నాకు మరణశిక్ష విధించినా సరే..

21 Dec, 2020 12:51 IST|Sakshi
ఝాంగ్‌ ఝాన్, సిటిజెన్‌ జర్నలిస్ట్‌

ఝాంగ్‌ ఝాన్‌ పౌర పాత్రికేయురాలు. మే10న చైనా ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఈ నెల28న ఝాన్‌పై విచారణ మొదలవుతోంది. ఆమె చేసిన నేరం కరోనాపై వార్తలు రాయడం! ‘నాకు మరణశిక్ష విధించినా సరే నేను నా మాటపైనే ఉంటాను. వాస్తవాలను భూస్థాపితం చేస్తే ఏనాటికైనా అవి మొలకెత్తక మానవు’ అంటున్నారు ఝాన్‌. 

వుహాన్‌లో కరోనా మొదలైనప్పుడు ఆ వార్తల్ని ప్రపంచానికి అందించిన తొలినాళ్ల జర్నలిస్టులలో 37 ఏళ్ల ఝాంగ్‌ ఝాన్‌ కూడా ఒకరు. అంతేకాదు, తమ రిపోర్టింగ్‌లతో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ట తెచ్చిపెట్టారన్న నేరారోపణలపై చైనా జైళ్లలో విచారణ లేకుండా గత ఏడు నెలలుగా మగ్గిపోతున్న జర్నలిస్టులలో కూడా ఝాన్‌ ఒకరు. మిగతా వారంతా పురుషులు. ఝాన్‌ ఒక్కరే మహిళ. షాంఘై జిల్లా, పుడోంగ్‌ పట్టణంలోని జైల్లో ఉన్నారు ఝంగ్‌. ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్ట్‌ చేసిందని ఆరోపిస్తూ జైల్లో నిర్బంధంలో ఉన్న తొలిరోజు నుంచే ఆమె నిరాహార దీక్షలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నాసిక నుంచి ద్రవాహారాన్ని ఎక్కించవలసి వస్తోంది. బాత్రూమ్‌కి కూడా ఆమెను నడిపించుకుని వెళ్లవలసి వస్తోంది. తలపోటు, తల తిరగడం, కడుపు నొప్పి ఆమెను జీవితాన్ని నరకం చేస్తున్నాయి. చదవండి: కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు

మానసికంగా కూడా ఆమె సరిగా లేరు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఎంత బ్రతిమాలుతున్నా ఝాన్‌ తన నిరశనను విరమించడం లేదు. ప్రభుత్వం అయితే పట్టనట్లే ఉంది. ‘‘విచారణ జరిపి, శిక్ష విధించేందుకు అవసరమైనంత వరకే ఆమె జీవించి ఉంటే చాలునని ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఉంది’’ అని ఝాన్‌ న్యాయవాది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ 28 న ‘షాంఘై పుడోంగ్‌ న్యూ ఏరియా పీపుల్స్‌ కోర్టు’లో మొదలయ్యే విచారణపై తన క్లయింట్‌కు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు కలగడం లేదని ఆయన అంటున్నారు! అసమ్మతిని చైనా పాలకులు అరాచకంగా భావించడమే ఇందుకు కారణం.

ఝాంగ్‌ ఝాన్‌ పై ఇప్పటికే అసమ్మతివాది అనే ముద్ర ఉంది. చైనా చట్టాల పరిధిలోకి వచ్చేందుకు నిరాకరిస్తున్న హాంగ్‌కాంగ్‌ కార్యకర్తలకు మద్దతు ఇచ్చిన నేరానికి 2018, 2019లలో ఆమె అనేకసార్లు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలన్నీ ప్రభుత్వానికి తలవొగ్గకపోవడం వల్లనేనని అంటున్న ఝాంగ్‌.. పాతిపెట్టిన నిజాలు ఎప్పటికైనా మొలకెత్తకుండా ఉండవు అని తన శక్తినంతా కూడదీసుకుని గర్జిస్తున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు