ఏది సత్యం? ఏదసత్యం?

27 Jul, 2020 00:31 IST|Sakshi

కొత్త బంగారం

నవల: డెత్‌ ఇన్‌ హర్‌ హాండ్స్‌
రచన: ఓటెస్సా మాష్‌ ఫెగ్‌
ప్రచురణ: పెంగ్విన్‌; జూన్‌ 2020

అతని ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ప్రక్రియలో తనకి తనే అంగీకారయోగ్యం కాలేకపోతున్నానన్న వాస్తవాన్ని విస్మరించిన ఆమె, చివరికి ఆ నిజాన్ని ఎదుర్కోవలసి రావటం – మనిషి జీవితాంతం నటిస్తూ ఉండిపోలేడన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది.

వార్ధక్యంలో జీవిత భాగస్వామిని కోల్పోతే ఏర్పడే ఒంటరితనాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం. పిల్లలు లేని డెబ్బై రెండేళ్ల వెస్టా, భర్త వాల్టర్‌ చనిపోయాక ఏర్పడిన శూన్యాన్ని తట్టుకోలేక తాముంటున్న ఊరూ, విశాలమైన ఇల్లూ విడిచిపెట్టి లెవాంట్‌ అనే ఊరికి వెళ్లిపోతుంది. లెవాంట్‌లో కొనుక్కున్న చిన్న ఇంట్లో కొత్తగా పెంచుకుంటున్న కుక్క చార్లీయే ఆమెకి తోడు. రోజూలాగే ఒక ఉదయం చార్లీని తీసుకుని అడవిలో నడకకి బయల్దేరిన వెస్టాకి దారిలో ఒక కాగితం కనిపిస్తుంది. దాని మీద  ‘ఆమె పేరు మాగ్డా. ఆమెని ఎవరు చంపారో ఎవరికీ, ఎప్పటికీ తెలీదు. నేను మాత్రం కాదు! ఆమె శవం ఇక్కడే ఉంది.’  అని రాసి ఉండటం చూసిన వెస్టా ఉలిక్కిపడుతుంది. రక్తపుమరకలు గానీ, ఘర్షణ జరిగిన సూచనలు గానీ ఏమీ కనిపించవు. నిజంగానే ఏదన్నా హత్య జరిగిందా లేక ఎవరన్నా తనని ఆటపట్టిస్తున్నారా అన్నది ఆమెకి అర్థం కాదు. ఒంటరితనాన్ని మరిచిపోవడం కోసమైనా ఈ మర్డర్‌ మిస్టరీని తానే స్వయంగా ఛేదించాలని అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో మాగ్డా హత్య గురించి ఊహాచిత్రాన్ని గీసుకుని, తనే నాలుగైదు పాత్రలని సృష్టించి మాగ్డా కథని నడిపించే ప్రయత్నం చేయడం వెస్టాని ఒకవిధమైన ఉన్మాద స్థితిలోకి నెడుతుంది. తను సృష్టించిన పాత్రల వలయం లో, తన ఆలోచనల భయాలలో తానే చిక్కుకుని సంక్లిష్ట మానసిక స్థితికి లోనవుతుంది.

ఒకవైపు మాగ్డా హత్య గురించిన ప్రశ్నలు వెస్టా జీవితాన్ని పూర్తిగా ఆక్రమించేస్తూ ఉండగా, మరోవైపు ఆమె వైవాహిక జీవితంలోని జ్ఞాపకాలూ, వైఫల్యాల నీడలూ, ఒంటరితనపు చీకట్లూ ముసురుకుంటూ కథనంలో కలిసిపోతాయి. స్త్రీల వైవాహిక జీవితంలో తామే ఒప్పుకోలేని ఓటములు, ప్రపంచానికి చెప్పుకోలేని వైఫల్యాలు, మేధోపరమైన ఆధిక్యతా ప్రదర్శనతో భార్యలను హింసించే భర్తలు, వయసు పైబడుతున్నవారి ఏకాకి జీవితపు మానసిక అస్థిరత్వాలు – వీటన్నిటి గురించీ రచయిత్రి చేసిన పరిశీలనలు సునిశితంగానూ, విలక్షణంగానూ ఉన్నాయి.

అందగాడూ, తెలివైనవాడూ, ప్రొఫెసరూ అయిన భర్త ఆమె తెలివితేటలనో రూపాన్నో తరచూ విమర్శించడం, చేసే ప్రతిపనినీ ఆక్షేపించటం వెస్టాలో సహజంగానే న్యూనతని కలిగిస్తుంది. అతని ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ప్రక్రియలో తనకి తనే అంగీకారయోగ్యం కాలేకపోతున్నానన్న వాస్తవాన్ని విస్మరించిన ఆమె, చివరికి ఆ నిజాన్ని ఎదుర్కోవలసి రావటం – మనిషి జీవితాంతం నటిస్తూ ఉండిపోలేడన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది.  చనిపోయిన భర్త ఓ శత్రువులా ఇప్పటికీ తన ఆలోచనలలోకి చొరబడి సూచనలూ, విమర్శలూ చేస్తుంటే ఆ స్వరాన్ని ధిక్కరించాలని శతవిధాలా ప్రయత్నించే వెస్టా పట్ల సానుభూతి కలుగుతుంది. ‘క్షమించడం ఒక గుణం కాదు, అదొక నిర్ణయం’ అనే వెస్టా చివరికి భర్తని క్షమించగలుగుతుందా? తాననుభవించిన ప్రేమరాహిత్యపు జీవితాన్ని తలపోసుకుంటూ, ఒంటరితనం కలిగించే మానసిక దౌర్బల్యానికి లోనవుతూ, మాగ్డా ఆలోచనలలో కూరుకుపోతూ, దేనిమీదా ధ్యాస నిలవక, వాస్తవాలూ కల్పనల మధ్య సరిహద్దులు చెరిగిపోయి అన్‌రిలయబుల్‌ నెరేటర్‌గా, తనే ఒక మిస్టరీగా మారుతుంది వెస్టా. ఆలోచనల ముసురులో, బీభత్సమైన పరిస్థితులలో,  కమ్ముకుంటున్న ఉన్మాదావస్థలో నిశిరాత్రి చీకట్లోకి వెస్టా కదిలివెళ్లే ఆఖరి దృశ్యాలు జలదరింపు కలిగించేలా ఉన్నా ఏకాకి అయిన వెస్టా ఆంతర్యపు లోతులను పరిచయం చేయటమే రచయిత్రి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.

తగినంత ఉత్కంఠ, పదునైన ఆలోచనలు, దిగజారుతున్న మానసిక స్థితుల చిక్కుముళ్లు ఉన్న నవల ‘డెత్‌ ఇన్‌ హర్‌ హ్యాండ్స్‌’. ఈనాటి ‘ఆల్బర్ట్‌ కామూ’గా గుర్తింపబడిన అమెరికన్‌ రచయిత్రి ఓటెస్సా మాష్‌ఫెగ్‌ రాసిన ఈ నవల గతనెల విడుదలయింది. భద్రజీవితాన్ని ఆశించి తను తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని తెలుసుకున్న వెస్టా, ‘‘నా కలలనన్నింటినీ నేనే చేజేతులారా చిదిమేసుకున్నాను. భవిష్యత్తుని ఎంచుకునే ప్రక్రియలో నచ్చిన జీవితమా, భద్రజీవితమా అన్న మీమాంసకు గురయినప్పుడు ఒకోసారి మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం,’’ అన్న మాట సార్వజనీనమైన విషాద వాస్తవం. 
పద్మప్రియ

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు