Scherezade Shroff Life Story: హాయ్‌ గైస్‌...నేను మీ షెర్రీని..!! యూట్యుబ్‌ కెరీర్‌లో వినూత్నంగా..

18 Nov, 2021 11:13 IST|Sakshi

Youtuber Sherry Shroff Life Story In Telugu: ఇంట్లో అక్క, అన్నయ్యలు ఎంచుకునే ఆట వస్తువుల నుంచి వారు వేసుకునే డ్రెస్, వెళ్లే స్కూలు, కాలేజీ, జీవితంలో అతి ముఖ్యమైన కెరియర్‌ దాకా అన్నీ ఫాలో అయిపోతుంటారు చిన్నవాళ్లు. షెర్రి షరాఫ్‌ కూడా అందరిలాగే చిన్నప్పటి నుంచి తనపెద్దక్కను ఫాలో అవుతూ, ఆమె దారిలోనే ఫ్యాషన్‌ను కెరియర్‌గా ఎంచుకుంది. మధ్యలో మోడలింగ్‌కు టెక్నాలజీని జోడించి, అక్కలాగా పేరుప్రఖ్యాతులు పొందడమేగాక, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ లక్షలమంది సోషల్‌ మీడియా యూజర్లకు ప్రేరణగా నిలుస్తోంది.

షెర్‌జెదా అలియాస్‌ షెర్రి షరాఫ్‌ ముంబైలో పుట్టి పెరిగిన అమ్మాయి. ముగ్గురు సంతానంలో చిన్నది. షెర్రి వాళ్ల అక్క అనైత పాపులర్‌ ఫ్యాషన్‌ స్టైలిస్ట్, యాక్టర్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కావడంతో ఆమెలాగే ఫ్యాన్‌ ప్రపంచంలోకి రావాలనుకుని, పదహారేళ్ల వయసులోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది షెర్రీ. ఒకపక్క మోడలింగ్‌ చేస్తూనే హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసింది. తర్వాత లా పూర్తిచేసింది. అయితే మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండడం, అప్పటికే మోడల్‌గా రాణిస్తుండడంతో లా ప్రాక్టీస్‌ చేయడానికి  బదులుగా మోడలింగ్‌నే కెరియర్‌గా మార్చుకుందామె. 

Scherezade Shroff Life Story In Telugu

చదవండి: Health Benefits Of Saffron: కుం​కుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

బ్లాగర్‌ నుంచి యూట్యూబర్‌..
మోడలింగ్‌లో బిజీగా ఉన్న షెర్రి, ఏ కాస్త సమయం దొరికినా తన బ్లాగ్‌లో ఫ్యాషన్‌కు సంబంధించిన రంగాల్లో తనకు ఏం ఇష్టమో అది  షేర్‌ చేస్తుండేది. ఈ సమయంలో ఒకసారి ఓ మల్టీమీడియా ఛానల్‌ నెట్‌ వర్క్‌ వాళ్లు –మీరు మోడల్‌గా రాణిస్తూనే బ్లాగింగ్‌ చేస్తున్నారు కదా? వీడియో బ్లాగ్‌ ఎందుకు చేయకూడదు– అన్నారు. ‘అవును కదా!’ అనుకుంది షెర్రి. దీంతో ఒకపక్క మల్టీమీడియా నెట్‌వర్క్‌తో కలిపి వీడియోలు చేస్తూనే, తను కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయ్యే వీడియోలను చూస్తూ ఎలా చేయాలో నేర్చుకునేది. 

వైవిధ్యభరితమైన కంటెంట్‌తో..
వీడియో అప్‌లోడింగ్‌ గురించి తొమ్మిది నేర్చుకున్నాక,  2013లో తన పేరుమీద సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఇది ఒక లైఫ్‌ స్టైల్‌ ఛానల్‌. ‘హాయ్‌ గాయిస్‌’ అంటూ మొదలు పెట్టి... బ్యూటీ, ఫ్యాషన్, మేకప్, హెయిర్‌ ట్యూటోరియల్స్, ట్రావెల్‌ వ్లాగ్స్, దియా(డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌) టిప్స్‌ను అందించడం మొదలు పెట్టింది. ప్రారంభంలో షెర్రి వీడియోలకు అంతగా స్పందన రాలేదు. దాంతో వ్యూవర్స్‌ను ఆకట్టుకునేలా నాణ్యమైన, ఆర్గానిక్‌ కంటెంట్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టింది. దీంతో ఛానల్‌కు పాపులారిటితో పాటు వివిధ బ్రాండ్‌లు ఆమెతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. వీటిలో సెఫోరా, ఎమ్‌జీ మోటార్‌ ఇండియాలు ఉన్నాయి. షెర్రి నిజమైన పనితీరు కనబరిచే ఉత్పత్తులను మాత్రమే ప్రమోట్‌ చేసేది. దీని వల్ల తన ఛానల్‌కు ఇతర ఛానల్‌కు మధ్య తేడా స్పష్టంగా కనిపించేది. సరికొత్త కంటెంట్, పాపులర్‌ సెలబ్రెటీలతో కలిసి వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుండడంతో వ్యూవర్స్‌తో పాటు ఆదాయమూ పెరిగింది.

Youtuber Sherry Shroff Biography In Telugu

షెర్రి ఛానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య మూడు లక్షలకు పైనే. ఇన్‌స్ట్రాగామ్‌లో రెండున్నర లక్షలకుపైగా, ట్విటర్‌లో దాదాపు ముఫ్పైవేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. 2016లో తన స్నేహితుడు వైభవ్‌ తల్వార్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ట్రావెల్‌ టిప్స్‌ అందించే ‘గొట్టా డు ఇండియా’ పేరుతో ఛానెల్‌ నడుపుతున్నారు.

చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్‌ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..

మరిన్ని వార్తలు