KSRTC Strike: నిలిచిపోయిన బస్సులు.. సర్కారు కీలక నిర్ణయం

7 Apr, 2021 09:09 IST|Sakshi
సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ డ్రైవర్లు(ఫొటో కర్టెసీ: పీటీఐ)

ఆర్టీసీ సమ్మె.. ప్రైవేటు బస్సులకు తాత్కాలిక అనుమతి

సాక్షి, బెంగళూరు: ఒకవైపు కరోనా వైరస్‌తో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలమీద ఆర్టీసీ సమ్మె పిడుగు పడింది​​. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మె చేపట్టారు. దీంతో కర్ణాటకలో బస్సులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు విశ్వవిద్యాలయాలు నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. ఇక జీతాలు చెల్లించడంలేదంటూ బస్సు డ్రైవర్ల నిరవధిక సమ్మెకు దిగడంతో, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు, కేఎస్‌ఆర్టీసీ ప్రైవేటు బస్సులకు తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో యడ్డీ సర్కారు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని మంగళవారం తేల్చిచెప్పింది. 

రవాణా శాఖ ఉద్యోగులతో చర్చలు లేదా రాజీ ప్రశ్నేలేదని, సమ్మెను విరమించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసంచేస్తే అలాంటి వారిపై ఎస్మా చట్ట ప్రయోగం తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు, ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణాలో సీఎం యడియూరప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్, బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్‌రెడ్డి, డైరెక్టర్లు శిఖా, శివయోగికళసద్, రవాణాశాఖ కమిషనర్‌ శివకుమార్, వాయువ్య, ఈశాన్యతో సహా 4 ఆర్టీసీ మండళ్ల డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు.

6వ వేతన సిఫార్సులు అసాధ్యం: సీఎస్‌
ఇక మంగళవారం నాటి భేటీ అనంతరం సీఎస్‌ రవికుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాశాఖ ఉద్యోగులకు 6వ వేతన కమిషన్‌ సిఫార్సులను అమలుచేయడం సాధ్యం కాదు. ఉద్యోగులు తక్షణం ధర్నాను విరమించి విధులకు హాజరుకావాలి. గైర్హాజరైతే  వారి వేతనంలో కోత విధిస్తాం. రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట నేతలతో కానీ ఇతరులతో చర్చలు జరిపేది లేదు.  రాజీచర్చలు ముగిసిన అధ్యాయం. విధ్వంసానికి దిగితే కఠిన చర్యలుంటాయి. రవాణా ఉద్యోగుల వేతనాన్ని  8 శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.  

ఇందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. అక్కడ నుంచి అనుమతి లభిస్తే వేతన అంశం పరిష్కారమవుతుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఎలాంటి హామీ  ఇవ్వడం సాధ్యం కాదు’’ అని ఆయన తెలిపారు. ప్రతిరోజు 60 లక్షలమంది ప్రయాణికులు సంచరిస్తున్నారని, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 30 లక్షలకు తగ్గిందని తమకు ప్రతి రోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందని సీఎస్‌ చెప్పారు. ఇది రవాణాశాఖ ఉద్యోగులకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. పదేపదే ధర్నాలకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆందోళనల వల్ల కోవిడ్‌ విస్తరిస్తుందని చెప్పారు.  

ధర్నా చేయొద్దు: డీసీఎం లక్ష్మణ్‌  
రవాణాశాఖ ఉద్యోగుల వేతనం పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తక్షణం సమ్మెను విరమించి విధులకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేతనం పెంచాలని తీర్మానించామని తెలిపారు.  ఎంతమేర అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మొదట ఉద్యోగులు ధర్నా విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మెకు ఉపక్రమించారు.

చదవండి: ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్

మరిన్ని వార్తలు