అక్షరాలతో ఆలయాల అద్భుత యాత్ర

2 May, 2021 13:44 IST|Sakshi

‘‘గుడి అంటే కేవలం ఒక రాతిబొమ్మ మాత్రమే కాదు. గుడి ఒక భావన . ఎప్పుడో ఏ పురాణ కాలంలోనో జరిగిన ఏ ఘట్టంతోనో గుడి ముడి పడి ఉంటుంది. శతాబ్దాల క్రితం చెక్కిన శిల్పం, వందల ఏళ్లుగా మొక్కుతున్న దైవం, ధ్వజస్తంభం పాదాల వద్ద శతాబ్దాల దీపమాలికల నూనె చారికలు, మోగి మోగి ముసలివైనా కంఠం మూగవోని గంటలు కూడా కథలెన్నో చెబుతాయి’’ అని కస్తూరి రాకా సుధాకర్‌ రావు తన ‘అడుగడుగునా గుడి ఉంది’ అనే పుస్తకంలో తన మాటలుగా చెప్పుకున్నారు. 

25 ఆలయాల చరిత్ర ఉన్న ఈ పుస్తకంలో ఆయా ఆలయాలకు సంబంధించిన విశేషాలన్నీ ఇప్పటికే కొన్ని వందలు, వేల వాట్సాప్‌ గ్రూపులలో రచయిత పేరు లేని షేర్లుగా చాలా మంది చదివినవే కావచ్చు. అయితే ఇంకా ‘స్మార్ట్‌’ కాని వారు, సామాజిక మాధ్యమాలకు కాస్త దూరాన్ని పాటించేవారు ఇందులోని విషయాలను హాయిగా చదివి మనో నేత్రాలతోనే ఆయా ఆలయాలను దర్శించి ఆత్మానందాన్ని పొందుతారు. ‘గూగుల్‌ తల్లికి తెలియని గుడి’ అంటూ గోల్కొండ నుంచి భువనగిరి వెళ్లే మార్గంలో అప్పటికే కొన్ని వందల ఏళ్ల నుంచి విలసిల్లుతూ, శిథిలావస్థకు చేరి, అక్కన్న మాదన్నలు పునరుద్ధరించిన వేణుగోపాలుడి ఆలయం గురించిన విశేషాలు అబ్బుర పరుస్తాయి.

మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో తలపై నిప్పుల కుంపటి పెట్టుకుని పదిహేను వందల ఎకరాలలో నడయాడి మరీ జాగీర్దార్‌ను మెప్పించి పెరుమాళ్లు పంతులు కట్టించిన వరదరాజ పెరుమాళ్‌ ఆలయం గురించి చదువుతుంటే తెలియని తన్మయత్వం కలుగుతుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ముదిగోళం గ్రామంలోని ఎలుక జోస్యం చెప్పే ఆలయం, (చిలక జోస్యం కాదు) కోరిన కోరికలు తీర్చే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి గుడి... ఇంకా ఎన్నో విశేషాలతో కూడిన రాకా రాతలకు తోడు ఆయా ఆలయాల అసలు శిల్పాలతో పోటీపడే వేణు మాధవ్‌ గీతలు... చదువరులకు విందు భోజనమే. రచయిత సీనియర్‌ పాత్రికేయులు కావడంతో వ్యర్థ పదాలు, అనవసర వాక్యాలు లేకుండా  పుస్తకంలోని అన్ని శీర్షికలూ ఆసక్తిగా చదివిస్తాయి. 

అడుగడుగున గుడి ఉంది
రచన: కస్తూరి రాకా సుధాకర్‌ రావు
పుటలు: 146; వెల రూ. 100
ప్రతులకు: ప్లాట్‌ నం. 79, 
వీ ఆర్‌ ఆర్‌ ఎన్‌క్లేవ్‌
దమ్మాయిగూడ, హైదరాబాద్‌– 500 083
ఫోన్‌: 9000875952

జ్ఞాపకాల గుబాళింపు
సాధారణంగా డాక్టర్‌ అనగానే వంటికి తెల్లకోటు, మెడలో స్టెత్, డెటాల్, స్పిరిట్‌.. ఇప్పుడైతే శానిటైజర్‌ వాసనా గుప్పుమంటాయి. అయితే ఈవిడేమిటీ, ముఖ పుస్తకం నుంచి ముద్రణాలయాల వరకూ... మామూలు పుస్తకాల నుంచి మహనీయుల మాటల దాకా దేనినీ వదలకుండా పూల గుత్తిలా గుచ్చి దానిని సింపుల్‌గా ‘ఒక భార్గవి’ అని చెప్పేశారు... ఈవిడ మెడికల్‌ డాక్టరే కాదు.. లిటరరీ డాక్టర్‌ కూడానేమో అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. 

జ్ఞాపకాల పొదరిల్లు అంటూ తను కన్ను తెరిచాక చూసిన ఇంటి జ్ఞాపకాలతో మొదలు పెట్టిన భార్గవి ‘మోహనం... సమ్మోహనం’ లో మోహన రాగాన్ని వినిపించారు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారి స్వీయచరిత్ర గురించి చెప్పుకొచ్చారు. అమ్మ కన్నా పెద్ద అమ్మతో తన ఆత్మీయతానుబంధాన్ని వర్ణించారు ‘మమతల పాలవెల్లి మా అమ్మ’లో. ఆ తర్వాత మంగళంపల్లి వారి సురాగాల జల్లులోనూ, పెదనాన్న జ్ఞాపకాలతోనూ గుండె తడి చేస్తారు. తర్వాత ఆపాత మధురం అనే మ్యూజికాలజిస్ట్‌ హాసం రాజాగారి పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఇంకా బోలెడన్ని పండుగలు, పర్వదినాల జ్ఞాపకాలతో గుమ్మెత్తిస్తారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే వృత్తి వైద్యమే అయినా, ప్రవృత్తి అయిన సంగీత, సాహిత్యాల లోతులు తరచే ప్రయత్నంలో సినిమాలూ, పుస్తకాలూ, ప్రముఖ వ్యక్తుల గురించి రాసిన ఈ వ్యాసాల సంకలనంలో  తడమని అంశమంటూ లేనే లేదు. ఒక పక్క పాఠక దేవుళ్లకి సాహితీ నైవేద్యం పెడుతూనే, మరో చెంప అవసరమైన చోట తన వృత్తిగతమైన వైద్య విషయాలను కూడా అలవోగ్గా అందించేయడం ఈ డాక్టరమ్మ కలంకారీతనానికి అద్దం పడుతుంది. అందమైన అక్షరాలు, వాటికి తగ్గట్టు గిరిధర్‌ గౌడ్‌ గీచిన చక్కటి వర్ణచిత్రాలు ఈ పుస్తకానికి సిరాక్షరాలు. 

ఒక భార్గవి
పుటలు: 268, 
వెల రూ. 320
ప్రతులకు: డా. భార్గవి, 
ఫోన్‌ : 08674 253210, 253366; మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు 

– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు