నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..

5 Feb, 2023 19:35 IST|Sakshi

మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్‌గా ఉంది. ఇంప్రూవ్‌ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం

బ్రెస్ట్‌ డెవలప్‌మెంట్‌ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్‌ ప్రతి అమ్మాయికి డిఫరెంట్‌గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్‌ గ్రోత్‌ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్‌ అవదు. మస్సాజ్‌లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్‌ సైజ్‌ని, షేప్‌ని చేంజ్‌ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్‌ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్‌ సైజ్‌ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్‌ సైజ్‌ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్‌ బ్రెస్ట్‌ సర్జరీ ద్వారా బ్రెస్ట్‌ సైజ్‌ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా చాలానే ఉంటాయి. స్కార్‌ టిష్యూ ఫామ్‌ అవడం, బ్రెస్ట్‌ ఫీడ్‌ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్‌ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్‌ సిండ్రోమ్‌ అనే జన్యుపరమైన డిజార్డర్‌లో కూడా ఫ్లాట్‌ చెస్ట్‌ అండ్‌ నిపుల్స్‌ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు.

 నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...!
– ఎన్‌. చంద్రప్రభ, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌

నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్‌ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్‌ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్‌ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్‌ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్‌ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్‌ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్‌ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్‌సిండ్రోమ్‌ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్‌ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్‌మెంట్‌ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్‌ స్క్రీనింగ్‌ టెస్ట్స్‌ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్‌ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే.

 నేను కెరీర్‌ ఓరియెంటెడ్‌. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్‌ ఫీడ్‌ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందా?
– రంజనీ ప్రసాద్, పుణె

సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్‌ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్‌ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్‌ ఇండక్షన్‌ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్‌ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్‌ ఫీడ్‌ ట్రై చేయడానికి ప్రిపరేషన్‌ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్‌ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్‌ ఫీడింగ్‌తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్‌ ఫీడ్‌ ఇవ్వనందువల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్‌ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. హైరిస్క్‌ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్‌సీఏ (ఆఖఇఅ) జీన్‌ పాజిటివ్‌ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్‌ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్‌ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్‌ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్‌ ఫీడ్‌ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం.

మరిన్ని వార్తలు