ఈ వయసులో పిల్లలను కనడం ఆరోగ్యకరమేనా?

3 Oct, 2022 11:47 IST|Sakshi

నాకు 38ఏళ్లు. కెరీర్‌ గొడవలో పడి పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు కావాలనుకుంటున్నాం. ఈ వయసులో పిల్లల్ని కనడం ఆరోగ్యకరమేనా.. నాకు.. పుట్టబోయే బిడ్డక్కూడా?
– వి. ప్రత్యూష, జామ్‌నగర్‌

35 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గర్భాన్ని అడ్వాన్స్‌డ్‌ మెటర్నల్‌ ఏజ్‌ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ మధ్య చాలామందిని ఈ లేట్‌ ప్రెగ్నెన్సీస్‌తో చూస్తున్నాం. కెరీర్‌ గ్రోత్‌ కోసం జాబ్‌ ప్రయారిటీస్, టార్గెట్స్‌ వల్ల చాలా మంది ప్రెగ్నెన్సీ – చైల్డ్‌బర్త్‌ని వాయిదా వేసుకుంటున్నారు. కానీ వయసు దాటిన తరువాత వచ్చే ప్రెగ్నెన్సీలో ఇటు తల్లికీ.. అటు బిడ్డకూ సమస్యలు తలెత్తుతాయి. లేట్‌ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, హై బీపీ చాన్సెస్‌ పెరుగుతాయి. ఏఆర్‌టీ ఆర్టిఫీషియల్‌ రీప్రొడక్టివ్‌ టెక్నిక్స్‌ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరిగినందువల్ల లేటు వయసు అంటే 40– 45ఏళ్లకూ గర్భం దాల్చే పరిస్థితులను చూస్తున్నాం. అయితే 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే.. పుట్టబోయే బిడ్డకు జెనెటిక్, క్రోమోజోమల్‌ రిస్క్‌ పెరగటం, డౌన్‌సిండ్రోమ్‌ వంటి క్రోమోజోమల్‌ అబ్‌నార్మాలిటీస్‌ చాన్సెస్‌ పెరగడం,  తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, నిలలు నిండకుండానే ప్రసవం, మాయ (ప్లెసెంటా)లో మార్పులు రావడం, బీపీ, సుగర్‌ అటాక్‌ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

సీజేరియన్‌ డెలివరీ చాన్సెస్‌ కూడా పెరుగుతాయి. ఏఆర్‌టీ ద్వారా అంటే ఐవీఎఫ్, ఐవీఐకి ప్రయత్నించినప్పుడు మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీస్‌ అంటే ట్విన్స్, ట్రిప్‌లెట్స్‌ ఉండే అవకాశాలూ పెరుగుతాయి. వీటితో  ఉండే సమస్యలూ ఎక్కువవుతాయి. ఇలాంటి కాంప్లికేషన్స్‌ ఏవీ లేకుండా.. సుఖ ప్రసవంలో పండండి బిడ్డను కనాలనుకుంటే ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్‌కి హాజరవ్వాలి. ముందుగానే బీపీ, సుగర్‌ ఉన్నట్టయితే నియంత్రణలో ఉంచుకోవాలి. బరువు బీఎమ్‌ఐ 30 కంటే ఎక్కువ ఉంటే తగ్గే ప్రయత్నాలు చేయాలి. ఫోలిక్‌ యాసిడ్‌ 5ఎమ్‌జీ మాత్రలు మూడు నెలల ముందునుంచే మొదలుపెట్టాలి. ఫీటల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రెగ్నెన్సీ స్కాన్‌ చేయించుకోవాలి. 35 ఏళ్లు దాటితే ఫెర్టిలిటీ చాన్సెస్‌ కూడా తగ్గుతాయి. మీకు 38 ఏళ్లు అంటున్నారు కాబట్టి మీరు వెంటనే ఒక గైనకాలజిస్ట్‌ను కలసి జనరల్‌ చెకప్‌ చేయించుకోండి. కౌన్సెలింగ్‌ చేసినప్పుడు వేరే డీటైల్స్‌ను కూడా గమనిస్తారు.

