Funday Cover Story: ఆర్‌.. ఆర్‌.. ఆర్‌

22 Jan, 2023 09:20 IST|Sakshi

చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి  మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం...  మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా....

వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. 

భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి.

అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్‌ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్‌ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి.

ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్‌.. రీసైకిల్‌.. రీ యూజ్‌! క్లుప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది.

ఎలా మొదలైంది?
ఆర్‌ ఆర్‌ ఆర్‌ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే.

అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్‌ 22న నిర్వహించే ఎర్త్‌ డేకు ఈ ఆర్‌ ఆర్‌ ఆర్‌కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్‌ సెనేటర్‌ గేలార్డ్‌ నెల్సన్‌ ఈ ఎర్త్‌ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. 

ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్‌ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్‌ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్‌ రికవరీ యాక్ట్‌ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్‌ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. 

ఆర్‌ ఆర్‌ ఆర్‌...ఇంతకీ వీటి పరమార్థం?
ఆర్‌ ఆర్‌ ఆర్‌ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. 

ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌లలో మొదటిదైన రెడ్యూస్‌ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి.

మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్‌ కోసం వాడే ప్లాస్టిక్‌ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్‌ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి.

ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్‌ సింక్‌లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్‌ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట.

98 %: వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. 

► 7.5 – 19.9  కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్‌ వస్తువుల పరిమాణం.

► 450 ఏళ్లు: ప్లాస్టిక్‌ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం.

► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్‌ అవుతున్నాయి.

► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్‌ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్‌బోర్డులో 91.4 శాతం రీసైకిల్‌ చేసిన కాగితం.

ఒకే ఒక్క శాతం
చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్‌ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు  70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్‌ కావడం లేదు.  

వాడి వాడి.. మళ్లీ వాడి...
పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్‌ ఆర్‌ ఆర్‌లో రెండోది రీ యూజ్‌. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్‌ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. 

రీ యూజ్‌ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్‌ హ్యాండ్‌ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్‌ హ్యాండ్‌వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం.

ప్రపంచమంతా.... 
ఆర్‌ ఆర్‌ ఆర్‌లలో ఇది చాలా పాపులర్‌. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్‌. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్‌ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్‌ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్‌ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్‌ లాంటి పదార్థాలను రీసైకిల్‌ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్‌ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే.

అందుకే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్‌ విభాగంలోకి ఇటీవలే  వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్‌. యూఎస్‌బీ డ్రైవ్‌లు మొదలుకొని, ఎయిర్‌పాడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్‌ వంటి విలువైన లోహాలకు డిమాండ్‌ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్‌లను తయారు చేసుకోవచ్చు. 

గ్యారీ ఆండర్సన్‌ సృష్టి.. ఈ లోగో!
ఆర్‌ ఆర్‌ ఆర్‌లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్‌ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్‌పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్‌ సంస్థ కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అమెరికా పెట్టిన డిజైన్‌ పోటీల్లో పాల్గొన్న యూఎస్‌సీ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి గ్యారీ అండర్సన్‌ దీన్ని డిజైన్‌ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్‌ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. 

ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు!
భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే...

ఓషన్‌ క్లీనప్‌ ప్రాజెక్టు...
చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్‌ స్లాట్‌ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్‌లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్‌ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్‌ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్‌ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్‌ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా.

ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌ను తొలగించేందుకు 2013లో బోయన్‌ స్లాట్‌ అనే నెదర్లాండ్‌ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్‌స్లాట్‌ స్థాపించిన ఓషన్‌ క్లీనప్‌ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్‌ క్లీనప్‌ సంస్థ ఎనిమిది ఇంటర్‌సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్‌ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్‌ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్‌ స్లాట్‌ ప్రయత్నిస్తున్నాడు. 

డైరెక్ట్‌ కార్బన్‌ క్యాప్చర్‌...
భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్‌డైయాక్సైడ్‌ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్‌ కార్బన్‌ క్యాప్చర్‌ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం.

వేరు చేసిన కార్బన్‌ డైయాక్సైడ్‌ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్‌వర్క్స్‌ ఒకటి. దీంతోపాటు కార్బన్‌ ఇంజినీరింగ్, గ్లోబల్‌ థెర్మోస్టాట్‌లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్‌ డైయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. 

ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్‌  డైయారక్సైడ్‌ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్‌ సంస్థ డీజిల్‌ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్‌ ఇంక్‌గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్‌ క్రాఫ్టస్‌ డిజైన్‌ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్‌గా మారుస్తోంది.

రీసైకిల్‌కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్‌లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్‌కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!!  
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా 

మరిన్ని వార్తలు