డాన్‌.. డబుల్‌ జీరో నెంబర్‌.. దీని వెనుక పెద్ద కథే ఉంది..

13 Sep, 2021 17:19 IST|Sakshi

Scrap Don: ఆరోజు మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళినవారికి రైల్వే స్క్రాప్‌ యార్డ్‌ సమీపంలో ఓ శవం కనిపించింది. వార్త అందగానే విశాఖపట్టణం 3–టౌన్‌ పోలీసులు రంగంలోకి దిగారు. హతుడి వయసు 35 ఏళ్ళుంటుంది. తెల్ల షర్ట్, బ్లూ ప్యాంటులో వున్నాడు.  శరీరం పైన 5 లోతైన కత్తిపోట్లు ఉన్నాయి. రక్తం మడుగుకట్టింది. హతుడి పేరు గోవిందరావు అనీ, సీతమ్మధారకు చెందిన ఓ రైల్వే స్క్రాప్‌ కాంట్రాక్టరనీ తెలిసింది.

పోలీసులు హత్యాప్రదేశాన్ని కార్డనాఫ్‌ చేసి తమ తతంగం ఆరంభించారు. శవాన్ని పరీక్షించిన డాక్టర్‌ ‘రిగర్‌ మార్టిస్‌’ని బట్టి, హత్య జరిగి సుమారు పది గంటలయినా కావచ్చునని చెప్పాడు. గాయాల లోతును బట్టి హత్యకు ఉపయోగించిన కత్తి పొడవు ఆరేడు అంగుళాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు నిపుణులు. స్నిఫర్‌ డాగ్‌ రప్పించబడింది. అది నేలను వాసన చూస్తూ అక్కడికి సుమారు రెండువందల మీటర్ల దూరంలోని రైల్వే స్క్రాప్‌ యార్డ్‌ కాంపౌండు వెనుక భాగంలో వున్న చిన్నబండల వద్దకు వెళ్ళి ఆగింది.

అక్కడ రెండు ఖాళీ బీరు బాటిల్స్, తినుబండారాలను తినేసి పడేసిన కాగితపు పొట్లాలు, సిగరెట్‌ పీకలు, బూట్ల ఆనవాళ్ళున్నాయి. చెప్పుల ఆనవాళ్ళు కూడా కనిపించాయి. ఓ పాత  తువాలు పీలిక పడివుంది. పరిసరాలను గాలించిన పోలీసులకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న తుప్పల్లో పొడవాటి కత్తి ఒకటి దొరికింది. దానిపైన రక్తం ఎండిపోయి వుంది. హత్యాయుధం అదేనని గ్రహించిన పోలీసులకు– మర్డర్‌ చేశాక హంతకులు ఆ బండల దగ్గర కూర్చుని డ్రింక్‌ చేసివుంటారని అర్థమయింది. 

దుండగులు కూర్చున్న స్థలాన్ని, కత్తిని, సీసాలను, గుడ్డపీలికను వాసన చూసిన శునకం ఓ క్షణంపాటు దిక్కులు చూసి ఓ దిశగా పరుగుతీసింది. కొంతదూరం వెళ్ళాక ఓ పాక వద్ద ఆగింది. అక్కడ చింకిచాప పైన పడుకుని ఉన్నాడు ఓ బిచ్చగాడు. ఓ మూలన ఓ గుడ్డసంచి, అందులో కొన్ని పాతబట్టలు వున్నాయి. పక్కనే చిరిగిన ఓ పాత తుండు కనిపించింది. తమకు దొరికిన గుడ్డపీలిక దానినుంచే చింపబడ్డట్టు గుర్తించారు పోలీసులు. శునకం దాని దగ్గరకు వెళ్ళి భీకరంగా మొరగడంతో తుళ్ళిపడి లేచాడు వాడు. కుక్కను, పోలీసులను చూసి భయంతో ఒణికిపోయాడు. రైల్వే స్క్రాప్‌ యార్డ్‌ దగ్గర జరిగిన హత్య గురించి గద్దించి అడిగితే, తనకేమీ తెలియదని మొత్తుకున్నాడు. రెండు తగిలించి, వాడి తువాలు పీలిక అక్కడికి ఎందుకు వచ్చిందని గద్దించడంతో జరిగిందేమిటో ఏడుస్తూ చెప్పాడు.

గతరాత్రి వాడు బిచ్చమెత్తుకుని అడ్డదారిలో తన పాకకు తిరిగివస్తూంటే, రైల్వే స్క్రాప్‌ యార్డ్‌ కాంపౌండ్‌ వెనుక ఇద్దరు వ్యక్తులు కూర్చుని హిందీలో మాట్లాడుకుంటూ డ్రింక్‌ చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి తనకూ కాస్త డ్రింక్‌ పోయమని అడిగాడు వాడు. కసిరారు వాళ్ళు.  వాడు కదలకుండా బతిమాలుతుంటే.. ‘అరె, చల్‌ బే!’ అంటూ తిట్టారు. అయినా ఆశ చావక ఇంకా అక్కడే నిలుచునివున్నాడు వాడు.

దాంతో వాళ్ళలో ఒకడు కోపంతో లేచి వాడి భుజమ్మీది తుండుగుడ్డను పట్టుకుని లాగి ముందుకు తోసేశాడు. అది పాతది కావడంతో చిరిగి కొంతముక్క కింద పడిపోయింది. వాడు భయంతో గబగబా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. పాకకు వచ్చి అన్నం తిని పడుకున్నాడు. హత్య సంగతి ఎరుగడు. వాళ్ళ ఆకారాలు, వేషభాషలు చూస్తే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గూండాల్లా ఉన్నారనీ చెప్పాడు బిచ్చగాడు. విచారణ ముగిసేంతవరకూ వాణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గోవిందరావు శవానికి ‘పోస్ట్‌మార్టమ్‌’ చేసిన సర్జన్, హత్యా సమయాన్ని రాత్రి 9 గంటలకు కొంచెం అటు ఇటులో తేల్చాడు. పోలీసులు టీమ్స్‌గా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. రాత్రి కానీ, ఉదయం కానీ ఎవరైనా పాసింగ్‌ ట్రక్స్‌లో ఎస్కేప్‌ అయినవారున్నారేమోనని ఆరా తీస్తే చిన్నవాల్తేరు లోని ఓ లాడ్జ్‌లో దొరికారు ఇద్దరు రౌడీలు. హత్యకు ముందురోజున వాళ్ళు బిహార్‌ నుంచి వచ్చి ఆ లాడ్జ్‌లో దిగినట్లు తెలిసింది. లాకప్‌లో పడేసి డ్రెస్సింగ్‌ డౌన్‌ ఇచ్చేసరికి గోవిందరావును చంపింది తామేనని ఒప్పుకున్నారు.  ఆ హత్య వెనుకున్న మోటివ్‌ కోసం ప్రశ్నించిన పోలీసులను వాళ్ళు బైటపెట్టిన విషయాలు షాక్‌కి గురిచేశాయి. 

రైల్వేల్లో ఏడాదికి జనరేట్‌ అయ్యే 20 లక్షల టన్నుల స్క్రాప్‌లోని ఇనుము, స్టీల్, అల్యూమినియం, ఇత్తడి, రాగి విలువ ఇంచుమించు 5 వేల కోట్లుంటుంది. దాన్ని పబ్లిక్‌ వేలం ద్వారా అమ్మేస్తుంటారు. స్క్రాప్‌ కాంట్రాక్టర్స్‌ ఆ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. అది మిక్కిలి లాభసాటి బిజినెస్‌ కావడమే అందుకు కారణం. అయితే, ఆ వేలంపాటను ఓ వ్యక్తి నియంత్రించడం విశేషం! అతని పేరు భానోజీ. స్క్రాప్‌ మాఫియా డాన్‌. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అసన్‌సోల్‌లతో ఆరంభమైన అతని ఆపరేషన్స్‌ అనతికాలంలోనే తూర్పు, దక్షిణ–తూర్పు కోస్తాలకు పాకిపోయాయి.  

‘ఎక్స్‌టార్షన్‌’, ‘మర్డర్‌ త్రెట్‌’ భానోజీ ఆయుధాలు. ఏ జోన్‌లో ఎవరు, ఎప్పుడు వేలంపాటలో పాల్గొనాలో అతను నిర్ణయిస్తాడు. అందుకు ఆ కాంట్రాక్టర్‌ అతను కోరిన సొమ్మును చెల్లించాలి. అంతేకాదు స్క్రాప్‌ని రైల్వే యార్డ్‌ నుండి తరలించేటప్పుడు ఒక టన్నుకు వేయి రూపాయల చొప్పున ‘గూండా టాక్స్‌’ కూడా వసూలు చేస్తుంటారు భానోజీ మనుషులు. ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కాంట్రాక్టర్‌కి భూమి మీద నూకలు చెల్లినట్టే! ఆ సంగతులన్నీ తెలిసినా, తెలియనట్టే వుంటుంది రైల్వే శాఖ.

మునుపు స్క్రాప్‌ కాంట్రాక్టర్స్‌ కొందరు ‘సిండికేట్‌’గా ఏర్పడి వేలాన్ని నియంత్రించేవారు.  భానోజీ రంగప్రవేశం చేశాక సీన్‌ పూర్తిగా మారిపోయింది. అతను చెప్పిందే శాసనం. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా చంపేయసాగాడతను. అందువల్ల ఆయా రాష్ట్రాల్లోని స్క్రాప్‌ కాంట్రాక్టర్స్‌  అంతా కలసి ఓ అసోసియేషన్‌గా ఏర్పడి భానోజీతో ఒప్పందానికి వచ్చారు. నెలనెలా కొంత సొమ్ము అసోసియేషన్‌ తరపున మామూళ్ళు సమర్పించుకుంటే వేలంపాటలో పాల్గొనేందుకు అతను వంతులవారీగా కాంట్రాక్టర్లను ఎంపిక చేసేట్టు.. ఆ కాంట్రాక్టర్‌ అతను కోరిన సొమ్మును చెల్లించేటట్టు ఒడంబడిక జరిగింది. దాన్ని ఉల్లంఘించిన వారు హత్య చేయబడతారు.

చిత్రమేమిటంటే అతనెవరో, ఎలా వుంటాడో, ఎక్కడ వుంటాడో ఎవరికీ తెలియదు. అతని అసలు పేరు కూడా తెలియదు. కాంట్రాక్టర్స్‌కి అతని నుండి ఫోన్‌ వస్తుంది. వారి సెల్‌ఫోన్‌ స్క్రీన్‌ మీద అతని మొబైల్‌ నంబర్‌ కానీ, పేరు కానీ కనపడవు. కేవలం ‘రెండు సున్నాలు (00)’ ప్రత్యక్షమవుతాయి. అందువల్ల అతన్ని ‘డబుల్‌ జీరో’గా వ్యవహరిస్తుంటారంతా.  మాఫియా లీడర్‌కి లొంగిపోయినందుకు అసోసియేషన్‌ని తప్పుపడుతూ, భానోజీ డిక్టాట్స్‌ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు కొందరు యువ కాంట్రాక్టర్స్‌. పర్యవసానంగా వారు హత్యకు గురవసాగారు. వారిలో విశాఖపట్టణానికి చెందిన గోవిందరావు ఒకడు.

