ఫ్రైయిడ్‌ రైస్‌ ఆమ్లెట్‌, మష్రూమ్స్‌ సూప్‌, వెజ్‌ నూడూల్‌ బాల్స్‌ తయారీ ఇలా..

3 Oct, 2021 14:30 IST|Sakshi

కొత్త రుచుల కోసం రెస్టారెంట్లవైపు పరుగులు తీసే అలవాటుకు స్వస్తిపలికే వేళాయే! ఎందుకంటే రెస్టారెంట్‌ లాంటి స్పెషల్‌ డిషెస్‌ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా..

ఫ్రైయిడ్‌ రైస్‌ ఆమ్లెట్‌
కావలసిన పదార్థాలు: 
అన్నం – పావు కప్పు
బోన్‌లెస్‌ చికెన్‌ – పావు కప్పు (ఉడికించినది)
కూరగాయ ముక్కలు – పావు కప్పు (నూనెలో వేయించినవి)
బటర్, టొమాటో సాస్‌ – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున 
గుడ్లు – 3, నీళ్లు – 3 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – తగినంత, మిరియాల పొడి – కొద్దిగా, నూనె – సరిపడా

తయారీ విధానం: 
ముందుగా కళాయిలో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని.. అందులో అన్నం, చికెన్‌ ముక్కలు దోరగా వేయించిన తర్వాత.. బటర్, టొమాటో సాస్, మిరియాల పొడి, కూరగాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈ లోపు ఒక చిన్న బౌల్‌లో గుడ్లు, నీళ్లు, ఉప్పు బాగా కలుపుకుని మరో పాన్‌ మీద ఆమ్లెట్‌ వేసుకుని.. దానిపైన ఈ ఫ్రైయిడ్‌ రైస్‌ వేసుకుని.. ఫోల్డ్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

మష్రూమ్స్‌ సూప్‌
కావలసినవి: 
మష్రూమ్స్‌ ముక్కలు (పుట్టగొడుగులు) – 2 కప్పులు (అదనంగా  2 టేబుల్‌ స్పూన్లు గార్నిష్‌కి నూనెలో వేయించినవి)
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
అల్లం తురుము – అర టీ స్పూన్, మొక్కజొన్న పిండి – పావు కప్పు
కొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంత
మిరియాల పొడి – 1 టీ స్పూన్‌
నీళ్లు – ఒకటిన్నర కప్పులు
బ్రెడ్‌ ముక్కలు – గార్నిష్‌కి (నూనె లేదా నేతిలో వేయించాలి)
చీజ్‌ తురుము, నూనె – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున

తయారీ విధానం: 
ముందుగా ఒక కళాయిలో చీజ్, నూనె వేసుకుని  ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో మష్రూమ్‌ ముక్కలు వేసుకుని 5 నిమిషాలు పైనే మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం మొక్కజొన్న పిండి, కొబ్బరి పాలు పోసి గరిటెతో బాగా కలిపి చిన్న మంట మీద ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆపైన ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడగానే నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చివరిగా హెవెన్‌ క్రీమ్‌ కరిగించి అందులో కలుపుకోవాలి. కొత్తమీర తురుము, వేయించి పెట్టుకున్న 2 టేబుల్‌ స్పూన్ల మష్రూమ్‌ ముక్కలు, బ్రెడ్‌ ముక్కలు వేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగాఉంటుంది.

వెజ్‌ నూడూల్‌ బాల్స్‌
కావలసినవి: 
వెల్లుల్లి రేకలు – 3
ధనియాలు, కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
ఉప్పు – కొద్దిగా
ఓట్స్‌ పౌడర్, జొన్న పిండి, క్యారెట్‌ తురుము, బీట్‌ రూట్‌ తురుము, కొబ్బరి కోరు – పావు కప్పు చొప్పున
గడ్డ పెరుగు – 4 టేబుల్‌ స్పూన్లు
నీళ్లు – కొన్ని
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
నూడూల్స్‌ – బాల్స్‌ చుట్టేందుకు సరిపడా (నీటిలో ఉడికించి పక్కనపెట్టుకోవాలి)

తయారీ విధానం: 
ముందుగా మిక్సీలో వెల్లుల్లి రేకలు, ధనియాలు, కొత్తిమీర తురుము వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్‌లో వేసుకుని, ఓట్స్‌ పౌడర్, జొన్న పిండి, క్యారెట్‌ తురుము, బీట్‌ రూట్‌ తురుము, కొబ్బరి కోరు, గడ్డపెరుగుతో పాటు నీళ్లు అవసరం అయితే కొద్దికొద్దిగా పోసుకుంటూ.. ముద్దలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. నూడూల్స్‌ పొడవుగా పరచి.. రోల్స్‌ మాదిరి బాల్స్‌ చుట్టూ నూడూల్స్‌ చుట్టి, తడి చేత్తో నూడూల్స్‌ చివర్లను బాల్స్‌కి గట్టిగా ఒత్తాలి. నూనెలో దోరగా వేయించుకోవాలి. 

మరిన్ని వార్తలు