రాలని చినుకు చెప్పే చిత్రమైన కథలు! నన్ను చూస్తుంటే... ఏడవండి!!!

18 Sep, 2022 07:31 IST|Sakshi

అమెరికా, యూకే, యూరప్‌లకు చినుకు కరవొచ్చింది...అట్లాంటి ఇట్లాంటిది కాదండోయ్‌! 500 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిది! డ్యాములు అడుగంటిపోయాయి.. నదులూ ఇంకిపోయాయి! వడగాడ్పులతో జనమూ బెంబేలెత్తిపోయారు! అయితే ఏంటి? అంటున్నారా? నిజమే కానీ.. కరువు, వర్షాభావం అనేవి...ఆ ప్రాంతాలకు దూరపుచుట్టాలు కూడా కాదు.  అందుకే 2022 నాటి ఈ వాతావరణ దృగ్విషయానికి ప్రాధాన్యమేర్పడింది... అంతేకాదు.. రాలని చినుకుపుణ్యమా అని గతానికి చెందిన కథలెన్నో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి! ఏమా కథలు.. వాటి విశేషాలంటే...!!!!

స్విట్జర్లాండ్‌ పేరు చెబితే మంచు పర్వతాలు.. లండన్‌  పేరు విన్న వెంటనే అంచనాలకు అందని వాతావరణం గుర్తుకు వస్తాయి. ఈ రెండు ప్రాంతాలే కాదు.. యూరప్‌లోని చాలా దేశాలన్నీ పచ్చగా.. లేదంటే మంచుతో కప్పబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఐదు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో వర్షాభావం.. తత్ఫలితంగా కరవు..  యూరప్‌తో పాటు అమెరికాలోనూ కనిపిస్తోంది. ఏడాది పొడవునా వేసవిని తలపించే ఎండలు.. తరచూ పలుకరించిన వడగాడ్పులతో పాశ్చాత్యదేశాలు అల్లాడిపోతున్నాయి.

ఈ క్రమంలోనే పలు దేశాల్లోని నదులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. బోసిపోయిన ఈ జలవనరులు ఇప్పుడు గత చరిత్ర ఆనవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు మొదలుకొని జర్మన్లు వాడిన యుద్ధ నౌక.. కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడిన రాక్షసబల్లుల ఆనవాళ్లు... మధ్యయుగాల నాటి కరవు పరిస్థితులను సూచించే గుర్తులు బయటపడ్డాయి. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిలో భాగమైన పలు నగరాలు.. చారిత్రక అవశేషాలు కూడా ఈ ఏడాది కరవు పుణ్యమా అని ఇంకోసారి ప్రజలకు గతాన్ని గుర్తు చేస్తున్నాయి!!

ఆఫ్రికా కొమ్ము నుంచి....
2022లో పాశ్చాత్యదేశాలు అనేకం కరవులో చిక్కుకున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికా ఖండంలోని పైభాగం (హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా) మొదలుకొని ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లలో విపరీత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలో భాగమైన ఇథియోపియా, సొమాలియా, కెన్యాల్లో నాలుగేళ్లుగా సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆకలి కేకలు తీవ్రం కాగా.. ఫ్రాన్స్‌లో కోతకొచ్చిన మొక్కజొన్న పంట మొత్తం నశించిపోయింది. ఈ దేశంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందీ అంటే.. ఎండలు పెరిగిపోయి.. ఉప్పునీరు ఎక్కువ ఆవిరవుతూండటం వల్ల దేశంలో ఉప్పు ఉత్పత్తి రెట్టింపు అవుతోంది!!

వర్షాభావం వల్ల జర్మనీలోని రైన్‌  ఓడరేవులో నీరు కాస్తా అడుగంటిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల సరుకుల రవాణా ఆలస్యం అవడం మాత్రమే కాకుండా ధరలు కూడా పెరిగిపోతున్నాయి. జర్మనీలోని పారిశ్రామిక ప్రాంతం గుండా ప్రవహించే రైన్‌ నదిలో నౌకల ద్వారా తిండిగింజలు మొదలుకొని రసాయనాలు, బొగ్గు వంటి అనేక సరుకులు దేశం ఒక మూల నుంచి ఇంకోమూలకు చేరుతూంటాయి. నీళ్లు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు పడవల సామర్థ్యంలో 30 –40 శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇబ్బంది.. జర్మనీ స్థూల జాతీయోత్పత్తిలో 0.5 శాతాన్ని తగ్గిస్తుందని అంచనా. 

విద్యుదుత్పత్తికీ అంతరాయం...
యూరప్‌ వర్షాభావం, కరువు పరిస్థితులు విద్యుత్తు సరఫరాపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. స్పెయిన్‌లో జల విద్యుదుత్పత్తి 44 శాతం వరకూ తగ్గిపోగా, అణువిద్యుత్‌ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. వేడెక్కిన ఇంధనాన్ని చల్లబరచేందుకు తగినన్ని నీళ్లు లేక ఫ్రాన్స్‌లో కొన్ని అణువిద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు కూడా. 

ఇటలీలో బయటపడ్డ బాంబు...
ఇటలీలోని ప్రధాన నది ‘పో’ ఈ ఏటి వర్షాభావం పుణ్యమా అని దాదాపుగా ఎండిపోయింది. దీంతో మాన్‌టువా ప్రాంతంలో నది అడుగు భాగంలోంచి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు ఒకటి బయటపడింది. పేలని ఈ బాంబును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు గాను స్థానికులు సుమారు 3000 మందిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. నదిలో నౌకల రవాణా, పరిసరాల్లోని ట్రాఫిక్‌ను కూడా నిలిపివేసి సుమారు 500 కిలోల బరువున్న బాంబును ఇంకో ప్రాంతానికి తరలించారు.

అంతేకాదు.. ఈ ‘పో’ నదిలోనే 1943లో జర్మనీ వాళ్లు వాడిన భారీ సరుకు రవాణా నౌక ఒకటి కూడా బయటపడింది. కొన్ని నెలల ముందే దీని ఆనవాళ్లు నదిలో కనిపించినప్పటికీ వర్షాభావం కొనసాగడంతో ప్రస్తుతం అది నీటిలోంచి బయటపడినట్లుగా పూర్తిగా కనిపిస్తోంది. ఇక ఇటలీలోని రోమ్‌ నగరానికి వస్తే.. టైబర్‌ నది అడుగంటిన కారణంగా ఎప్పుడో రోమన్ల కాలంలో నీరో చక్రవర్తి కట్టినట్టుగా భావిస్తున్న వంతెన ఒకటి అందరికీ దర్శనమిచ్చింది. ఈ వంతెన క్రీస్తు శకం 50వ సంవత్సరం ప్రాంతంలో కట్టి ఉంటారని అంచనా. 

చర్చీలు, చారిత్రక అవశేషాలు...
యూరోపియన్‌  దేశం స్పెయిన్‌లో వర్షాభావం.. క్రీస్తు పూర్వం ఐదువేల సంవత్సరాల నాటి అవశేషాలను మరోసారి చూసే అవకాశాన్ని  కల్పించింది. యూకేలోని నిలువురాళ్లు స్టోన్‌ హెంజ్‌ గురించి మీరు వినే ఉంటారు. వృత్తాకారంలో ఉండే  ఈ భారీ సైజు రాళ్లను ఎవరు? ఎందుకు? ఏర్పాటు చేశారో ఇప్పటికీ మిస్టరీనే. ఈ స్టోన్‌ హెంజ్‌ తరహా రాళ్లు స్పెయిన్‌ లోనూ ఉన్నాయి. కాకపోతే వాల్డెకానాస్‌ రిజర్వాయర్‌లో ఉంటాయి ఇవి. కాసెరెస్‌ ప్రాంతంలోని ఈ రిజర్వాయర్‌ ఇప్పుడు దాదాపు అడుగంటింది.

డోల్మెన్‌ ఆఫ్‌ గులాడాల్‌ పెరాల్‌ అని పిలిచే ఈ రాతి నిర్మాణాలను జర్మనీ పురాతత్వ శాస్త్రవేత్త హూగో ఓబెర్‌మెయిర్‌ 1926లో గుర్తించారు. అయితే ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వ రాజ్యంలో 1963లో ఈ ప్రాంతంలో రిజర్వాయర్‌ కట్టడంతో డజన్ల కొద్దీ భారీ రాళ్లున్న స్టోన్‌ హెంజ్‌ కాస్తా మునిగిపోయింది. స్పెయిన్‌ , పోర్చుగల్‌ సరిహద్దుల్లోనూ ఓ రిజర్వాయర్‌ పూర్తిగా ఎండిపోవడంతో అసెరెడో పేరున్న గ్రామం ఒకటి బయటపడింది.

రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా ఈ గ్రామం 1992లో మునిగిపోగా 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. అలాగే స్పెయిన్‌ , బార్సిలోనాలోని బ్యుయెన్‌ డియా రిజర్వాయర్‌లో  నీళ్లు ఇంకిపోవడంతో తొమ్మిదవ శతాబ్దం నాటి చర్చి ఒకటి వెలుగు చూసింది. ఇన్నేళ్లుగా నీళ్లలో మునిగి ఉన్నా ఈ చర్చి చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం.

నన్ను చూస్తుంటే... ఏడవండి!!!
నన్ను చూసి ఎడ్వకురా అన్న నానుడి మీరు వాహనాల వెనుక భాగంలో చూసి ఉండవచ్చు కానీ.. యూరప్‌లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా ‘‘నన్ను చూస్తున్నారంటే... ఇక మీకు ఏడుపే మిగిలింది’’ అని రాసున్న రాళ్లు బయటపడ్డాయి. నదుల వెంబడి ఉండే ఈ రాళ్లపైని ఈ రాతలు గతకాలపు కరవు చిహ్నాలన్నమాట. రాతలు కనిపించే స్థాయికి నీటి మట్టం పడిపోయిందంటే.. ముందుంది కరవు కాలం అని హెచ్చరికన్నమాట. మధ్య యూరప్‌ లోని పలు ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వీటిని ‘‘హంగర్‌ స్టోన్స్‌’’ లేదా కరవు రాళ్లని పిలుస్తారు.

చెకస్లోవేకియా పర్వత ప్రాంతం నుంచి జర్మనీ మీదుగా నార్త్‌ సీలోకి ప్రవహించే ఎల్బే నదిలో ఈ ఏడాది ఈ హంగర్‌ స్టోన్స్‌ బయటపడ్డాయి. ఎప్పుడో 1616 తరువాత ఇవి మొదటి సారి మళ్లీ బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. పదిహేనవ శతాబ్దం నాటి ఈ రాయిపై ‘‘వెన్‌  డూ మిచ్‌ సైన్స్‌ ్ డాన్‌  వైన్‌ ’’ అని ఈ రాళ్లపై రాసుంది. దీనిర్థమే ‘‘నన్ను చూస్తూంటే.. ఏడవండి’’ అని. 2013లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. ఏళ్ల కరవు కాటకాలను అనుభవించిన తరువాతే రాళ్లపై ఈ రాతలు ప్రత్యక్షమై ఉంటాయని తెలిపింది. 

17వ శతాబ్దపు ఉద్యానవనాలు...
యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోనూ వర్షాభావం గత చరిత్ర ఆనవాళ్లను కళ్లెదుటకు తెస్తోంది. డెర్బిషైర్‌లో లేడీబౌవర్‌ రిజర్వాయర్‌ నీళ్లు అడుగంటిపోవడంతో 1940 ప్రాంతంలో ఈ రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా జలసమాధి అయిన డెర్‌వెంట్‌ గ్రామమూ అందులోని చర్చి ఇప్పుడు మళ్లీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అలాగే కొలిఫోర్డ్‌ లేక్‌ రిజర్వాయర్‌లో వందల ఏళ్ల క్రితం నాటి వృక్షాల అవశేషాలు బయటపడగా ఇంగ్లాండ్‌ ఆగ్నేయ ప్రాంతంలోని స్వీడన్‌ లో పాతకాలపు ఉద్యానవన అవశేషాలు కనిపిస్తున్నాయి.

17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న లైడయార్డ్‌ పార్క్‌లో ఎండ తాకిడికి గడ్డి మాడిపోవడంతో కిందనున్న నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ముందు కొంచెం పక్కగా వేసిన మొక్కల తాలూకూ గుర్తులిప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. లాంగ్‌లీట్‌ ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యానవన ఆనవాలు ఒకటి బయటపడినట్లు సమాచారం. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఈ ఏడాది కరవు పరిస్థితి ఎంత భీకరంగా ఉందీ అంటే.. ఇంగ్లాండ్‌ మొత్తానికి ఆధారమైన... లండన్‌  మధ్యలో ప్రవహించే థేమ్స్‌కు నీరిచ్చే ప్రాంతాల్లో చుక్క నీరు లేదంటే అతిశయోక్తి కాదేమో!!!

ఈ ఏడాది వేసవిధాటికి  స్పెయిన్‌లోని లిమా నదిపై నిర్మించిన రిజర్వాయర్‌ అడుగంటిపోవడంతో బయటపడిన పురాతన రోమన్‌ గ్రామం. రెండువేల ఏళ్ల కిందటి ఈ గ్రామం రోమన్‌ సామ్రాజ్యకాలంలో  సైనిక స్థావరంగా ఉపయోగపడేదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాటి కట్టడాలు, సైనిక స్థావరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. 

అగ్రరాజ్యం అమెరికాలోనూ...
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది వర్షాభావం తీవ్రంగా ఉంది. కాలిఫోర్నియాలో రాలని చినుకు కారణంగా లేక్‌మీడ్‌ దాదాపుగా అడుగంటిపోయింది. అలాగే టెక్సస్‌ రాష్ట్రంలోని దాదాపు 60 శాతం ప్రాంతం వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. నీళ్లు లేక ఎండిపోయిన జల వనరుల్లో సుమారు 11.3 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాక్షసబల్లుల కాలిముద్రలు బయటపడ్డాయి. టెక్సస్‌లోని డైనోసార్‌ వ్యాలీ స్టేట్‌పార్క్‌లో బయటపడ్డ ఈ పాదముద్రలు అక్రోకాన్‌ థోసారస్‌ అనే రకం రాక్షసబల్లికి చెందిందని స్టేట్‌పార్క్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బతికి ఉండగా ఇది సుమారు 15 అడుగుల ఎత్తు ఉండేదని బరువు ఏడు టన్నుల వరకూ ఉండి ఉండవచ్చునని తెలిపింది.

అలాగే ఈ ప్రాంతంలోనే సారోపొసైడన్‌  రకం రాక్షసబల్లి ఆనవాళ్లూ గ్లెన్‌ రోజ్‌లో బయటపడింది. ఇది బతికుండగా 60 అడుగుల ఎత్తు, 44 టన్నుల బరువు ఉండి ఉండేదని అంచనా. సాధారణ పరిస్థితుల్లో ఈ రాక్షసబల్లుల పాదముద్రలు నీటిలో మునిగి ఉండేవని, పైగా మట్టితో నిండిపోయి అస్సలు కనిపించేవి కావని స్థానికులు తెలిపారు. వర్షం పడితే.. మళ్లీ ఈ పాదముద్రలు నీటిలో మునిగిపోతాయి. అయితే వీటిని వీలైనంత వరకూ జాగ్రత్తగా కాపాడేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు డైనోసార్‌ వ్యాలీ స్టేట్‌ పార్క్‌ అధికారులు చెబుతున్నారు. 

లేక్‌మీడ్‌లోనూ యుద్ధ నౌక...
అమెరికాలోని లాస్‌వేగస్‌కు కొంత దూరంలో ఉండే లేక్‌ మీడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో లేక్‌మీడ్‌ ఒకటి. ఈ సరస్సుపైనే ప్రఖ్యాత హూవర్‌ డ్యామ్‌ నిర్మాణం జరిగింది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది లేక్‌మీడ్‌ సరస్సు సామర్థ్యంలో కేవలం 27 శాతం మాత్రమే నీళ్లు ఉన్నాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే 175 అడుగుల దిగువన లేక్‌మీడ్‌ జలమట్టం ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో హూవర్‌ డ్యామ్‌ ద్వారా జల విద్యుదుత్పత్తిని తగ్గించుకోవడంతోపాటు అరిజోనా, నెవెడా, మెక్సికో ప్రాంతాల్లో నీటి వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఇది వరసుగా రెండో ఏడాది కావడం గమనార్హం. లేక్‌మీడ్‌కు నీటిని అందించే కొలరాడో నదీ పరీవాహక ప్రాంతంలో కొన్నేళ్లు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా

మరిన్ని వార్తలు