ఆ ప్యాటర్న్‌లోనే ఇతర రాష్ట్రాలతో పాటు  హౌరా, సీల్దాల్లోనూ జరగడంతో   బెంగాల్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సి.ఐ.డి. నుండి ఓ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. అది డాన్‌ గురించిన సమాచారాన్ని సేకరించడంలో కొంతవరకు విజయం సాధించింది. భానోజీ బిహార్‌కి చెందినవాడు. నేపాల్‌ని స్థావరంగా చేసుకుని రైల్వే స్క్రాప్‌ మాఫియాని నడుపుతున్నాడు. అతనికి కొందరు రాజకీయనేతల అండదండలే కాక, పోలీసువర్గాల్లోనూ అతని మద్దతుదారులున్నట్టు అనుమానం. అతని పాత ఫొటోగ్రాఫ్‌ని ఎలాగో సంపాదించగలిగారు. 

ఓసారి బొకారో స్టీల్‌ సిటీకి చెందిన ఓ యువ కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ భానోజీని ధిక్కరించే ప్రయత్నం చేశాడు. వేలంపాటలో పాల్గొనబోతున్నట్టు, చేతనైతే తనను ఆపమనీ స్క్రాప్‌ డాన్‌కి సవాల్‌ విసిరాడు. భానోజీకి విషయం తెలియడంతో, ఆ కాంట్రాక్టర్‌కి ఫోన్‌చేసి వేలంపాట సమయంలోనే అతన్ని స్వయంగా పబ్లిక్‌లో చంపుతానని బెదిరించాడు. ఆ సంగతి తెలిసిన పోలీసులు స్క్రాప్‌ డాన్‌ కోసం వల పన్నారు. ఆ యువకాంట్రాక్టర్‌  ధైర్యంగా ఆ వేలంపాటలో పాల్గొన్నాడు. రైల్వే పోలీసులు, లోకల్‌ పోలీసులకుతోడు ప్లెయిన్‌ క్లోత్స్‌ పోలీస్‌మెన్‌ కూడా అచ్చటి జనంలో కలసిపోయి ఉన్నారు డాన్‌ కోసం పరికిస్తూ.

వేలంపాట ముమ్మరంగా సాగుతూన్న సమయంలో ఆ యువకాంట్రాక్టర్‌ పోలీసుల సాక్షిగా  పబ్లిక్‌గా పిస్టల్‌తో కాల్చి చంపబడ్డాడు! ఆ తరువాత విచారణలో తెలిసిందేమిటంటే భానోజీ పోలీస్‌ యూనిఫామ్‌లో వచ్చి ఆ మర్డర్‌ చేసి మాయమయ్యాడని! ఆ సంఘటనతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సంబంధిత రాష్ట్రాలకు చెందిన ఉన్నత పోలీసు అధికారులు కోల్‌కతాలో అత్యవసర సమావేశమయ్యారు.
∙∙ 
నేపాల్‌ రాజధాని ఖట్మండూలోని పార్టీ యానిమల్స్‌ ఫేవరేట్‌ ఏరియా– లజీంపేట్‌.. రాత్రి 9 గంటలు అవుతోంది. ఓ అందమైన యువతి ఆ వీధిలో పరుగెడుతోంది. పోలీసులు ఆమెను తరుముతున్నారు. సందుగొందులు తిరుగుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మెయిన్‌ రోడ్డును చేరుకున్న ఆ యువతి వేగంగా వస్తూన్న ఓ కారుకు అడ్డుపడింది. సడన్‌ బ్రేక్‌తో ఆగింది కారు. కంగారులో కిందపడిపోయిందామె. డ్రైవ్‌ చేస్తూన్న నడివయస్కుడు దిగి వచ్చాడు. అప్పటికే కంగారుగా పైకి లేచి, మోచేతికి తగిలిన గాయాన్ని చూసుకుంటోంది. నేపాలీస్‌ భాషలో కోపంగా అరిచాడతను.‘పోలీసులు తరుముకొస్తున్నారు’ అంటూ మళ్ళీ పరుగెత్తబోయిందామె. సందుమలుపులో ప్రత్యక్షమైన పోలీసుల్ని చూసి, ‘త్వరగా కారెక్కు’ అన్నాడు.

మారు యోచన చేయకుండా ఎక్కేసిందామె. కొంతసేపటికి ఓ విల్లా వద్ద ఆగింది కారు. ఆమె దిగి వెళ్ళిపోతానన్నా వినకుండా లోపలికి తీసుకువెళ్ళాడతను. ‘ఇప్పుడు చెప్పు, పోలీసులు నిన్ను ఎందుకు తరుముతున్నారు? ఏం నేరం చేశావ్‌?’ అనడిగాడు. ఆమె సంశయిస్తూంటే, ‘నిజం చెప్పకపోతే పోలీసులకు ఫోన్‌ చేసి నిన్ను అప్పగిస్తాను’ అని బెదిరించాడు. ఆ యువతి చెబుతూంటే ఆశ్చర్యంతో వింటూండిపోయాడతను. ఆమె పేరు పారెల్‌. ఓ పిక్‌ పాకెట్‌. రెండురోజుల కిందట అరబ్‌ షేక్‌ ఒకడు ఖట్మండూ వచ్చాడు. బత్తీస్‌ పుటలి రోడ్‌లోని ద్వారికా హోటల్లో బసచేశాడు. అతని వద్ద కోటిరూపాయల విలువచేసే వజ్రం ఒకటి ఉందనీ, దాన్ని అమ్మడానికే నేపాల్‌ వచ్చాడనీ తెలిసింది. ఆ యువతి బాయ్‌ ఫ్రెండ్‌ బైజూ కూడా పిక్‌ పాకెటే.

అతని ప్రోద్బలంతో ఆ వజ్రాన్ని దొంగిలించడానికి సిద్ధపడ్డారిద్దరూ. ఏదో మిషతో ఆ రోజు రాత్రి ద్వారికా హోటల్‌కి వెళ్ళి అరబ్‌ షేక్‌ని కలవడానికి ప్రయత్నించారు. అతనికేం అనుమానం వచ్చిందో పోలీసుల్ని పిలిపించాడు. ఆ జంట పారిపోజూసింది. బైజూ దొరికిపోయాడు. ఆమె ఎలాగో తప్పించుకుంది. అంతా విని ‘వజ్రం గురించి నువ్వు చెబుతున్నది నిజమేనా?’ అనడిగాడు. నిజమే అందామె. ‘ఈరాత్రికి నువ్వు బైటకు వెళ్ళడం మంచిదికాదు. తెల్లవారాక ఆలోచిద్దాం’ అన్నాడు. తరువాత ఎవరికో ఫోన్‌ చేసి, కొద్ది నిముషాలు మాట్లాడాడు. మర్నాడు అతను 35 ఏళ్ళ వ్యక్తిని కలిశాడు. ‘భాయ్‌! రాత్రి నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల బ్యాక్‌ గ్రౌండ్‌ చెక్‌ చేశాను. ఆమె చెప్పిందంతా నిజమేనని తేలింది. నయానో భయానో ఆమెను ఒప్పించి ఆ షేక్‌ మీద ప్రయోగిద్దాం. వీలు చూసుకుని వజ్రాన్ని కైవసం చేసుకుందాం’ అన్నాడు.
∙∙ 
కాఠ్మాండూలోని ‘ద ద్వారికా హోటల్‌’ అంతర్జాతీయ అతిథుల తొలి ఛాయిస్‌ అది. ఆ రాత్రి హోటల్‌ డా¯Œ ్స ఫ్లోర్‌లో పారెల్‌ అందాన్ని తిలకించిన అరబ్‌ షేక్‌ ఫ్లాట్‌ అయిపోయాడు. ఆమె వద్దకు వెళ్ళి ‘ఈ రాత్రి నాతో ఉంటే నీపైన దీనార్ల  వర్షం కురిపిస్తాను’ అన్నాడు. అరగంట తరువాత ఇద్దరూ కలసి షేక్‌ ఉంటున్న స్వీట్‌కి వెళ్ళారు. ఇద్దరికీ షేకే స్వయంగా డ్రింక్స్‌ కలిపాడు. అతను దుస్తులు మార్చుకుంటూంటే  చాటుగా అతని డ్రింక్‌లో ఏదో పొడిని కలిపిందామె. అతను వచ్చాక ‘ఛీర్స్‌’ చెప్పుకుని డ్రింక్‌ చేయనారంభించారిద్దరూ. ఐదు నిముషాల తరువాత ఏదో మత్తు ఆవహించడంతో సోఫాలో వెనక్కి వాలిపోయాడు షేక్‌. పారెల్‌ అతన్ని కుదిపిచూసి, సెల్‌లో ఎవరికో ఫోన్‌ చేసింది.

రెండు నిముషాల్లో ‘భాయ్‌’, అతని అనుచరుడూ ప్రవేశించారు. షేక్‌ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి, ‘వెల్‌ డన్‌!’ అంటూ పారెల్‌ని ప్రశంసించి, వజ్రంకోసం ఎడ్జాయినింగ్‌ రూమ్‌లోని ఐరన్‌ సేఫ్‌ తెరవడానికి ఉపక్రమించారు. దానికి డిజిటల్‌ లాక్‌ ఉండడంతో ఎలక్ట్రానిక్‌ కట్టర్‌తో తెరవచూశారు. అదే సమయంలో షేక్‌ నిశ్శబ్దంగా లేచి నిలుచున్నాడు. తలగడ కిందనుంచి రివాల్వర్‌  తీసుకుని సేఫ్‌ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ‘భాయ్‌’ తలకు గురిపెట్టి ‘హ్యాండ్సప్‌ భానోజీ!’అన్నాడు. అదిరిపడ్డారు వాళ్ళు. రెండవ వ్యక్తి చేయి జేబులోకి వెళ్ళబోతే, ‘డోంట్‌ మూవ్, మ్యాన్‌!’ అంటూ షేక్‌ వెనుకే వచ్చిన పారెల్‌ పిస్టల్ని గురిపెట్టింది.
∙∙ 
ఈ సీక్రెట్‌ మిషన్‌లో ప్రభుత్వం చెన్నైకి చెందిన ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ప్రాణ్‌ సహాయాన్ని కోరింది. అతను తన అసిస్టెంట్‌ మిస్‌ గీతతో కలసి నేపాల్‌ వెళ్ళి మూడు నెలలపాటు అక్కడే మకాం వేసి భానోజీ కోసం గాలించాడు. అతని జాడ తెలియగానే, అతన్ని ట్రాప్‌ చేసేందుకు తగిన స్కెచ్‌ వేశాడు. తాను అరబ్‌ షేక్‌గానూ, గీత పారెల్‌గాను మారి వజ్రం పేరిట వలపన్ని భానోజీని హోటల్‌కి రప్పించడం, బంధించడం చేశారు. ఇటు భారత పోలీసులు, అటు నేపాల్‌ పోలీసుల ప్రమేయం లేకపోవడంతో ఆపరేషన్‌ అత్యంత గోప్యంగా, విజయవంతంగా జరిగిపోయింది. 

(యధార్థ సంఘటనల ఆధారంగా మలచిన ఈ కథ వాస్తవంలో ‘మాఫియా డాన్‌’ అసలు పేరు మాధవ్‌ సింగ్‌. కాంట్రాక్టర్లకు అతను ‘డబుల్‌ జీరో’ గానే తెలుసు. బిహార్, నేపాల్‌ సరిహద్దులోని సీతామర్హి జిల్లాలోని బరారీ సొంతూరు. తొలుత మాఫియా డాన్‌ బీరేందర్‌ కింద పనిచేసి ఆ తరువాత తన స్వంత ‘సామ్రాజ్యాన్ని’ ఏర్పరచుకున్నాడు. ఈనాటి వరకు డబుల్‌ జీరోని పోలీసులు అరెస్ట్‌ చేసిన దాఖలాలు లేవు.

చదవండి: బస్‌ నెంబర్‌ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా?

మరిన్ని వార్తలు