గురువాణి: యువత భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలి

2 Jan, 2023 04:28 IST|Sakshi

మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

మహాభారతం పంచమవేదంగా చెప్పబడుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని సారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భగవద్గీత చదివి సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్లాలి. గీతాసారాన్ని తెలుసుకుంటే మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు తిరుగులేని కచ్చితత్వంతో ఉంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే సారం గీతలో ఉంది.

దత్తాత్రేయుడిగా గురువు అవతారమెత్తిన మహావిష్ణువు కృతయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మానవాళికి మార్గదర్శకులయ్యారు. వీరి అవతారాలకు భారతదేశం వేదిక కావడం అదృష్టం. దీంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎనలేని విజ్ఞానాన్ని అందించినట్లైంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటూ వస్తోంది. ఇతర దేశాలతో ప్రేమపూర్వకంగా ఉంటూ వస్తున్న భారతదేశ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలి. దీంతో యువతలో సానుకూల దృక్పథం కలుగుతుంది. అనేక దేశాల అభివృద్ధిలో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్న భారత యువత అక్కడ భారత సంస్కృతి, సాంప్రదాయాల గురించి గర్వంగా చెప్పుకోవాలి.

అదేవిధంగా ప్రకృతి, పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. దీంతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. పరమాత్మను పరిపూర్ణంగా శరణు వేడడమే అన్నింటికీ పరిష్కార మార్గం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. భాగవతంలో  శ్రీకృష్ణుడి అవతారం ్ర΄ారంభం నుంచి ముగింపు వరకు ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా కష్టాలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపించిన పరమాత్మ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడో భాగవతం చదివితే తెలుస్తుంది. చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం గురించి తెలుసుకుంటే యువత తిరుగులేని సానుకూల దృక్పధాన్ని సాధిస్తుంది.

– తూమాటి భద్రారెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

మరిన్ని వార్తలు