పిల్లల కథ: ఎలుగుబంటి పిసినారితనం

9 Sep, 2022 17:31 IST|Sakshi

కౌలూరి ప్రసాదరావు 

చింతలవనంలో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురముండేది. కూతురుని ఆమడ దూరంలో ఉన్న నేరేడుకోనలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లూ, పుట్టలూ వెదికి తేనెని సేకరించేది. దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలిసిందే. అయితే ఆడ ఎలుగు పరమ లోభి. పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త, పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు.

ఒకరోజు ఆడ ఎలుగు ‘నేరేడుకోనకీ పోయి కూతురిని చూసివద్దాం’ అని అడిగింది. ‘నాకు పనుంది. పిల్లాడిని తీసుకుని నువ్వెళ్లు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను. పట్టుకెళ్ళు’ అంది మగ ఎలుగు. ‘ఎందుకూ దండగా?ఎలాగూ అల్లుడు తెస్తాడుగా ’ అంటూ తిరస్కరించింది ఆడఎలుగు. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి ఐదు కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకుని ప్రయాణమైంది ఆడఎలుగు కొడుకు బంటితో. కొంతదూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది.

‘అమ్మా! దాహమేస్తోంది. మంచినీళ్ళు కావాలి’ అన్నాడు. ఆడ ఎలుగు నీళ్ళతిత్తిని వెదకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచి పోయింది. దెయ్యాలగుట్ట దాటితేగాని, నీటికుంట దొరకదు. ఇప్పుడెలా? అనుకుని ‘కాస్త ఓర్చుకో నాయనా! మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తలూపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. ‘వచ్చేశాం! మరొక్క మలుపు’ అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేక పోయాడు. సమీపంలో మరే నీటి తావూ లేదు. ‘పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా!’ దీనంగా అడిగాడు. వాడలా అడగడంతో వాడి దాహం.. కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినపుడే నీరు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. 

ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ‘ఇంకాసేపట్లో గమ్యం చేరతాం. అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే వీపు బద్దలవుతుంది’ అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేక పోయింది. నాలుగడుగులు వేశాక ‘దబ్బు’ మని కూలి,కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆసరికి బిడ్డది నటన కాదు. నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి. వెంటనే సంచీలోంచి నాలుగు కొబ్బరి కాయలు తీసి వెంట వెంటనే కొట్టి, నీళ్ళు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బంటిగాడి నేల కూలాడు. బిడ్డను చూస్తూ  ‘సకాలంలో కొబ్బరినీళ్ళు పట్టించుంటే, నువ్వు దక్కి ఉండేవాడివిరా! నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను’ అంటూ భోరున ఏడ్వసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు, జంతువులూ వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండి పోయాయి.

అంతలో చింతలవనానికే చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది హస్తవాసిగల వైద్యుడిగా పేరు గాంచింది. ఆడ ఎలుగుని గుర్తు పట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడి నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది. కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని, చావలేదని గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుతో ‘ఏడ్వకు. నీ బిడ్డను బతికిస్తాను’ అంది. దాంతో  కోతి కాళ్ళు పట్టుకుంది ఆడ ఎలుగు.. ‘నా దగ్గరున్న సమస్త తేనెని నీకు ధార పోస్తాను. నా బిడ్డని దక్కించు’ అంటూ. 
       
తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి కొన్ని ఆకులు తీసి, నలిపి, బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి. తక్షణమే బంటిగాడు ‘హాఛ్‌’ అంటూ మూడుసార్లు తుమ్మి, పైకి లేచాడు. సంచీలోని చివరి కాయని కొట్టి, తాగించమని ఆడ ఎలుగుకు సూచించింది కోతి. ఆడఎలుగు కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి ‘మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని ‘పొదుపు’ అంటారు. కడుపు మాడ్చుకుని కూడబెడితే అది‘పిసినారితనం’ అవుతుంది. నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు. ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డపేరు మూటగట్టుకున్నావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు. ‘నా ’ అనే వాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం’ అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది. ‘ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను’ అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది.

మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు