తొలి ‘అంతరిక్ష మానవుడు’ గగారిన్‌ మళ్లీ పుట్టాడు!

15 Mar, 2021 08:05 IST|Sakshi
తొలి ‘అంతరిక్ష మానవుడు’ యూరీ గగారిన్‌

క్వీన్‌ కాన్ఫరెన్స్‌

ఇరవై ఏడేళ్ల వయసుకు ఎవరైనా ఎంత ఎత్తుకు ఎదుగుతారు? యూరీ గగారిన్‌ అంతరిక్షానికి ఎదిగాడు! రష్యన్‌ కాస్మోనాట్‌ ఆయన. స్పేస్‌ లోకి వెళ్లిన తొలి మానవుడు అతడే! 34లో పుట్టాడు. 34 ఏళ్లకే చనిపోయాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు. లవ్‌ మ్యారేజ్‌. క్వీన్‌ ఎలిజబెత్‌ ఈ మార్చి 10 న వర్చువల్‌ మీటింగ్‌ లో బ్రిటిష్‌ సైంటిస్టులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యూరీ గగారిన్‌ ప్రస్తావన వచ్చింది. యూరీ అంతరిక్షం నుంచి దిగి వచ్చాక రాణిగారిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసి.. ‘‘అప్పుడు మీకు అతన్ని చూస్తే ఏమనిపించింది హర్‌ మ్యాజెస్టీ..’’ అని ఒక మహిళా సైంటిస్టు క్వీన్‌ ఎలిజబెత్‌ను అడిగారు. ‘రష్యన్‌ లా అనిపించాడు‘ అని క్విప్‌ (హాస్యం) చేశారు క్వీన్‌. నవ్వులే నవ్వులు. బ్రిటిష్‌ సైన్స్‌ వీక్‌ నిన్నటితో ముగిసింది. యూరీపై మళ్లీ కొత్తగా ప్రపంచానికి ఆసక్తి మొదలైంది.

మ్యాగీ అంతరిక్ష శాస్త్రవేత్త. సైన్స్‌ ప్రొఫెసర్‌. వయసు 53. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన యూరీ గగారిన్‌ జీవించి ఉంటే కనుక ఆయన ఇప్పుడు తన 87 ఏళ్ల వయసులో ఉండేవారు. మ్యాగీ బ్రిటన్‌ మహిళ. గగారిన్‌ రష్యన్‌ వ్యోమగామి. వీళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఒకటే.. మ్యాగీకి గగారిన్‌ అంటే పిచ్చి అభిమానం. ఆయన స్ఫూర్తితోనే ఆమె స్పేస్‌ సైంటిస్ట్‌ అయ్యారు. 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చేనాటికి మ్యాగీ పుట్టనే లేదు. అదీ విశేషం. ఈ బుధవారం మరొక విశేషానికి కూడా మ్యాగీ కారణం అయ్యారు. మార్చి 5 నుంచి 12 వరకు ‘బ్రిటన్‌ సైన్స్‌ వీక్‌’ జరిగింది.

పదో తేదీన క్వీన్‌ ఎలిజబెత్‌ వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో కొంత మంది బ్రిటన్‌ సైంటిస్టులతో మాట్లాడారు. ఆ సైంటిస్టులలో మ్యాగీ కూడా ఉన్నారు. తననొక స్పేస్‌ సైంటిస్ట్‌గా పరిచయం చేసుకున్నాక రాణిగారు.. ‘‘స్పేస్‌ సైన్స్‌ మీద నీకెలా ఆసక్తి ఏర్పడింది’’ అని మ్యాగీని అడిగారు. ‘‘హర్‌ మ్యాజెస్టీ.. నేను రష్యన్‌ వ్యోమగామి గగారిన్‌ అభిమానిని. ఆయన కారణంగానే అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి కలిగింది’’ అని చెబుతూ.. ‘హర్‌ మ్యాజెస్టీ.. అంతరిక్షం లోకి వెళ్లి వచ్చాక ఆయన మిమ్మల్ని కలిసేందుకు బకింగ్‌ హ్యామ్‌ పాలెస్‌కు వచ్చారు కదా. అప్పుడు ఆయన్ని చూస్తే మీకేమనిపించింది?!’’ అని అడిగారు. 


బ్రిటిష్‌ సైన్స్‌ వీక్‌  సందర్భంగా బుధవారం (మార్చి 10) సైంటిస్టుల వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో క్వీన్‌ ఎలిజబెత్‌. పచ్చరంగు దుస్తుల్లో ఉన్న మహిళే గగారిన్‌ అభిమాని మ్యాగీ.

‘‘రష్యన్‌’’ అనిపించింది అని క్వీన్‌ జోక్‌ వేశారు. రాణిగారి మాటకు ఒకటే నవ్వులు. ‘‘నా దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఆయన గాల్లో తేలుతూనే ఉన్నారు! స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తొలి మానవుడు కదా! ఆ విజయోత్సాహం ఆయనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాతో రష్యన్‌లోనే మాట్లాడారు’’ అన్నారు ఎలిజబెత్‌. ఆ ఏడాది ఆగస్టులో అంతరిక్షంలోకి, జూలైలో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కి వెళ్లారు గగారిన్‌. ఇప్పుడు మళ్లీ వార్తలోకి వచ్చారు. మ్యాగీనే ఆయన్ని మళ్లీ ఒకసారి మానవాళి మనోపథంలోకి తెచ్చారని చెప్పాలి. గగారిన్‌ అభిమానిని అనిపించుకున్నారు మ్యాగీ!

అంతరిక్షంలో యూరీ గగారిన్‌ సాధించినది పెద్ద విజయమే అయినా భూమి మీద ఆయన జీవించింది అతి స్వల్పకాలం. కేవలం 34 ఏళ్లు. ఆ ముప్పై నాలుగేళ్ల కాలాన్ని భూకక్ష్యలో అతడు గడిపిన గంటా 48 నిముషాలతో పోల్చవచ్చు. కక్ష్యలో ప్రతి నిముషాన్నీ ఆయన ఎంత ఇష్టంగా గడిపారో, తన భార్య, ఇద్దరు కూతుళ్లతో అంతే ఇష్టంగా జీవితాన్ని గడిపారు. 1934 మార్చి 9న తల్లి కడుపులోంచి భూమి మీద పడి, 1961 ఏప్రిల్‌ 12న ఆకాశంలో భూమి చుట్టూ తిరిగి, 1968 మార్చి 27 న భువి నుంచి దివికేగారు గగారిన్‌. ‘మిగ్‌’లో రోజువారీ శిక్షణలో ఉన్నప్పుడు ఆ విమానం పేలిపోయి ఫ్లయిట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తో పాటు గగారిన్‌ కూడా చనిపోయారు.

ఆయన భార్య వాలెంటీనా గగారినా గత ఏడాదే మార్చి 17 న తన 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పెద్ద కూతురు ఎలీనా ఆర్ట్‌ హిస్టారియన్‌. ‘మాస్కో క్రెమ్లిన్‌ మ్యూజియమ్స్‌’ జనరల్‌ డైరెక్టర్‌. చిన్న కూతురు గలీనా ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌. ప్లెఖనోవ రష్యన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎకనమిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌. గగారిన్, వాలెంటీనాలది ప్రేమ వివాహం. ఆమెను తొలిసారి ఆయన మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో మేడే మహోత్సవాలలో చూశారు. అప్పటికి ఆమె మెడికల్‌ టెక్నిషియన్‌. అతడు బాస్కెట్‌బాల్‌ కోచ్‌. 1957లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. వాలెంటీనా మెడికల్‌ టెక్నీషియన్‌గా, గృహిణిగా రెండు పడవల్ని నడిపిస్తే.. రష్యన్‌ పైలట్‌గా ఉన్న గగారిన్‌ ‘సోవియట్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌’ కి అర్హత సంపాదించి స్పేస్‌లోకి తెడ్లు వేశారు!

పదేళ్ల వైవాహిక జీవితంలో గగారిన్‌ తన భార్య, కూతుళ్లతో ప్రతి క్షణాన్నీ అత్యంత విలువైనదిగా గడిపారు. క్వీన్‌ ఎలిజబెత్‌ను కలవడం అయితే అదొక అపురూపమైన సందర్భం గగారిన్‌కి. తొలి కాస్మోనాట్‌గా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు పిల్లలకు ఇవ్వమని ఎలిజబెత్‌ రాణి అందమైన బొమ్మల్ని కానుకగా ఇచ్చారు. తమ తండ్రి స్పేస్‌లోకి వెళ్లడం, తిరిగి రావడం అర్థం చేసుకునేంత వయసు కాదు అప్పటికి ఎలీనా, గలీనాలది!

మరిన్ని వార్తలు