మందులు ఉండవా?నిజమేనా?

12 Jul, 2021 17:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మేడం.. నాకు 33ఏళ్లు. పెళ్లయి మూడేళ్లవుతోంది. పిల్లలు కలగట్లేదని డాక్టర్‌ దగ్గరకి వెళ్లాం. స్పెర్మ్‌కౌంట్‌ తక్కువుందని రిపోర్ట్‌ వచ్చింది. స్పెర్మ్‌కౌంట్‌ పెరగడానికి మందులు ఉండవని విన్నాను. నిజమేనా? మాకు పిల్లలు పుట్టే చాన్స్‌ లేనట్టేనా?
– ఎన్‌. విపుల్‌ కుమార్, చెన్నై

ఆధునిక కాలంలో పిల్లలు కలగకపోవడానికి 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, మిగిలిన 30 శాతం ఇద్దరిలో లోపాలు కారణం అవుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ధూమపానం, మద్యపానం, జంక్‌ఫుడ్‌తో కూడిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి వాటితో పాటు మరెన్నో తెలియని కారణాల వల్ల మగవారిలో స్పెర్మ్‌కౌంట్‌ తగ్గడం, వీర్యకణాల కదలిక, నాణ్యత బాగా తగ్గడం జరుగుతుంది. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఉంటాయి. మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్‌హెచ్‌ఎస్, ఎల్‌ఎస్‌ హార్మోన్ల ప్రభావం, స్క్రోటమ్‌లో (బీజావయవం), రెండు టెస్టిస్‌లలో (వృషణాలు) ఉన్న సెమినీఫెరస్‌ ట్యూబుల్స్‌లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్తేజపడి, దాని ప్రభావం వల్ల వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది.

 అలా ఉత్పత్తయిన వీర్యకణాలు టెస్టిస్‌లో నిలువ ఉండి, అక్కడ కొద్దిగా ఉత్తేజితమై, వ్యాస్‌ డిఫరెన్స్‌ గొట్టం ద్వారా ప్రయాణిస్తూ దారిలో సెమైనల్‌ వెసికిల్స్, ప్రొస్టేట్‌ గ్రంథి నుంచి వెలువడే సెమైనల్‌ ఫ్లూయిడ్‌లో అమినో యాసిడ్స్, ఫ్రక్టోస్‌ వంటి పోషకాలను అందుకుంటూ, వాటి వల్ల వీర్యకణాలు ఇంకా ఉత్తేజితమై యురెత్రా (మూత్రనాళం) ద్వారా బయటకు విడుదలవడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో ఎక్కడ సమస్య వచ్చినా వీర్యకణాల ఉత్పత్తి సరిగా కాకపోవడం, అసలే ఉత్పత్తి కాకపోవడం, వాటి కదలికలో లోపాలు, నాణ్యతలో లోపాలు ఏర్పడతాయి. నాణ్యతలో లోపాలు ఉన్నప్పుడు అవి అండాన్ని ఫలదీకరణ జరపలేవు. కొందరిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇతర రోగ క్రిముల వల్ల కూడా వీర్యకణాల కదలిక, నాణ్యత తగ్గుతుంది. వృషణాలకు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత కావాలి. ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. వేడి వల్ల కూడా వీర్యకణాలు సరిగా ఉత్పత్తి కాలేవు. కొందరిలో బీజకోశంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల రక్తం అక్కడ ఎక్కువసేపు ఉండి, అక్కడ ఉష్ణోగ్రతను పెంచడం వల్ల వీర్యకణాల నాణ్యత తగ్గుతుంది. దీనినే వేరికోసిల్‌ అంటారు.

 ఇక మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని కూడా వీర్యకణాల నాణ్యత తగ్గవచ్చు. మీకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. దానికి కారణాలు తెలుసుకోవడానికి ఎస్‌ఆర్‌– ఎఫ్‌హెచ్‌ఎస్, ఎస్‌ఆర్‌–టెస్టోస్టిరాన్, ఎస్‌ఆర్‌–టీఎస్‌హెచ్, సీబీపీ వంటి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్క్రోటమ్‌ స్కానింగ్‌ వంటి అవసరమైన పరీక్షలు డాక్టర్‌ సలహా మేరకు చేయించి, సమస్య ఎక్కడుందో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స చేయడం జరుగుతుంది. చికిత్సలో భాగంగా ఎఫ్‌హెచ్‌ఎస్, హెచ్‌ఎంజీ, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, యాంటీఆక్సిడెంట్, మల్టీవిటమిన్‌ మాత్రలు వంటివి ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల 50 శాతం మేరకు వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలిక పెరిగే అవకాశాలు ఉంటాయి. వేరికోసిల్‌ సమస్య ఎక్కువగా ఉంటే, దానికి ఆపరేషన్‌ చేయడం జరుగుతుంది. అలాగే యోగా, నడక, బరువు ఎక్కువగా ఉంటే తగ్గడం, ధూమపానం, మద్యపానం వంటివి మానేయడం వంటి జీవనశైలి మార్పులతో పాటు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల కూడా చాలామందిలో వీర్యకణాల సంఖ్య పెరగవచ్చు.

మేడం, నమస్తే! నాకు నెల రోజుల పాప ఉంది. తనకు పుట్టుకతో పచ్చకామెర్లు వచ్చి, పదిహేను రోజులకు తగ్గాయి. అప్పటి నుంచి పాప ఒళ్లు బాగా వేడిగా ఉంటోంది. మూత్రం పోసే ముందు బాగా ఏడుస్తుంది. డాక్టర్‌కి చూపిస్తే, ఇవన్నీ నార్మల్‌ అన్నారు. తనకు వేడి తగ్గడానికి నేను ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చెప్పగలరు.
– జ్యోత్స, ఆమన్‌గల్‌

మీ పాప సమస్యకు, మీ ఆహారపు అలవాట్లకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్కొక్కరి శరీర ఉష్ణోగ్రత ఒక్కోలాగ ఉంటుంది. అది వారి మెటబాలిజమ్‌ను బట్టి, వారిలో హార్మోన్స్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరు పిల్లల్లో మూత్రం బయటకు వచ్చేటప్పుడు అక్కడ మూత్రరంధ్రం తెరుచుకునే క్రమంలో ఏడుస్తారు. కొందరిలో యూరినరీ ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఆ రంధ్రం చిన్నగా ఉన్నా అలా జరగవచ్చు. మీ డాక్టర్‌ సమస్య ఏమీ లేదన్నారు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పాపకు పాలిస్తున్నారు కాబట్టి ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, కొద్దిగా డ్రైఫ్రూట్స్, మాంసాహారులైతే గుడ్డు, చేపలు, బాగా ఉడికించిన మాంసాహారం ఎక్కువగా నూనె, మసాలాలు లేకుండా తీసుకోవచ్చు. రోజుకు కనీసం 2–3 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాలి. ఇలా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీరు, పాప ఆరోగ్యంగా ఉంటారు. 

మరిన్ని వార్తలు