కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..

3 Nov, 2020 00:40 IST|Sakshi

పాటల కవ్వంతో  కష్టాలను చిలికిన  కోయిలమ్మ  కనకవ్వ! అన్నీ బతుకుపాటలే.  బతుకుని.. మెతుకుని ఇచ్చిన పాటలు.  పల్లె పదాలతో జీవితాన్ని పూదోట చేసుకున్న అవ్వ ఇప్పుడు..యూట్యూబ్‌ సింగర్‌! 

రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ జీవనం సాగించే కనకవ్వ తన కష్టాన్ని మర్చిపోవడానికి పాటను ఆసరా చేసుకుంది. పొద్దున లేచింది మొదలు పాటతోనే రోజు మొదలయ్యే కనకవ్వ జానపదాలు ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. జానపదాలు, బతుకమ్మ పాటలు పాడే 63 ఏళ్ల కనకవ్వ సొంతూరు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా బొడిగేపల్లి గ్రామం. వాడల్లో తిరుగుతూ పండ్లు అమ్ముకుంటూ, పొలాల్లో కూలిపనులకు వెళ్లే అవ్వ ఇప్పుడు ప్రైవేట్‌ ఆల్బమ్‌లకు పాడుతూ, అందుకు తగ్గట్టు పాదం కదుపుతూ యూ ట్యూబ్‌లో సింగర్‌ కనకవ్వగా మారింది.

‘‘నర్సాపల్లి గండిలోన గంగాధారి
ఆడినెమలి ఆటలకు గంగాధారి
మగానెమలి మోసపోయే గంగాధారి’’
      ‘‘కోలు కోలు కోలూ బతుకమ్మ పూలూ
      మా బతుకుళ్ల రంగు రంగు పూలూ..’’

‘‘గెన్నెరామ గెన్నెరామ గెన్నెరామ 
గెట్టుమీద గున్నమామిడో పిల్లడో..’’
     ‘‘గూట్లేమో కుసున్నాయి 
     గురియవన్నె పావురాలు.. 
     సక్కని కనుల వారజూడవో ఓ బాలయ్య..’ 
‘‘సమ్మక్క సారక్క వీరుల జాతర 
మన మేడారంలో
... గుండెల్లో కొలువున్న గూడెం జాతర’ 

ఎన్నో పల్లె పదాలు. శ్రమైక జీవన సౌందర్యాలు. సంసార నావను దాటించడానికి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కనకవ్వ జీవితమంతా ఈ పాటలే పూదోటగా మారి నడిపించాయి. ఇప్పుడా పాటలే ఆమెను పదిమందికి పరిచయం చేశాయి. ఆ పల్లెపాటల పందిరి కనకవ్వ మాటల్లోనే... 

‘‘పండ్ల గంప ఎత్తుకొని వాడ వాడలా తిరుగుతా అమ్ముతుండేదాన్ని. ఆ బరువు తెలియకుండా ఉండటానికి పాటలు పాడేదాన్ని. నాతోడ ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. నా చిన్నతనం అంతా మా అమ్మ పాటలల్లనే గడిచిపోయింది. అవి వింటూ, పాడుతూ పెరిగినం. బతుకమ్మల దగ్గర మా అమ్మ పాడకపోతే ఆట ఆగిపోయేది. అంత బాగ పాడేది. యాభై ఏళ్ల కిందటి మాట. ఇప్పటి లెక్కన సదువులా ఏమన్ననా.. పదేళ్ల పిల్లప్పుడే అమ్మనాయిన పెళ్లి చేసిన్రు. 

అత్తగారింట పాట
అన్నీ కష్టాలే. పదేండ్ల ఆటలన్నీ పుట్టింట్లనే వదిలిపెట్టిన. ఇరవై ఏళ్లు నిండకముందే ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టిన్రు. మా ఆయన బాలయ్య వ్యవసాయం చేసేటోడు. కానీ, ఏదీ అక్కరకు రాలేదు. ఆయన చేసిన కష్టం ఆయనకే సరిపోయేది. అదేమని అడిగితే.. పెద్ద పెద్ద గొడవలు. పిల్లలకు యేలకింత ముద్ద పెట్టాలని కూలిపనులకు పోయేదాన్ని. ఏ పనిల ఉన్న పాట మాత్రం ఆగలేదు. అదే నాకు కాస్త ఊరటినిచ్చేది. ఇల్లు ఊడుస్తా పాటనే, అన్నం వండతా పాటనే, పొలాలకు పోయినా పాటనే.

బతకడానికి ఊరూరా తిరిగా! 
ఊళ్లో బతకడం కష్టమైతుందని హైదరాబాద్‌ల ధూల్‌పేటలో పదేండ్లు ఉన్న. చిన్నపిల్లలను పెద్ద పిల్లలకు అప్పజెప్పి ఇండ్లళ్ల పనులు చేసేదాన్ని. పిల్లలను బతికించుకుంట ఒక్కో పైస దాచిపెట్టేదాన్ని. అక్కణ్ణుంచి మా తమ్ముడు గోదావరిఖనిలో ఉంటే ఆడికిబోయిన. అక్కడ పండ్లు అమ్మేదాన్ని. కూలీ పనులకు పోయిన. ఏ పని చేసినా పిల్లల గురించే బతికిన. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయినయి. వాళ్ల పిల్లలు కూడా పెద్దోళ్లు అయిన్రు. వాళ్లే ఇప్పుడు నన్ను మంచిగ సూసుకుంటున్రు. ఏడెనిమిది నెలల క్రితం నేను పాటలు పాడుతుంటే మా పిల్లలు సెల్‌ఫోన్‌ల తీసి, అవి టీవీల వాళ్లకు పెడితే, వాళ్లు రమ్మని పిలిచారు. అక్కడికెళ్లి పాడిన. దాంతో నా పాట అందరికీ తెలిసింది. 

పండ్ల గంప మూలకుపడ్డది
ఎక్కడకన్న బోతే ఆడ నన్ను చూసినోళ్లు వెంటనే గుర్తుపడతరు. ‘నువ్వు కనకవ్వవు గదూ! నీ పాటలు శాన బాగుంటయ్‌ ’అని చెబుతుంటే మస్తు సంతోషమైతది. పండ్ల గంప మూలకు పడేసిన. పాటలు పాడేటానికి బోతున్న. ఇప్పుడు మోటు కష్టం లేదు. పాటపాడితే పేరొస్తుంది. నాలుగు పైసలొస్తున్నయి. నాకు ఏ సదువూ రాదు. పాటలు రాయలేదు. ఇన్నాళ్లు నాకు మతిల ఉన్న పాటలు పాడేదాన్ని. ఇప్పుడు వేరేవాళ్లు రాసిన పాటలుగిన పాడుతున్న. రాసినోళ్లు ఒకసారి పాడి వినిపిస్తే చాలు.. ఆ పదాలు గుర్తుపెట్టుకొని పాడేస్తున్న. ఇప్పుడు నన్ను సింగర్‌ కనకవ్వ అంటున్నరు. (నవ్వుతూ) సింగర్‌ అంటే ఏందో.. కానీ, నాకు వచ్చిన పదమల్లా పాటైంది. నా సొంతం పాటలే కాకుండా మరో పది పాటల దాకా పాడిన. మంచి పేరొచ్చింది. జీవితంల బాధలు ఎన్నో వస్తాయి పోతాయి. దిగులుపడవద్దు. ఒక రోజుకు అంతా మంచే జరుగుతది. ఓపిక పట్టాల’ అంటూ జానపదాల జల్లుతో వీనులవిందు చేసింది కనకవ్వ. నాగరిక ప్రపంచం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాల్లోకి ఒదిగి తనను తాను వెతుక్కునే పనిలో ఎప్పుడూ ఉంటుంది. ఆ వెతుకులాటలో పల్లె తన కళను ఎప్పుడూ దోసిళ్ల కొద్ది నిండుగా అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లె కోయిలమ్మ కనకవ్వ రూపంలో మనల్ని అలరిస్తోంది. 
– నిర్మలారెడ్డి
ఫొటోలు: నోముల రాజేష్‌

మరిన్ని వార్తలు