నేనొక ఎమ్‌ఎన్‌సీలో మేనేజర్‌ స్థాయిలో పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. అయితే పిల్లలకు సంబంధించి బయాలాజికల్‌ క్లాక్‌ గురించి కాస్త టెన్షన్‌గానే ఉంది. అలాగని ఉద్యోగాన్నీ వదులుకోలేను. సో నేను ఎగ్‌ ఫ్రీజింగ్‌కి వెళ్లొచ్చా? ప్రీజ్‌ అయిన ఎగ్స్‌ వల్ల పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? 
– సీహెచ్‌. సౌమ్య, పుణె

ఎగ్‌ ఫ్రీజింగ్‌ను ‘ఊసైట్‌ క్రయోప్రిజర్వేషన్‌ (oocyte cryopreservation) అంటారు. ఈ ప్రక్రియలో అండాలను అండాశయాల నుంచి సేకరించి ఫ్రీజ్‌ చేసి.. ‘వా ఫెర్టిలైజ్డ్‌ స్టేట్‌(vafertilised state)'’లో ఉంచుతారు. భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఫెర్టిలైజేషన్‌కి యూజ్‌ చేసి ఐవీఎఫ్‌ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలా చూస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల వయసు అమ్మాయిలు ఈ ప్రక్రియను ఎక్కువగా  యాప్ట్‌ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలి మారడం వల్ల చాలా మంది ఆడవాళ్లలో ఊసైట్‌ క్వాలిటీ త్వరగా తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు 30 – 35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ లేనివాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్‌ చేసుకునే ఆప్షన్‌ను చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీజ్‌చేసిన అండాలను పదేళ్ల వరకూ వాడుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్‌ పెరుగుతాయి. కనుక దాన్ని కూడా కన్సిడర్‌ చేసుకోవాలి.

అంతేకాదు ఎగ్స్‌ ఫ్రీజింగ్‌ ప్రక్రియలో కూడా కొన్ని రిస్క్స్‌ ఉంటాయి. ఫ్రోజెన్‌ ఎగ్స్‌ , క్రయోఫీజింగ్‌  ప్రాసెస్‌లో కొన్నిసార్లు డామేజ్‌ కావచ్చు. కంటామినేషన్‌ రిస్క్‌ ఉంటుంది. అండాలను అండాశయాల నుంచి తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించిన కొన్ని రిస్క్స్‌  ఉంటాయి. ఉదాహరణకు పొట్టలో పేగులు, రక్తనాళాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ అండాలను సేకరించడానికి ఇచ్చే హార్మోన్‌ ఇంజెక్షన్స్‌ వల్ల కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి తలెత్తవచ్చు. అయిదు శాతం మందిలో ఇలాంటివి చూస్తాం. ఇవి మందులతో తగ్గిపోతాయి. కానీ 0.1 శాతం కేసుల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. బ్లడ్‌ క్లాట్స్, ఛాతీలో ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి.

ఫ్రోజెన్‌ ఎగ్స్‌తో వచ్చే ప్రెగ్నెన్సీలో బిడ్డకు పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్‌.. సాధారణ ప్రెగ్నెన్సీ ద్వారా పుట్టే బిడ్డకు ఎంత చాన్స్‌ ఉంటుందో అంతే చాన్స్‌ ఉంటుంది. కేవలం ఫ్రీజింగ్‌ ఎగ్స్‌ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వైకల్యాలు అంటూ  ఏమీ ఉండవని పరిశోధనల్లో తేలింది. ఫ్రోజెన్‌ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ సక్సెస్‌ అయ్యే చాన్సెస్‌ 30 శాతం నుంచి 60 శాతం వరకు ఉంటుంది. అది కూడా ఎగ్స్‌ను ఫ్రీజ్‌ చేసే సమయంలో మీ వయసును బట్టే. అయితే ఇక్కడ మీ విషయంలో మీరు మీ ఉద్యోగరీత్యా మీ ఎగ్స్‌ను ఫ్రీజ్‌ చేయాలనుకుంటున్నారు. దీనిని సోషల్‌ ఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటారు. సాధారణంగా క్యాన్సర్‌ బాధితుల్లో  కీమె థెరపీ వల్ల అండాశయాలు ఎఫెక్ట్‌ అవుతాయి. దాంతో భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అలాంటి వారి విషయంలో ప్రెగ్నెన్సీకి మిగిలి ఉన్న ఏకైక మార్గం.. ఎగ్‌ ఫ్రీజింగ్‌. సోషల్‌ రీజన్స్‌కి ఎగ్స్‌ ఫ్రీజింగ్‌ చేసినప్పుడు దాన్నుంచి వచ్చే కాంప్లికేషన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది మరి.

మరిన్ని వార్తలు