కలప ఉపగ్రహం.. ఎందుకంటే?

11 Jan, 2021 16:40 IST|Sakshi

వింతలోకం

కలపేంటి? ఉపగ్రహమేంటి? ఇదేదో కొయ్యగుర్రంలాంటిదేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఒకసారి అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత మిగిలిన ఉపగ్రహాల మాదిరిగానే పూర్తిస్థాయిలో పనిచేయగల అసలు సిసలు ఉపగ్రహం. ఇప్పటి వరకు ఉపగ్రహాలను అల్యూమినియం వంటి లోహాలు, ప్లాస్టిక్‌ తదితర పదార్థాలతో తయారు చేస్తూ వస్తున్నారు. ఇవి తిరిగి నేలకు చేరుకున్నా, వీటి వ్యర్థాలను పర్యావరణానికి చేటు కలిగించకుండా నిర్మూలించడం ఒక పట్టాన సాధ్యమయ్యే పనికాదు. అలాగే, ఇవి అంతరిక్షంలోనే చక్కర్లు కొడుతూ మిగిలిపోయినా ఇబ్బందే! ఇప్పటికే చాలా ఉపగ్రహ వ్యర్థాలు అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటినే ‘స్పేస్‌జంక్‌’ అంటున్నారు.

ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకే జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటిమో ఫారెస్ట్రీ నిపుణులు కలపతో ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అత్యవసరమైన కొద్ది భాగాలను మాత్రమే అల్యూమినియంతో తయారు చేసినవి అమర్చారు. దీనిని 2023లో అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రపంచంలోనే ఇది తొలి కలప ఉపగ్రహం. నిర్దేశించిన పని పూర్తి చేసుకున్నాక, ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే కాలి బూడిదైపోతుంది. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

చదవండి: వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్‌’

మరిన్ని వార్తలు