మోస్ట్‌  ఎలిజిబుల్‌  క్రియేటర్స్‌ 

27 Apr, 2022 02:46 IST|Sakshi

తాజా సినిమా ‘కేజీఎఫ్‌’లో విలన్‌ నోటి నుంచి వచ్చిన చిన్న డైలాగుకు పెద్ద రెస్పాన్స్‌ వచ్చింది. ఆ డైలాగ్‌ ఇలా ఉంటుంది...
‘ఎర వెంట పరుగెడుతూ చేప దాన్ని వేటాడుతున్నాను అనుకుంటుంది.
గాలానికి చిక్కిన తరువాత గానీ 
తెలియదు తానే వేటాడబడ్డానని!’
డైలాగ్‌ నుంచి డప్పు సౌండ్‌ వరకు ‘ఆహా’ అనిపిస్తే, చప్పట్లు కొట్టిస్తే అదే క్రియేటివిటి. ఇప్పుడు యూత్‌కి ఇది పెట్టుబడి. తమను తాము మెరుగు పర్చుకొని ఎప్పటికప్పుడూ 
కొత్త పాఠాలు నేర్చుకునే బడి....

టిక్‌.. టాక్‌ నిషేధం తరువాత యూట్యూబ్‌ ‘షార్ట్స్‌’ ఊపందుకున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం కలిగించడానికి యూట్యూబ్‌ ‘షార్ట్స్‌ ఫండ్‌’ ప్రకటించింది. ‘భలే ఛాన్సు’ అనుకుంది యువతరం. అయితే ఆ ఛాన్సు ఊరకే చేతికి చిక్కదు. బరిలో ఉన్న పదిమంది కంటే ముందుండాలి. డబ్బుల సంగతి పక్కన పెడితే, ఇలాంటి ప్రోత్సాహక ఫండ్స్‌ ద్వారా రకరకాలుగా తమలోని సృజనకు పదును పెట్టుకునే అవకాశం యువతరానికి వచ్చింది. ‘2021– 2022 షార్ట్‌ఫండ్స్‌’ ద్వారా ఎలిజిబుల్‌ క్రియేటర్స్‌కు రివార్డ్‌లు ఇస్తుంది యూట్యూబ్‌. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ప్లే బోనస్‌ ప్రొగ్రాం, స్నాప్‌చాట్‌ ‘స్పాట్‌లైట్‌ చాలెంజ్‌’ ద్వారా క్రియేటర్స్‌కు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నాయి.


‘సుత్తి వద్దు సూటిగా చెప్పు’ అనేది 15 నుంచి 60 సెకండ్ల ఈ వీడియోల ప్రధాన లక్షణం. ఇక్కడ కెమెరాలను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ముందు మనసును నమ్ముకోవాలి. అందులో సృజనాత్మక మథనం జరగాలి. ఏ టాపిక్‌ ఎంచుకోవాలి? చూసీ చూడగానే మళ్లీ మళ్లీ చూసేలా ఎలా చిత్రీకరించాలి... ఇలా ఎన్నో దశల తరువాత ‘షార్ట్స్‌’ తయారవుతుంది.


చిన్న వీడియో అయినా సరే, యూ ట్యూబ్‌ బిల్ట్‌–ఇన్‌–క్రియేషన్‌ టూల్స్‌ సమర్థంగా ఉపయోగించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఎడిట్‌ చేయడం, సోని, యూనివర్సల్, వార్నర్‌ లాంటి మేజర్‌ లేబుల్స్‌ నుంచి మ్యూజిక్‌ సెట్‌ చేయడం, సందర్భానికి తగినట్లు యానిమేటెడ్‌ టెక్ట్స్‌ జత చేయడం, ఫుటేజి కంట్రోల్‌... ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమకు తాముగా ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతున్నారు. సాంకేతికశక్తిని దృఢతరం చేసుకోగలుగుతున్నారు.


 తమ వీడియోను ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు చూసే ‘హుక్‌’ ఏమిటో క్రియేటర్‌కు తెలియాలి. అది ఎలా తెలియాలి?
బెస్ట్‌ యూట్యూబర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా కాకలు తీరిన విజేతల అంతరంగాలకు తమ బ్లాగ్‌లో స్థానం కల్పిస్తుంది యూట్యూబ్‌. యువతరానికి అవి ఇష్టమైన పాఠాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు లైనా. అర్జెంటీనాకు చెందిన లైనా సింగర్, సాంగ్‌ రైటర్‌. యూట్యూబ్‌లో లాటిన్‌ అమెరికా దేశాల్లో ఆమెకు అపారమైన అభిమానగణం ఉంది.

ఆమె మాటల్లో కొన్ని...
‘వీడియో మేకింగ్‌ను ముందు మనం ఎంజాయ్‌ చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయగలుగుతారు. మొదట్లో నేను తీవ్రమైన ఒత్తిడికి గురవుతుండేదాన్ని. ఆ ఫలితం వీడియోలపై కనిపించేది. ప్రేక్షకులు రకరకాల కామెంట్స్‌తో వెక్కిరించేవారు. వీడియోలలో పూర్‌–క్వాలిటీ ఉండకూడదనుకుంటే ముందు మనలో నుంచి ఒత్తిడిని పూర్తిగా బయటికి పంపించాలి’


‘మనం క్రియేటర్స్‌ అయినప్పటికీ ప్రేక్షకుల కంటే ఒక మెట్టు పైన ఉన్నాం అని ఎప్పుడూ అనుకోకూడదు. వారి మాటలను ఓపికగా వినాలి. వారి నుంచి తెలుసుకోవాలి. చివరికి వారి చేతే ప్రశంసలు పొందాలి’
‘పోటీ లేకపోతే నేనే రాజు అనుకుంటాం. బలమైన పోటీ ఉంటే ‘బంటు’ స్థానంలోకి వెళ్లి సింహాసనాన్ని చేరుకోవడానికి కష్టడతాం. ఆ క్రమంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకుంటాం’.

మరిన్ని వార్తలు