‘రైస్‌ గమ్‌’ మీమ్‌ గుర్తుందా.. యువకుడి తలరాతను మార్చేసింది

6 Aug, 2021 07:39 IST|Sakshi

ట్రెండ్‌ ఫాలో అయ్యేవారు కొందరు. ఇది ఎంతో వీజీ. ట్రెండ్‌ సెట్‌ చేసేవారు కొందరు. ఇది  చాలా కష్టం. ఇష్టమైన పనికోసం కష్టపడితే.... ట్రెండ్‌ సెట్‌ చేయడం చిటిక వేసినంత పని అంటున్నాడు అమీర్‌. నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్లి యూట్యూబ్‌లో ‘రైస్‌ గమ్‌’ అనే మీమ్‌ను చూడండి. అది ఒక యువకుడి తలరాతను మార్చిన మీమ్‌. అమీర్‌ అనే కుర్రాడు ట్రెండ్‌సెట్టర్‌గా మారడానికి శ్రీకారం చుట్టిన మీమ్‌...

ఎవరీ అమీర్‌?
‘కెనడాలో జన్మించిన అమీర్‌ ఉస్మాన్‌ ఫ్రెంచ్‌ మాట్లాడుతూ పెరిగాడు. వాళ్ల కుటుంబం లెబనాన్‌ నుంచి కెనడాకు వలస వచ్చింది....’ ఒకప్పుడు అమీర్‌ గురించి చెప్పడానికి ఈమాత్రం సరిపోతుంది. ‘ట్రెండ్‌ సెట్టర్‌’గా యూత్‌కు ఆదర్శంగా నిలిచిన అదే అమీర్‌ గురించి చెప్పడానికి ఇప్పుడు చాలా ఉంది.
మన ఇంట్లో లేదా ఇరుగింటి, పొరుగింటి కుర్రాళ్లలాగే స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో విహరించడం అంటే అమీర్‌కు ఇష్టం. ఫస్ట్‌ పర్సన్‌ షూటర్‌ వీడియోగేమ్‌ ‘కాల్‌ ఆఫ్‌ డ్యూటీ’లాంటివి ఆడడం అంటే ఇష్టం.
ఇక ‘ఫేజ్‌ క్లాన్‌’లాంటి యూట్యూబర్స్‌ అంటే మామూలు ఇష్టం కాదు. ‘అథెంటిక్‌ అండ్‌ రిలేటబుల్‌’ వీడియోలు రూపొందిస్తుంటారు అని వేనోళ్ల పొగిడేవాడు. ఒకరోజు ఎందుకో సరాదాగా  మీమ్‌ చేయాలనిపించింది. అనుకున్నదే ఆలస్యం ‘రైస్‌గమ్‌’ అనే మీమ్‌ చేసి యూట్యూబ్‌లోకి వదిలి మరిచిపోయాడు. ‘ఇంత రెస్పాన్స్‌ వస్తుంది’ ‘అంత రెస్పాన్స్‌ వస్తుంది’ అని లెక్కలేమీ వేసుకోలేదు. మూడు రోజుల తరువాత ఈ మీమ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. వ్యూస్, నొటిఫికేషన్లతో  ఫోన్‌ బరువుగా మారింది.

కామెంట్స్‌లో ఒకచోట...
‘నేను మీ సబ్‌స్రైబర్‌ను. ఏదో ఒకరోజు  మీరు బిగ్‌ యూట్యూబర్‌ అవుతారు’ అని ఎవరో ఆశీర్వదించారు. వారి మాట నిజమైంది!‘రైస్‌గమ్‌’ మీమ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చూసిన తరువాత ‘యస్‌.నేను చేయగలను. అందరినీ ఆకట్టుకునేలా కంటెంట్‌ క్రియేట్‌ చేయగలను’ అనే నమ్మకానికి ఉత్సాహం వచ్చింది. ప్రఖ్యాత మొబైల్‌ గేమ్‌ ‘పోక్‌మన్‌’ను దృష్టిలో పెట్టుకొని క్రియేట్‌ చేసిన కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ అదిరిపోయింది. మిలియన్స్‌ ఆఫ్‌ వ్యూస్‌ వచ్చాయి. రకరకాల ఛానళ్ల వాళ్లు దీన్ని మురిపెంగా ప్రసారం చేశారు. ఒలింపిక్‌ ఆటలపై తయారుచేసిన మీమ్స్‌ కూడా అదరహో అదరహో!

తన టీ అంటే ఇష్టం. అలా తన పేరును ‘టీవాప్‌’గా, బ్రాండ్‌గా మలిచి, దాన్ని యూట్యూబ్‌ చానల్‌ చేసి  ట్రెండింగ్‌ టాపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కంటెంట్‌ క్రియేట్‌ చేయడం మొదలు పెట్టాడు. తన తమ్ముడి సహాయం కూడా తీసుకున్నాడు. ‘టీవాప్‌’ వీడియోలు ఎంత పాప్‌లర్‌ అయ్యాయి అంటే...‘యూట్యూబ్‌ వీడియోలలో ఇదొక కొత్తగాలి’ అని ప్రశంసలు అందుకున్నాయి. కంటెంట్‌ విషయం పక్కన పెడితే ఎడిటింగ్, ప్రయోగాలు చేయడంలో ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్నాయి.

‘హౌ టు ఎడిట్‌ లైక్‌ టీవాప్‌’ పేరుతో రకరకాల వీడియోలు హల్‌చల్‌ చేస్తున్న సమయంలో ‘ఆ పని మనమే ఎందుకు చేయకూడదు’ అని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన తమ్ముడు ఐమన్‌ ఉస్మాన్‌తో కలిసి రంగంలోకి దిగి ఆటోమేషన్, యానిమేషన్‌ నిపుణులతో చర్చించాడు అమీర్‌. కొత్త క్రియేటర్లకు సులువుగా ఎడిటింగ్‌లో మెలకువలు నేర్పించే చిట్కాలతో పాటు హై–క్వాలిటీ యానిమేషన్స్‌ 5 నిమిషాల్లో డౌన్‌లోడ్‌ చేసుకునే సాంకేతికజ్ఞానాన్ని రెడీ చేశాడు.

‘మీకు ఇష్టమైన పనిలో బాగా కష్టపడితే, మీకు ఉపాధి లభించడమే కాదు ఆ కష్టం మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది’ అంటున్నాడు అమీర్‌.
అక్షరసత్యం అని చెప్పడానికి అడ్డేముంది!
 

మరిన్ని వార్తలు