివేడిగా అడుగుతారు. వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ పనిలో కూడా అమ్మకు భర్త, పిల్లలు ఏదో ఒక మేరకు సాయం చేయాలి. వారికి వెచ్చని గది కేటాయించాలి. లేదా ఇంట్లోని వెచ్చని ప్రదేశమైనా.

శుభ్రత అందరిదీ
శీతాకాలం ఇల్లు మబ్బుగా ఉంటుంది. ఇటు పుల్ల అటు పెట్టబుద్ధి కాదు. కాని ప్రయత్నం చేసి ఇల్లు ప్రతి రోజూ సర్దుకునే పడుకోవాలి. హాల్లో బెడ్‌రూముల్లో కిచెన్‌లో కుటుంబ సభ్యులంతా నిద్రకు ముందు వీలైనంత శుభ్రంగా, సర్ది పడుకుంటే ఉదయాన్నే అమ్మ లేచినప్పుడు చిందర వందర లేకుండా పనిలో పడబుద్ధి అవుతుంది. పక్క బట్టలు మడవడం కూడా కొంతమంది చేయరు. అలాంటి వారిని తప్పక గాడిలో పెట్టాలి. చలికాలం అమ్మకి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్‌ చేసేలా చూద్దాం.

అమ్మకు కావాలి వెచ్చని దుస్తులు
సాధారణంగా ఇళ్లల్లో నాన్నకు హాఫ్‌ స్వెటర్లు ఉంటాయి. ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అమ్మకు మాత్రం ఎందుకనో స్వెటర్‌ ఉండదు. కొని తేవాలని ఎవరికీ అనిపించదు. చాలా ఇళ్లల్లో అమ్మలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. ఒక రంగురంగుల కొత్త స్వెటర్‌ కొనుక్కోవాలని వారికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తాను కొనుక్కునే చొరవకు ఎప్పుడూ అమ్మ దూరంగానే ఉంటుంది. స్వెటర్‌ లేకుండానే చలికాలం గడిపేస్తుంది. ఆమెకు స్వెటర్, సాక్సులు, స్కార్ఫ్‌లు కావాలి.

ఉన్నాయా గమనించండి. ఆమె అడగదు. తెచ్చి పెట్టండి. శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... ఏర్పాటు చేయాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధ పడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. తీసుకువెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే  చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి.

 

>
మరిన్ని వార్తలు